హైదరాబాద్ : జ్ఞాన తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, కవి, రచయిత జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సుమారు పది లక్షల మంది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు రావడం విశేషమన్నారు. నగరంలో వినాయక చవితి ఉత్సవాలు, క్రిస్మస్, రంజాన్ ఎలాగో పుస్తకాల పండుగ కూడా అంతటి ప్రాశస్త్యం పొందుతున్నదన్నారు. మీడియా, రచయితలు, సామాజికవేత్తలు, పుస్తక ప్రియుల నుంచి మన్ననలు పొందిందన్నారు.
గతంలో బుక్ ఫెయిర్స్ అంటే హైదరాబాద్, విజయవాడలో ఉండేవని, ప్రత్యేక రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత ఒక హైదరాబాద్, మరొకటి విజయవాడలో జరుగుతున్నదన్నారు. హైదరాబాద్ నగరంలో ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు జరిగితే, విజయవాడలో జనవరి 1 నుంచి 12 వరకు జరుగుతాయన్నారు.
రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అత్యంత వేగంగా విస్తరించడం, జాతీయంగా ముద్ర వేసుకొని జాతీయ పుస్తక ప్రదర్శనగా నిలదొక్కుకుందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, కోల్‌కతా, రాజస్తాన్, జైపూర్‌కే పరిమితమైన పుస్త ప్రదర్శనలను తెలంగాణ వచ్చిన తర్వాత పల్లె వాకిళ్ల వద్దకు తీసుకెళ్లామని, జిల్లా, మండలాలకు విస్తరింప చేశామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్, థాయ్‌ల్యాండ్, చైనాలోనే అత్యధికంగా పుస్తకాలు చదువుతున్నారని ఇటీవల ఓ సర్వేలో తేలిసిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పుస్తకాలు పఠించే వారి సంఖ్య విశేషంగా పెరిగిందన్నారు. అందరికీ వేదికగా ఈ పుస్తక ప్రదర్శన కొనసాగుతున్నదన్నారు. బుక్ ఫెయిర్ ఫ్రారంభానికి కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
అలాగే సుప్రిం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు కూడా ఆహ్వానం పలికామన్నారు. ఈ ప్రదర్శనలో అన్ని భాషలకు సంబంధించిన, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పబ్లికేషన్స్ పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
పర్యావరణంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, సంగీత, సాహిత్య, సదస్సును కూడా ఏర్పాట చేస్తున్నామన్నారు. ఈ ప్రదర్శన ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 8.30, శని, ఆదివారాలు, ఇతర పబ్లిక్ హాలీడేస్‌లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు.
విద్యార్ధులు, లెక్చరర్లకు ఐడీ కార్డులు చూపిస్తే అనుమతిస్తామన్నారు. ప్రస్తుతం లక్ష పాసులు ఇస్తున్నామని, టికెట్లు నామమాత్రంగా ఉంటుందన్నారు. సమావేశంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సహాయ కార్యదర్శి శోభన్‌బాబు, ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, సభ్యులు సూరిబాబు, మాజీ కార్యదర్శి విభా భారతి తదితరులు పాల్గొన్నారు.