
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నాణ్యతకు మారుపేరైన విజయ ఉత్పత్తులను ఆదరించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వినియోగదారులను కోరారు. ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో విజయ బ్రాండ్‌తో తీసుకొచ్చిన 23 రకాల కొత్త ఉత్పత్తులను ఆయన సోమవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్తీలేని, నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వరంగ సంస్థ పనిచేస్తున్నదని పేర్కొన్నారు. మార్కెట్లో కల్తీలను అరికట్టేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో నూనెగింజల సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. ఏటా మన దేశం సుమారు రూ.80 వేల కోట్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంటుండగా ఇందులో పామాయిల్ వాటా ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానవ నిర్మిత అడవుల్లో తెలంగాణ టాప్
మానవ నిర్మిత అడవుల వృద్ధిలో తెలంగాణ ముం దు వరుసలో ఉన్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన నెక్లెస్‌రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన నర్సరీ మేళాను సందర్శించారు. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు.