రాంనగర్(కరీంనగర్), జూలై 4: కమీషన్ డబ్బులు మంజూరు చేయకపోగా ఎరువుల బస్తాలు అంటగడుతూ దానికీ రూ.15 లక్షలు డిమాండ్ చేసి ముందస్తుగా లక్ష లంచం తీసుకుంటూ కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన కావటి రాజు డీసీఎంఎస్ అనుసంధానంతో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాడు.
2018 నుంచి వడ్ల కొనుగోలు కమీషన్ రూ.90,16,650 డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వర్రావు అడుగగా రూ.26 లక్షల విలువైన ఎరువులు పంపించి 13 శాతం కమీషన్ తీసుకున్నాడు. మిగతా రూ.64 లక్షలు అడిగితే మరో 15 లోడ్ల ఎరువుల బస్తాలు ఒక్కో లోడ్‌కు రూ.లక్ష ఇస్తే పంపిస్తానని షరతు విధించాడు. ఈ బాధ భరించలేక రాజు ఈ నెల 1న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం మేనేజర్ , జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి తమ చాంబర్లో రాజు నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని రికార్డులను పరిశీలించారు. వీరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.