భూపాలపల్లి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : నాలుగేండ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శనివారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ జే సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అడవి ముత్తారం (మహాముత్తారం) మండల పరిధిలోని ఓ చిన్నారిని భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన రాస కొంరయ్య 2019 డిసెంబర్ 31 రాత్రి ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు అడవిముత్తారం పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అప్పటి కాటారం డీఎస్పీ బోనాల కిషన్ విచారణ చేపట్టి చార్జిషీట్ ఫైల్ చేశారు. విచారణ అనంతరం కొంరయ్యను దోషిగా నిర్ధారిస్తూ 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్టు ఎస్పీ పేర్కొన్నారు.