Liquor Seize | హైదరాబాద్ నగర పరిధిలో విదేశీ మద్యం విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడిలో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వంద విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ నెల 16 సాయంత్రం సఫిల్ గూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్నాడని ఎక్సైజ్ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నల్లకుంట ప్రాంతానికి చెందిన సడిమెల హరికృష్ణ (46) అనే ప్రభుత్వోద్యోగి వద్ద కర్ణాటకకు చెందిన 10 మద్యం బాటిళ్లు దొరికాయని అధికారులు తెలిపారు. తనకు ఈసీఐఎల్ ప్రాంతం శ్రీయుగ ఎంక్లేవ్ -సాకేట్ వాసి కందాడి రఘునాథ రెడ్డి ఆ మద్యం బాటిళ్లు విక్రయించాడని హరికృష్ణ చెప్పాడు.
వెంటనే కందాడి రఘునాథ రెడ్డి ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడి చేసి తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో 750 ఎంఎల్, ఒక లీటర్ కెపాసిటీ గల 90 మద్యం బాటిళ్లు దొరికాయి. వాటిలో ఢిల్లీ, గోవాతోపాటు విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నాయి. తాను తరుచుగా గోవా, ఢిల్లీ వెళుతుంటానని, అక్కడ మద్యం సీసాలు తీసుకొచ్చి హైదరాబాద్ లో అవసరం ఉన్న వ్యక్తులకు అధిక ధరకు విక్రయిస్తానని ఎక్సైజ్ అధికారులకు రఘునాథ రెడ్డి చెప్పాడు. అలాగే సడిమెల హరికృష్ణకు పది బాటిళ్లు విక్రయించినట్లు తెలిపాడు. దీంతో 100 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కందాడి రఘునాథ రెడ్డి, సడిమెల హరికృష్ణలను అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. మద్యం బాటిళ్లలో 78.35 లీటర్ల మద్యం ఉంటుందని, దాని విలువ రూ.4 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు.
ఈ మద్యం సీసాలను పట్టుకున్న మల్కాజిగిరి సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ కుమారస్వామి, కానిస్టేబుళ్లు వీరేశ్, వరలక్ష్మి, కవిత ఉన్నారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు పట్టుకున్న ఎక్సైజ్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహసన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ అభినందించారు.