బీజింగ్: చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో (Heilongjiang Province) ఉన్న బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, మరో 13 గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 3.50 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) జిక్సీ నగర శివార్లలోని బొగ్గు గనిలో (Coal Mine) ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారని, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొంది. ఈ విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది.
చైనాలోని బొగ్గు గనుల్లో ప్రమాదాలు సర్వసాధారణం. దేశవ్యాప్తంగా గతేడాది 168 ప్రమాదాలు జరిగనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 245 మంది మరణించారు. నవంబర్ నెలలో ఇదే ప్రావిన్స్‌లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. అదేవిధంగా సెప్టెంబర్‌లో గ్విజౌ ప్రావిన్సులోని బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు చనిపోయారు.