ఈ ఏడాదికి 113 పాలిటెక్నిక్ కాలేజీల్లో 26,822 సీట్లు
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరం 133 పాలిటెక్నిక్ కాలేజీల్లో 26 వేల సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీచేయనున్నారు. వీటిలో 11 వేల సీట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉండగా, 14 వేలకు పైగా సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. 2022-23 సంవత్సరానికి 113 పాలిటెక్నిక్ కాలేజీలకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులిచ్చింది. వీటిలో 26,822 సీట్లకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది తొలిసారిగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్ సోమవారం నుంచే ప్రారంభమైంది. ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశమివ్వగా, తొలిరోజే 4,637 విద్యార్థులు స్లాట్ బుక్‌చేసుకున్నారు. 22 వరకు స్లాట్ బుకింగ్‌కు అవకాశమివ్వగా, 20 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, 20 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశమిచ్చారు. విద్యార్థులు https://tspolycet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు.
రెండు కాలేజీలు మూసివేత
ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలోని 2 పాలిటెక్నిక్ కాలేజీలు మూతబడ్డాయి. వీటికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతినిచ్చినా, మూసివేయాలని యాజమాన్యాలు దరఖాస్తు చేయడంతో వాటిని కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించారు. మొత్తంగా ఈ ఏడాదికి 122 కాలేజీల్లో 31,550 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. కానీ రెండు కాలేజీలు మూతపడగా, మరికొన్ని కాలేజీలకు అనుమతుల ప్రక్రియ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇక మైనార్టీ కాలేజీల్లో సగం సీట్లను కన్వీనర్ కోటాలో, మిగతా సగం సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేయనుండటంతో ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్ల సంఖ్య 26 వేలుగా ఉంది.