హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుకు ఈసారి అనూహ్య డిమాండ్ పెరిగింది. దీంతో పలు ప్రైవేట్ డీఎడ్ కాలేజీలు యాజమాన్య కోటా సీట్ల ఫీజులను అమాం తం పెంచేశాయి. లక్షలకు లక్షలు వసు లు చేసేందుకు సిద్ధమయ్యా యి. ‘బేరాల్లేవ్.. ఇష్టమైతేనే చేరండి’ అని దబాయిస్తున్నాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని ప్రైవేట్ కాలేజీల్లో ఒక సీటుకు రూ.2.5 లక్షలు పలుకుతుంది. వరంగల్, కీసరలోని కాలేజీల్లో ఇంగ్లిష్ మీడియం ఒక రేటు, తెలుగు మీడియానికి మరోరేటు పలుకుతున్నది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఓ కాలేజీలో తెలుగు మీడియం సీటుకు రూ.2 లక్ష లు పలకడం గమనార్హం. ఇంగ్లిష్ మీడియం అయితే 2.5 లక్షలు చెప్పారట. దాదాపు అన్ని కాలేజీలు రెండు లక్షలకు తగ్గడమే లేదు. నర్సంపేటలోని ఓ కాలేజీలో సీటుకోసం ఓ విద్యార్థి తండ్రి ఆరా తీస్తే ఇప్పుడైతే సీట్లు లేవు.. తర్వాత చూద్దాంలే అన్న సమాధానమే వచ్చింది.
ఈ ఏడాది డీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చా యి. ఈసారి 46,615 మంది దరఖాస్తు చేయగా, వీరిలో 26,442 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. రాష్ట్రంలో 10 ప్రభుత్వ డైట్ కాలేజీలు ఉండగా, 59 ప్రైవేట్ డీఎడీ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 69 కాలేజీల్లో 4,350 సీట్లు ఉన్నా యి. వీటిలో కన్వీనర్ కోటాలో 3,750 సీట్లుండగా, 600 సీట్లు మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్లు కౌన్సెలింగ్‌లోనే దాదాపు భర్తీ అ య్యాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లు 600 ఉండటం, కన్వీనర్ కోటాలో చాలా మందికి సీట్లు రాకపోవడంతో డి మాండ్ పెరిగింది.
గతంలో రూ.12- 15 వేల ఫీజులకు ఒక్కరు కూడా చేరకపోయేది. కానీ, ఇప్పుడు ఇదే సీట్ల కోసం తీవ్రంగా పోటీపడుతున్నారని ఓ ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, ఎస్జీటీ ఖాళీలను 100 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీచేయడం కూడా ఓ కారణమని పేర్కొన్నారు.