అర్హతల్లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనం
అభ్యంతరాలొచ్చినా ఆగమేఘాలపై నియామకం
రిక్రూట్మెంట్లో అడుగడుగునా ఉల్లంఘనలు
రీ వెరిఫికేషన్‌లో 25 మంది అనర్హుల గుర్తింపు
6 నెలలుగా నివేదికను తొక్కిపెట్టిన అధికారులు
SGT Posts | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు. అర్హులను పక్కనపెట్టి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 25మందికి ఉద్యోగాలిచ్చారు. మిగతా అభ్యర్థుల అభ్యంతరాలను పక్కనపెట్టి ఆగమేఘాల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. విషయం హైకోర్టుకు, లోకాయుక్తకు చేరడంతో ఇప్పుడు మింగలేక, కక్కలేక అన్నట్టుగా అధికారుల పరిస్థితి తయారైంది. ఈ నియామకాల కోసం కొందరు అధికారులు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 15 లక్షలు వసూలు చేసినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా, దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సమర్పించిన వివరాలను బట్టి ఉద్యోగాలివ్వడం ఇందులో మరో వింత.
టీచర్ పోస్టుల భర్తీలో తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అమలుచేశారు. ఇందులో 95 పోస్టులుండగా, దాదాపు 8 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాల అనంతరం 393 మంది అభ్యర్థులను అర్హులుగా తేల్చి, వారిలో నుంచి 32 మందికి ఉద్యోగాలిచ్చారు. మిగిలిన అరవైకి పైగా పోస్టులను ఓపెన్ కోటాకు మళ్లించి భర్తీ చేశారు. పోస్టుల భర్తీకోసం 2024 అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. నవంబర్ 20, 21, 22 తేదీల్లో మరోసారి సర్టిఫికెట్లు పరిశీలించారు. కిందిస్థాయి అధికారులు (లో లెవల్ కమిటీ) సర్టిఫికెట్లను పరిశీలించడంతో 2025 జనవరి 3,4 తేదీల్లో హైలెవల్ కమిటీ సర్టిఫికెట్లను పరిశీలించింది. ఈ క్రమంలో 32 పోస్టుల్లో 25 మంది అనర్హులున్నట్టు తేల్చారు.
హనుమకొండలో ఓ అభ్యర్థి 20 ఏండ్ల వయసులో జూనియర్ క్యాటగిరీలో పోటీలో పాల్గొన్నట్టు సర్టిఫికెట్ సమర్పిస్తే కండ్లు మూసుకుని ఉద్యోగమిచ్చారు. నిజానికి 16 ఏండ్ల లోపు వారినే జూనియర్ క్యాటగిరీకి అనుమతిస్తారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మెరిట్ జాబితాలో ఉన్న 51వ ర్యాంక్ అభ్యర్థికి కాకుండా 88వ ర్యాంక్ అభ్యర్థికి ఉద్యోగమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 15 పోస్టులను ఎక్కువ ర్యాంక్ ఉన్న వారితో కాకుండా తక్కువ ర్యాంక్ ఉన్న వారితో భర్తీచేశారు. జాతీయస్థాయి క్రీడాకారులు సర్టిఫికెట్లు సమర్పించినా సర్టిఫికెట్ నాన్ సబ్మిటెడ్ అని రిమార్క్స్ రాసి అనర్హులని పక్కనపెట్టేశారు.
స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అభ్యర్థులను నాలుగు క్యాటగిరీలుగా విభజించారు. ఫాం-2లో అంతర్ జిల్లా, ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొన్నవారికి ఉద్యోగాలిచ్చారు. ఈ వ్యవహారంలో అధికారులు రవీందర్, చంద్రారెడ్డి, బాలగోపాల్ ప్రమేయమున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో ఇప్పటివరకు మూడుసార్లు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. రీ వెరిఫికేషన్ నివేదికను ఆరు నెలలుగా నివేదికను బయటపెట్టడంలేదు. అనర్హులను భర్తీ చేసినట్టు తేలడంతో స్పోర్ట్స్ అథారిటీ సమర్పించిన నివేదికను విద్యాశాఖ తిప్పి పంపింది. కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మళ్లీ స్పోర్ట్స్ అథారిటీకే పంపించింది. విద్యాశాఖపై స్పోర్ట్స్ అథారిటీ నెపం వేస్తుండగా, విద్యాశాఖ అధికారులేమో ఆ నెపాన్ని స్పోర్ట్స్ అథారిటీ అధికారులపైకి నెడుతున్నారు.
టీచర్ పోస్టుల భర్తీపై విద్యాశాఖ అధికారులు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోగా, భారీ తప్పిదం జరిగినట్టు ఏజీ తేల్చారు. స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ శాఖలు రెండూ సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరే ఉండటంతో పర్యవేక్షణ లేక, అధికారులే అన్నీ తామై వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. 2024 అక్టోబర్ నుంచి అనర్హులు దర్జాగా టీచర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే అంశంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మరికొందరు లోకాయుక్తకు ఫిర్యాదుచేశారు. హైకోర్టు సైతం రీ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించింది. స్కామ్ బయటపడటంతో తనపై వేటు తప్పదన్న ఆలోచనతో ఓ అధికారి బదిలీకి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
సర్టిఫికెట్ ఫిజికల్ వెరిఫికేషనే నిర్వహించలేదు. దరఖాస్తులో సమాచారం ఆధారంగా అధికారులే అర్హులెవరో తేల్చారు.
నేషనల్ పోటీల్లో పాల్గొన్న వారే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానీ, స్టేట్‌మీట్ ఆడిన వారిని అర్హులుగా తేల్చారు. స్టేట్ మీట్ సర్టిఫికెట్లు అడ్మిషన్లకే పనికొస్తాయి. రిక్రూట్మెంట్కు వర్తించవు. కానీ రిక్రూట్మెంట్ కూడా వర్తింపజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు జాతీయస్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలిచ్చారు. కానీ ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్‌లలో జాతీయస్థాయి క్రీడాకారులను పక్కనపెట్టి రాష్ట్రస్థాయి, ఇంటర్ వర్సిటీ ఆటల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలిచ్చారు.