హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024)లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అగ్రవర్ణాల్లోని బ్రాహ్మణులు ఎక్కువగా కులాంతర వివాహాల వైపు మొగ్గుచూపుతున్నట్టు ఈ సర్వే ద్వారా వెల్లడైంది. ఓసీల్లో 12% మందికి కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. 9.9%తో బీసీ (సీ)కి చెందిన దళిత క్రిస్టియన్లు రెండో స్థానంలో ఉన్నారు. అగ్రవర్ణాల్లో వధువుల కొరతతోనే కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడైంది. భవిష్యత్తులో వివాహం చేసుకొనేందుకు ఆడపిల్లల కోసం బ్రాహ్మణులు ఎదుర్కోబోయే విపత్కర పరిస్థితిని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. సమాజంలో వస్తున్న మార్పులకు ఈ సూచికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
స్త్రీ, పురుష లింగనిష్పత్తిలో రాష్ట్రంలో నిజామాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్టు ఇదే సర్వే ద్వారా వెల్లడైంది. ఈ జిల్లాలో 1,000 మంది పురుషులకు గాను 1,035 మంది మహిళలు ఉన్నారు. మెదక్, ములుగు జిల్లాల్లో అదే వెయ్యి మంది పురుషులకు 1,022 మంది చొప్పున మహిళలు ఉన్నారు. ఆ తర్వాత భద్రాద్రి-కొత్తగూడెంలో 1,019 మంది, కామారెడ్డి జిల్లాలో 1,016 మంది ఉన్నారు. అతి తక్కువగా రంగారెడ్డి జిల్లాలో వెయ్యి మంది పురుషులకు కేవలం 928 మంది మహిళలు ఉన్నారు. మేడ్చల్-మల్కాజిగిరిలో 941, మహబూబ్‌నగర్‌లో 980, వికారాబాద్‌లో 990 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణ జనాభాలో 24.6% మంది 15 నుంచి 29 ఏండ్లలోపు యువకులు ఉన్నారు. మొత్తం జనాభాలో 65 ఏండ్ల వయసు పైబడిన వృద్ధులు 6.9% మంది ఉన్నారు.
9.4 శాతం కుటుంబాలకే ఇండ్లులేవట..
ప్రభుత్వం విడుదల చేసిన సీపెక్ సర్వే ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 3.9% కుటుంబాలకే ఇండ్లులేవని తేల్చారు. వీరిలో ఎస్టీలు 7.1%, ఎస్సీలు 5.8%, బీసీలు 3.5%, ఓసీలు 1.7% ఉన్నారు. మరో 5.5 శాతం మంది గుడిసెల్లో నివసిస్తున్నారు. మొత్తంగా 9.4 శాతం కుటుంబాలకు గృహవసతి లేదు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల కుటుంబాలు ఉండగా, వీరిలో సుమారు 10.5 లక్షల కుటుంబాలకు ఇండ్లులేవనే విషయం ఈ సర్వేద్వారా వెల్లడైంది. ఇండ్ల కోసమే సుమారు 25 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.
కరెంట్‌లేని కుటుంబాలు 6.49 లక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 6.49 లక్షల కుటుంబాలకు (5.8%) కరెంట్ సౌకర్యంలేదు. ఈ విషయం ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో వెల్లడైంది. అలాగే 86.6% కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయం ఉన్నది. 92% కుటుంబాలు ఎల్పీజీని వినియోగిస్తున్నారు. మరో 0.7% బయోగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. సుమారు 6లక్షల కుటుంబాలకు కట్టెల పొయ్యే దిక్కని ఈ సర్వే ద్వారా తెలిసింది.
30% మంది నిరక్షరాస్యులు
రాష్ట్రవ్యాప్తంగా 29.6% మంది నిరక్షరాస్యులు ఉన్నారు. మొత్తం జనాభా 3.70 కోట్లు ఉండగా, వీరిలో సుమారు 1.23 కోట్ల మంది అక్షర భాగ్యానికి నోచలేదు. రాష్ట్రంలోని అత్యధికంగా జోగుళాంబ-గద్వాల జిల్లాలో 44.5% మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వనపర్తి 39.3%, నాగర్‌కర్నూల్ 39.2%, కామారెడ్డి 37, వికారాబాద్ 36% చొప్పున ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే అత్యధికంగా నిరక్షరాస్యులు ఉన్నట్టు సీపెక్ సర్వే గణంకాల ద్వారా తెలుస్తున్నది. సంపూర్ణ అక్షరాస్యత దిశగా పాలకులు ఓవైపు ఊదర గొడుతుండగా వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉండటం గమనార్హం.
అగ్రవర్ణాలకే అధిక ఆదాయం
రాష్ట్రంలోని 78.2% కుటుంబాల వార్షికాదాయం లక్షలోపే ఉన్నది. అగ్రవర్ణాల్లో 43.8% కుటుంబాలు లక్ష కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నాయి. ఎస్టీల్లో 88.2%, ఎస్సీల్లో 86.2%, బీసీల్లో 71% కుటుంబాల చొప్పున లక్షలోపే ఆదాయం పొందుతున్నారు. అలాగే రూ.5 లక్షల కంటే అధికాదాయం పొందుతున్న వారిలో ఓసీలు 13.2%తో అగ్రపథాన ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు కేవలం 2.1% మంది మాత్రమే ఉన్నారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిలో 23.5% మంది ఓసీలే ఉన్నారు. మొత్తంగా అగ్రవర్ణాల కంటే ఎస్సీ, ఎస్టీలు మూడు రెట్లు, బీసీలు 2.7 శాతం రెట్లు వెనుకబడి ఉన్నారు. ఈ గణంకాలు సమాజంలోని ఆర్థిక అంతరాలకు అద్దం పడుతున్నాయి.
ప్రైవేట్ విద్యాసంస్థల వైపు అగ్రవర్ణాలు
విద్యారంగంలోనూ సామాజిక అసమానతలు ఉన్నాయని సీపెక్ సర్వే స్పష్టం చేస్తున్నది. అగ్రవర్ణ పిల్లలు 34% మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటుండగా ఎస్టీల్లో 13%, ఎస్సీలు 15% మంది పిల్లలకే ప్రైవేట్ బడి భాగ్యం దక్కింది. ఇక ఉన్నత విద్యనభ్యసించిన వారిలో అగ్రవర్ణాల వారు 57% ఉండగా ఎస్సీ, ఎస్టీలు 31 శాతానికే పరిమితమయ్యారు.