హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా పనిదినాలు తగ్గినప్పటికీ 2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్లో పూర్తిస్థాయి సిలబస్‌తో పరీక్షలు నిర్వహించనున్నారు. గతేడాది కరోనా కారణంగా 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవటంతో మొత్తం పనిదినాలు 220కి కుదించారు. ఈ ఏడాది విద్యా క్యాలెండర్‌ను బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం విడుదలచేశారు.
అడ్మిషన్లపై ప్రచారం నిషేధం
అడ్మిషన్ల కోసం ప్రైవేటు కాలేజీలు ప్రచారం చేసుకొంటే వాటి గుర్తింపును రద్దుచేస్తామని ఇంటర్‌బోర్డు హెచ్చరించింది. బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాలు తీసుకోవాలని స్పష్టంచేసింది. అడ్మిషన్ల కోసం మార్కెటింగ్ ఎత్తులు వేయరాదని, ప్రజా సంబంధాల అధికారులను నియమించుకొని కాన్వాసింగ్ చేయరాదని సూచించింది. హోర్డింగ్‌లు, కరపత్రాలు, గోడరాతల్లాంటి ప్రచారాన్ని నిషేధించింది. పత్రికా ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టంచేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూల్ 7, 1997 జీవో-114 ప్రకారం చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తమ అధ్యాపకులను జవాబు పత్రాల మూల్యాంకనానికి పంపించకుంటే క్రమశిక్షణా చర్యలుంటాయని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నీ అకడమిక్ క్యాలెండర్‌ను తప్పనిసరిగా పాటించాలని ఒమర్ జలీల్ స్పష్టంచేశారు.