చిక్కడపల్లి, ఆగస్టు 24: 1977(పీఓటీ) చట్టాన్ని రద్దు చేసి, అసైన్డ్ భూములు కలిగిన వారికే పూర్తి హక్కులు కల్పించాలని తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రోళ్ల శివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 16 లక్షల కుటుంబాలకు సుమారు 20 లక్షల అసైన్డ్ భూములు ఉన్నాయని తెలిపారు. స్వాంతంత్య్రం అనంతరం అప్పటి ప్రభుత్వం దారిద్యరేఖకు దిగువన ఉన్న భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ, ఓసీలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. వాటికి భద్రత కల్పిస్తామంటూ 1977లో అసైన్డ్ భూముల చట్టం తీసుకొచ్చారని తెలిపారు. ఆ చట్టం నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములను అమ్మడం, కొనడం, లీజుకు ఇవ్వడం, పట్టా మార్పిడి చేయడం కుదరదని తెలిపారు. దీంతో అసైన్డ్ పట్టా పొందిన రైతులు ఆ భూముల మీద హ క్కులు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే పలు కారణాల వల్ల కొందరు అసైన్డ్ భూ ములు కోల్పోయారని, తిరిగి వారికే హక్కులు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బింగి రాములు తదితరులు పాల్గొన్నారు.