కామారెడ్డి/బిచ్కుంద, మార్చి 26: పదోతరగతి పరీక్షా కేంద్రం నుంచి గణితం పేపర్ ప్రశ్నలు బయటకు వచ్చాయన్న ప్రచారం కామారెడ్డి జిల్లాలో బుధవారం కలకలం రేపింది. తెల్లకాగితంపై రాసి ఉన్న నాలుగు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సంచలనం సృష్టించింది. జుక్కల్ మండలంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై అధికారులు దర్యాప్తుచేపట్టారు. బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి, డీఈవో రాజు పరీక్షా కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ సీఎస్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు డీఈవో తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లో పనిచేసే వారే ప్రశ్నలను బయటకు పంపించారా? ఇందులో ఎవరెవరి ప్రమేయముంది? తదితర అంశాలపై విచారిస్తున్నట్టు తెలిసింది. నీళ్లు అందించే వ్యక్తి ప్రశ్నలు రాసి ఉన్న పేపర్‌ను బయటకు తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. మ రోవైపు, ఈ ఉదంతంపై డీఈవో రాజు జుక్కల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పేపర్ లీక్ కాలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, విద్యార్థులెవరూ భయపడకుండా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు. అయితే, ప్రశ్నలు బయటకు ఎలా వచ్చాయన్న దానిపై ఎవరూ నోరు మెదపడంలేదు. ఈ అంశాన్ని పోలీసులే తేలుస్తారని చెప్తున్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలోని పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నలు బయటకు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో విచారణ చేపట్టామని డీఈవో రాజు తెలిపారు. ఆయన్ను ‘నమ స్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా.. ప్రశ్నపత్రంలోని కొన్ని ప్రశ్నలు ఒక పేపర్ మీద రాసినట్టు గుర్తించామని అన్నారు. విచారణ పూర్తయ్యాకే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.