హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : యూకే (బ్రిటన్)కు చెందిన స్కూళ్లు హైదరాబాద్ నగరానికి రానున్నాయి. ఫ్యూచర్సిటీతోపాటు, ఓఆర్ఆర్ శివారు ప్రాంతాల్లో దాదాపు 18 బ్రిటన్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ స్కూళ్ల ఏర్పాటుపై శుక్రవారం హైదరాబాద్లో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, సైబరాబాద్ మున్సిపల్ కమిషన్ శ్రీజన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, యూకే హైకమిషన్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఆయా స్కూళ్లకు అనుమతులిచ్చే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రైవేట్ రంగంలో బ్రిటన్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ పరచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు గల స్కూళ్ల పేరిట సర్కార్ వాటిని స్వాగతిస్తున్నది. రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యార్థుల్లేక, ఎన్రోల్మెంట్ పడిపోయి నిర్వీర్యమవుతున్న ఈ తరుణంలో ఇంటర్నేషనల్ స్కూళ్లకు అనుమతించడంపై విద్యారంగ నిపుణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.