హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడులకు పంపిణీ చేసి న డిజిటల్ ఉపకరణాలు మూ ణ్నాళ్లకే మూలనపడ్డాయి. పూర్తి గా వినియోగించకుండానే పాడైపోయాయి. ఫలితంగా లక్షల రూపాయల సామగ్రి నిరుపయోగంగా మారగా, లక్ష్యం నెరవేరలేని పరిస్థితులు నెలకొన్నాయి. డిజిటల్ విద్య, బడుల డిజిటలీకరణ కోసం సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ద్వారా ఏటా భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డిజిటల్ ఇనిషియేటివ్ కింద ట్యాబ్లుడెస్క్టాప్లు, ల్యాప్టాప్లు పంపిణీచేస్తున్నారు. ఇవేకాకుండా కొన్ని సంస్థలు, ఎన్జీవోలు ఎస్సార్ నిధులతో డిజిటల్ ఉపకరణాలు పంపిణీ చేయగా వీటిలో అధికశాతం మూలకు పడ్డాయి.
పనిచేయని 18 వేల ఉపకరణాలు
రాష్ట్రంలో 26 వేల సర్కారు బడులుండగా, 4,400 పైచిలుకు బడుల్లోని 18 వేలకు పైగా డిజిటల్ ఉపకరణాలు పనిచేయడం లేదు. ఉన్నత పాఠశాలల్లోనే అత్యధికంగా పాడయ్యాయి. 13 వేలకు పైగా కంప్యూటర్లు, ల్యాప్లాప్లు, డెస్క్టాప్లు పాడైనట్లు తెలిసింది. ప్రాథమిక పాఠశాలల్లో మరో 5 వేలు చెడిపోయాయి. కంప్యూటర్ల సరఫరాకు టెండర్లు ఆహ్వానించి ఏదో ఒక కంపెనీకి అంటగడుతున్నారు. సదరు సంస్థ లాభాల కోసం నాసిరకం ఉపకరణాలను అందజేస్తున్నది. వాటిని నాలుగు రోజులు వాడగానే పాడవుతున్నాయి.
20 వేల కంప్యూటర్లకు టెండరింగ్..
ఈ విద్యాసంవత్సరం 20 వేల కంప్యూటర్ల కొనుగోలుకు టెండరింగ్ ప్రక్రియలో ఉన్నది. గత అనుభవాల దృష్ట్యా ఈసారైనా విద్యాశాఖ జాగ్రత్తపడాలని నిపుణలు సూచిస్తున్నారు. గతంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు(ఐఎఫ్పీ)లను సైతం బడులకు పంపిణీచేశారు. ఇంత విలువైన ఐఎఫ్పీలను బిగించినా టీచర్లు వీటిని వాడటం లేదు. కొన్ని సాంకేతిక సమస్యలతో పనిచేయడంలేదని టీచర్లు అంటున్నారు. కొన్నింటికి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోగా, మరికొన్నింటికి వెబ్ కెమెరా, స్పీకర్లు పనిచేయడంలేదని చెబుతున్నారు. వీటిని బిగించిన సంస్థే మూడేండ్లపాటు రిపేర్లకు బాధ్యత వహించాలన్న నిబంధన పెట్టారు. అయినా, కొన్నిచోట్ల టెక్నీషియన్లు అందుబాటులో ఉండగా, మరికొన్ని స్పందించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఈసారి ఐదేండ్ల నిబంధన పెట్టాలని టీచర్లు కోరుతున్నారు.