హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): దేశంలో అపార్ట్మెంట్ సంస్కృతి నానాటికీ విస్తరిస్తున్నది. దీంతో ఫ్లాట్ల కనీస సగటు వైశాల్యం క్రమంగా పెరుగుతున్నది. గత ఐదేండ్లలో ఈ సగటు 24% పెరిగినట్టు రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ ‘అనరాక్’ తేల్చింది. 2019 సంవత్సరంలో 1,050 చదరపు అడుగులుగా ఉన్న ఫ్లాట్ల కనీస సగటు వైశాల్యం ప్రస్తుతం 1,300 చదరపు అడుగులకు చేరినట్టు ఆదివారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రజల అభిరుచులు, జీవనశైలిలో గణనీయ మార్పులు రావడం వల్ల చిన్న ఇండ్లతో సరిపెట్టుకోకుండా విశాలమైన లగ్జరీ ఫ్లాట్లవైపు మొగ్గు చూపుతున్నట్టు ‘అనరాక్’ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి స్పష్టం చేశారు. దీంతో విలాసవంతమైన ఫ్లాట్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్నదని, 2023లో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టుల్లో లక్షకుపైగా యూనిట్లు (దాదాపు 23 శాతం) లగ్జరీ క్యాటగిరీలో ఉన్నాయని తెలిపారు.
హైదరాబాద్లో అత్యధిక సగటు
కొవిడ్ సంక్షోభానంతరం ఇండ్ల ధరలు నానాటికీ పెరుగుతున్నప్పటికీ పెద్ద సైజు ఫ్లాట్లకు డిమాండ్ తగ్గడం లేదని ‘అనరాక్’ వెల్లడించింది. ప్రస్తుతం ఫ్లాట్ల కనీస సగటు వైశాల్యం హైదరాబాద్లో అత్యధికంగా 2,300 చదరపు అడుగులుగా ఉన్నట్టు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఎన్సీఆర్ (1,890 చదరపు అడుగులు), బెంగళూరు (1,484 చదరపు అడుగులు), చెన్నై (1,260 చదరపు అడుగులు), పుణె (1,086 చదరపు అడుగులు) ఉన్నట్టు వివరించింది.