హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): శతవసంతాలు పూర్తిచేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేయడంలో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయాలని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన రూ.500 కోట్లు వ్యయం కాగల 20 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పూర్వ విద్యార్థులు అందించే నిధుల వినియోగంలో పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. హాస్టళ్లు, అకడమిక్ బ్లాకులు వారే నిర్మించి ఇచ్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించారు. వైస్ చాన్సలర్‌గా ఏడాది కాలం పూర్తిచేసుకున్న ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధిపై నమస్తే తెలంగాణతో మాట్లాడారు. యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా క్లస్టర్ విధానాన్ని తెచ్చామని తెలిపారు. ఉద్యోగార్థుల కోసం సివిల్ సర్వీసెస్ అకాడమీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఆర్ట్స్ కాలేజీ పక్కన రూ.18 కోట్లతో ‘స్టూడెంట్ డిస్కోర్స్ కేంద్రం’ ఏర్పాటు చేశామని చెప్పారు. సెంటినరీ హాస్టల్ చుట్టూ 120 సీసీ కెమెరాలు పెట్టామని, విద్యార్థినుల భద్రత కోసం షీ సెంటర్‌ను నెలకొల్పామని తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా విద్యార్థినుల ప్రవేశాల సంఖ్య 65 శాతానికి పెరగడంతో బాలుర కోసం నిర్మించిన హాస్టల్‌ను విద్యార్థినులకు కేటాయించామని చెప్పారు. విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించేందుకు వైస్ చాన్సలర్ అవార్డును ప్రవేశపెట్టారు. క్యాంపస్‌లోని ఓయూ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండో పసిఫిక్ స్టడీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.
సామాజిక శాస్ర్తాలలో పరిశోధనలకు ఊతమిచ్చేలా ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రిసెర్చ్ సెంటర్, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్’ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయిలో ఓయూకు మరింత గుర్తింపు తెచ్చే విధంగా అంతర్జాతీయ స్థాయి సంస్థలు, యూనివర్సిటీలతో ఎంవోయూ చేసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కోసం పార్ట్‌టైం అధ్యాపకుల నియామకాలు చేపట్టారు. బోధనా, పరిశోధనల కోసం నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడానికి మేధోపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. శతాబ్ది దాటిన యూనివర్సిటీ వైభవం ప్రతిబింబించే విధంగా పైలాన్ నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నామని వీసీ తెలిపారు.