India | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: ప్రపంచానికి ఎంతో మంది మేధావులను అందించిన భారత్‌లో విద్యారంగం నానాటికీ కుంటుపడుతున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తున్నది. దేశంలోని 14-18 ఏండ్ల యువతలో 86.8% మంది బడుల్లో చేరినప్పటికీ వారిలో 25 శాతం మంది తమ ప్రాంతీయ భాషల్లో కనీసం రెండో తరగతి పాఠ్యపుస్తకాలను కూడా అనర్గళంగా చదవలేకపోతున్నట్టు విద్యారంగ వార్షిక స్థితిగతుల నివేదిక(ఏఎస్ఈఆర్-అసర్) వెల్లడించింది.
దేశీయంగా 26 రాష్ర్టాల్లోని 28 జిల్లాల్లో ప్రథమ్ ఫౌండేషన్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. మూడు అంకెలను ఒక అంకెతో భాగించలేని వారు 50 శాతానికి పైగా ఉన్నారు. కేవలం 43.3 శాతం విద్యార్థులు 3, 4 తరగతుల్లో వాడే ఈ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కేవలం 57.3 శాతం విద్యార్థులు మాత్రమే ఇంగ్లిష్ పదాలను చదవగలుగుతున్నారని నివేదిక పేర్కొన్నది.
2022లో 14 ఏండ్ల వయస్కుల్లో 3.9% మంది, 18 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో 32.6% మంది అసలు విద్యాసంస్థల్లోనే చేరలేదని నివేదిక తేల్చింది. 11, 12 తరగతుల విద్యార్థుల్లో 55.7% మంది ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ స్ట్రీమ్‌ను ఎంచుకున్నట్టు తెలిపింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) స్ట్రీమ్‌ను ఎంచుకునేందుకు యువతులు ఆసక్తి చూపడం లేదని, 2022లో కేవలం 28.1% మంది యువతులు, 36.3% మంది యువకులు ‘స్టెమ్’ స్ట్రీమ్‌లో చేరారని పేర్కొన్నది. 5.6% యువత మాత్రమే వృత్తి శిక్షణ లేదా సంబంధిత కోర్సుల్లో చేరినట్టు స్పష్టం చేసింది.
కొవిడ్ సంక్షోభ సమయంలో చాలా కుటుంబాలు జీవనోపాధిని కోల్పోవడం వల్ల ఎంతో మంది పాత విద్యార్థులు బడుల నుంచి తప్పుకున్నారన్న వాదన నిరాధారమైనదని పేర్కొన్నది. 2022లో పాఠశాలల్లో చేరిన 6-14 ఏండ్ల పిల్లల శాతం గతంలో కంటే మెరుగుపడినట్టు వెల్లడించింది. 2010 సంవత్సరంలో 96.6, 2014లో 96.7, 2018లో 97.2 శాతంగా ఉన్న ఈ రేటు 2022లో 98.4 శాతానికి పెరిగినట్టు అసర్ వివరించింది. 17-18 ఏండ్ల మధ్య వయస్కుల్లో 23.9 శాతం విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారు.
ఖమ్మంలో విద్యార్థుల అభిప్రాయ సేకరణ
సర్వేలో భాగంగా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో విద్యార్థుల అభిప్రాయాలు సేకరించారు. పోలీస్, టీచర్, ఇంజినీర్, డాక్టర్… భవిష్యత్తులో ఏమవుతామంటే అత్యధిక మంది నోటి నుంచే వచ్చే ఉద్యోగాల పేర్లు ఇవే. పోలీసు అవ్వాలని ఉన్నదని 4% మంది అమ్మాయిలు, 9.8% మంది అబ్బాయిలు ఆకాంక్ష వెలిబుచ్చారు. టీచర్ అవుతామన్న వారిలో అత్యధికంగా 15.5 శాతం అమ్మాయిలుంటే, 8.9 శాతం అబ్బాయిలున్నారు. ఇక డాక్టర్ అవుతామన్న వారిలో 14.2 శాతం అమ్మాయిలుంటే, 4.4 శాతం అబ్బాయిలున్నారు.