=హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ)/మెండోరా: ఎగువ ప్రాంతాలతోపాటు తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 22 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను ప్రస్తుతం 30.3 టీఎంసీలకు చేరుకొన్నది. కాగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16,804 క్యూసెక్కుల వరద వస్తున్నది. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11 టీఎంసీలకు చేరుకొన్నది. కడెం ప్రాజెక్టుకు 6,828 క్యూసెక్కులు వరద వస్తున్నది. కుమ్రంభీం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి సామర్థ్యం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 241.30 మీటర్లకు చేరింది.
కృష్ణాకు వస్తున్న వరద..
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి 43,066 క్యూసెక్కులు, తుంగభద్రకు 60,941 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. రాబోయే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో కృష్ణాకు సైతం భారీగా వరద వచ్చే అవకాశమున్నదని అధికారులు పేర్కొన్నారు.
లక్ష్మీ బరాజ్‌కు తగ్గిన ప్రవాహం
మహదేవపూర్: ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లక్ష్మీ బరాజ్‌కు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. బరాజ్ పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.1 టీఎంసీల నీరు ఉన్నది. గురువారం 33,600 క్యూసెక్కుల వరద వస్తుండగా, అవుట్‌ఫ్లో 61,490 క్యూసెక్కులుగా నమోదైంది.