Telangana | రాష్ట్రంలో పచ్చదనం పెంపును ఉద్యమంగా చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్ కార్యాచరణకు సిద్ధమైంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతున్నది. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మొక్కను నాటడం ద్వారా సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి ఫారెస్ట్రెక్ పార్కులో కేసీఆర్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే సందర్భంగా ఆ పార్కును కూడా సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ కార్యక్రమ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు కోటి వృక్షార్చన కార్యక్రమ ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
మంచిరేవులలో నాడు వందలాది ఎకరాల అటవీ భూమి భవన నిర్మాణ వ్యర్థాలతో డంపింగ్ యార్డుగా మారి, పరిసరాల్లో తీవ్రమై న దుర్వాసన వ్యాపించేది. నేడు అదే ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచే ఫారెస్ట్రెక్ పార్క్‌గా రూపుదిద్దుకున్నది. 256 ఎకరాల స్థలాన్ని అటవీశాఖ, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) సంయుక్తంగా ఫారెస్ట్ ట్రెక్ పార్కుగా తీర్చిదిద్దాయి.
మంచిరేవుల పార్కులో తాగునీటి ప్లాంట్, టాయిలెట్ బ్లాక్, వాచ్ టవర్, గ్రామ దేవత గుడి, ఓపెన్ వ్యాయామశాల, యాంఫీ థియేటర్, జలపాతం, బ్యాలెన్సింగ్ రాళ్లు, పిల్ల ఏనుగు, డేగ ముఖం, రచ్చ బండలు, సిట్టింగ్ బెంచీలను ఏర్పాటు చేశారు.
మంచిరేవులలో ఫారెస్ట్రెక్ పార్క్ వల్ల నెలకు సుమారు రూ.3 లక్షల వరకు ఆదాయం సమకూరనున్నది. 11 మందికి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధి లభించనున్నది. పార్లో రోజూ వందలాది మంది సందర్శకుల సేద తీరనున్నారు. ట్రెకింగ్ సౌకర్యంతో ప్రతి ఆదివారం 2,000 మంది వరకు సందర్శించనున్నారు. పర్యాటకులకు మరింత ఆకర్షణ కోసం చిన్నచిన్న కొండలు సైతం నిర్మించారు.
విస్తీర్ణం – 256 ఎకరాలు
వ్యయం – రూ.7.38 కోట్లు
పొడవు – 5.6 కి.మీ.,
ప్రహరీ – 4.5 కి.మీ.,
మొక్కలు – 50 వేల రకాలు
పొదజాతి – 25 వేల రకాలు
నీటి కుంటలు – 3
ట్రెక్కింగ్ మార్గం – 2 కి.మీ.
వాకింగ్ మార్గం – 4 కి.మీ.