హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్‌బోర్డు షాక్ ఇచ్చింది. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహణతోపాటు ప్రవేశాల షెడ్యూల్ విడుదల కాకముందే అడ్మిషన్లు తీసుకొన్న 27 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రూ.లక్ష చొప్పన జరిమానా విధించింది. వీటిలో రెజోనెన్స్ విద్యాసంస్థకు చెందినవి 7, వశిష్ట 4, తపస్య 4, అర్బన్ జూనియర్ కాలేజీ 1, నారాయణ కాలేజీ -1 ఉన్నాయి. వేసవి సెలవుల్లో కొన్ని కాలేజీలు అడ్మిషన్లు, క్లాస్‌లు నిర్వహిస్తున్నాయని ఇంటర్‌బోర్డుకు ఫిర్యాదులందాయి. ఈ మేరకు అధికారులతో తనిఖీలు నిర్వహించి ఆయా కాలేజీలపై జరిమానాలు విధించింది. అయితే కార్పొరేట్ కాలేజీలను వదిలేసి చిన్నాచితకా కాలేజీలపై ఇంటర్‌బోర్డు అధికారులు ప్రతాపం చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు తరగతులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.