హైదరాబాద్‌కు ప్రతిష్ఠాత్మకమైన మెట్రో భవితవ్యం గందరగోళంలో పడింది. ముఖ్యమంత్రి రేవంత్ దుందుడుకు నిర్ణయాలు, అనాలోచిత చర్యలు, అసమర్థత కారణంగా ప్రాజెక్టు అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. విస్తరణ సంగతి దేవుడెరుగు.. ఉన్న ప్రాజెక్టయినా ఉంటుందో, ఊడుతుందో తెలియని సందిగ్ధం నెలకొన్నది.
కేసీఆర్ హయాంలో హైదరాబాద్ మెట్రో గణనీయమైన పురోగతిని సాధించింది. విస్తరణ, ప్రజాసేవలకుతోడు నిర్వహణ ప్రమాణాలతో దేశంలోనే అత్యుత్తమ మెట్రోగా రాణించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రేవంత్ సర్కార్ మెట్రోరైలుకు మోకాలడ్డటం మొదలుపెట్టింది. విలువైన స్థలాలపై కన్నేసిన కొందరు పెద్దలు.. మెట్రోను బంగారు బాతులా చూడటం ప్రారంభించారు. ఎప్పుడెప్పుడు దాన్ని కోసుకుతిందామనే యావలో ఎడాపెడా నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దుచేశారు. కోర్ సిటీని గాలికొదిలి.. జనమే లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో అన్నారు. కష్టమో నష్టమో సంస్థను నడిపిస్తున్న ఎల్అండ్టీని వెళ్లిపోయేలా బెదిరింపులకు దిగారు. స్వయంగా ప్రభుత్వమే నడుపుతుందని ప్రకటించారు.
తీరా ఇప్పుడేమైంది? తానే నడుపుతానంటూ తొడగొట్టిన ప్రభుత్వం.. మెల్లమెల్లగా చేతులెత్తేస్తున్నది. కేంద్రం సహకరించలేదని సన్నాయి నొక్కులు మొదలుపెట్టింది. ఐఆర్ఎఫ్సీ లోన్ రాలేదని లోగొంతుకతో చెప్తున్నది. నిన్నటిదాకా రూ.30వేల కోట్ల ఆస్తిని రూ.15వేలకే సర్కార్ పరం చేయబోతున్నానంటూ బీరాలు పలికిన ప్రభుత్వం.. ఇప్పుడు 8 నుంచి 11% వడ్డీకి బయటి రుణమే దిక్కని పిల్లికూతలు వినిపిస్తున్నది. ట్రాక్ తప్పిన నిర్ణయాలతో హైదరాబాద్ మెట్రో ఆగమైతున్నది. చిక్కుల్లోపడి కుక్కలు చింపిన విస్తరిలా మారుతున్నది.
మెట్రో టేకోవర్ కోసం ఎల్అండ్టీకి రూ.13,600 కోట్ల బ్యాంక్ రుణాలు చెల్లించాల్సి ఉన్నది. ఆ నిధులను 4 శాతం వడ్డీతోనే సమకూర్చేందుకు ఓ జపాన్ కంపెనీ, ఐఆర్ఎఫ్సీతో ఒప్పందాలు చేసుకున్నం. ప్రస్తుతం ఆ నిధులను ఐఆర్ఎఫ్సీ విడుదల చేయడం లేదు.
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): నిన్నటిదాకా ప్రభుత్వ ప్రకటనల్లో దూసుకుపోయిన హైదరాబాద్ మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టేకోవర్‌కు బ్రేక్‌డౌన్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 1వ తేదీ నుంచే ఎల్అండ్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రావాల్సిన ప్రాజెక్టుపై సందిగ్ధత నెలకొన్నది. మరి ఎప్పట్లో ఈ టేకోవర్ పూర్తవుతుందో అనేది సాక్షాత్త్తు ముఖ్యమంత్రి కూడా ప్రకటించలేకపోతున్నారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్మీట్లో అప్పు ఆగిపోయిందని బీద అరుపులు అరవడమే దీనికి నిదర్శనం. నెపాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీద నెట్టి చేతులెత్తేసినంత పనిచేసిన ముఖ్యమంత్రి సర్కార్ ఖజానా నుంచి బయటకు పోయిన రూ.1,660 కోట్ల ప్రజా ధనానికి బాధ్యులెవరనేది మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రెండో దశ విస్తరణ దేవుడెరుగు… మొదటి దశ టేకోవర్ ప్రక్రియ కూడా మొదటికి రావడంతో మొత్తంగా హైదరాబాద్ మెట్రో అనేదే గందరగోళంలో పడిపోయింది. కాగా, సీఎం ప్రెస్‌మీట్‌తో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు మనుగడలోనే ఒక కుదుపు రావడంతో అసలు ఐఆర్ఎఫ్సీ రుణం అర్ధాంతరంగా ఆగిపోవడం వెనుక అసలు కారణమేమిటనే దానిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. పైకి ముఖ్యమంత్రి రాజకీయ ఆరోపణలు చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతో రుణ ప్రక్రియలో ఏదైనా గందరగోళం నెలకొన్నదా? వడ్డీ రేటులో ఏదైనా తేడా వచ్చిందా? ఇంతకీ ఐఆర్ఎఫ్సీ రుణం అనేది ఒడిసిన కథేనా? రాష్ట్ర ప్రభుత్వం ఇకముందు ఇతర ఆర్థిక సంస్థలను సంప్రదిస్తుందా? ఐఆర్ఎఫ్సీతోనే తిరిగి సంప్రదింపులు కొనసాగిస్తుందా? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఐఆర్ఎఫ్సీ రుణానికి బ్రేక్ పడటం వెనుక ఏదో బలమైన కారణమే ఉన్నదనేది అందరూ చెప్తున్న మాట.
రెండున్నరేండ్లుగా వివాదాలు
గత రెండున్నరేండ్లుగా హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం పట్టాలెక్కించిన ఎయిర్‌పోర్టు మెట్రోను అనాలోచితంగా, అకారణంగా రద్దు చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండో దశ విస్తరణకు గత పార్లమెంట్ ఎన్నికల ముందు పునాది రాయి వేసింది. ఇప్పటికీ అది కొలిక్కి రాలేదు. కేంద్రం నుంచి డీపీఆర్‌కు అనుమతి లేదంటూ ఏడాది, ఏడాదిన్నరపాటు కేంద్రంపై నెపం నెట్టి రేవంత్ సర్కార్ కాలయాపన చేసింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ప్రజలను మభ్యపెట్టింది. ఆ తర్వాత సాంకేతికంగా అనేక సందేహాలు వ్యక్తంచేసిన కేంద్రం.. మొదటి దశ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్అండ్టీతో ఒప్పందం చేసుకోవాలనే షరతు విధించింది. ఆపై సీఎం రేవంత్-కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి చాలాకాలంపాటు సమన్వయంతో పనిచేశారు. సంబంధిత మంత్రిత్వ శాఖతో తాను సంప్రదించానని, టేకోవర్‌కు సంబంధించి కమిటీ ఏర్పాటుకు ఒప్పించానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అప్పట్లో ప్రకటించారు. ఈ మేరకు కమిటీకి సభ్యుల పేర్లను సిఫార్సు చేయాలని కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచించారు.
ఆ తర్వాత టేకోవర్ ప్రక్రియపై అడుగులు పడ్డాయి. అయితే, ఎల్అండ్టీకి చెందిన రూ.13,600 కోట్ల రుణాన్ని ఎలా చెల్లించాలనే దానిపై తీవ్రస్థాయిలో తర్జనభర్జనలు పడిన రాష్ట్ర ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ), జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ)తోపాటు ఐఆర్ఎఫ్సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్)ను సంప్రదించారు. ఇందులో ఏడీబీ, జైకా ఈ ప్రాజెక్టు గిట్టుబాటు కాదనే కారణంతో రుణాన్ని రీషెడ్యూల్ చేసేందుకు ముందుకు రాలేదు. చివరకు ఐఆర్ఎఫ్సీ మాత్రం కేంద్రం పూచీకత్తు, ఆర్బీఐ మ్యాండేట్‌తో రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. అంటే కేంద్రం పూచీకత్తు ఇవ్వడంతోపాటు ఒకవేళ రుణ వాయిదా చెల్లింపుల్లో జాప్యం జరిగితే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినెలా వచ్చే నిధుల నుంచి ఆటోమాటిక్‌గా ఐఆర్ఎఫ్సీ వాయిదా చెల్లింపు జరిగేలా (ఆటో డెబిట్) ఆర్బీఐ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఐఆర్ఎఫ్సీ రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
రుణం ఆగడం వెనుక అసలు మతలబేమిటి?
సాధారణంగా మనం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునేటప్పుడు మొదట్లోనే బ్యాంకు అధికారులు అన్నిరకాల పరిశీలనలు చేసి వాయిదాలు చెల్లిస్తారనే డాక్యుమెంట్ ఆధారాలు వచ్చిన తర్వాత రుణాన్ని మంజూరు చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు పూచీకత్తుదారుల సంతకాలు తీసుకొంటారు. ఆ మేరకు ప్రాసెసింగ్ ఫీజు అంతా చెల్లించిన తర్వాత ఆటోమాటిక్‌గా మన ఖాతాలోకి రుణం వచ్చి పడుతుంది. ఇక్కడ కూడా ఐఆర్ఎఫ్సీ రుణ ప్రక్రియలో అంతా పూర్తయిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. కానీ, లిఖితపూర్వకంగా ఈ రుణానికి హామీ ఇచ్చిన కేంద్రమే రుణం రాకుండా అడ్డుకుంటున్నదని ఆరోపిస్తున్నారు. అందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కారణమని విమర్శిస్తున్నారు. నిజంగా ఒకసారి కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి, చివరకు ఆర్బీఐతోనూ లిఖితపూర్వక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కేంద్రమే తిరిగి రుణం ఇవ్వకుండా ఆపుతుందా? అది సాంకేతికంగా సాధ్యమేనా? ముఖ్యంగా కేంద్రం అలా కొర్రీ పెట్టాలంటే కచ్చితంగా లిఖితపూర్వకంగా ఐఆర్ఎఫ్సీకి లేఖ రాయాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
అలాంటి లేఖ ఏమైనా కేంద్రం నుంచి వెళ్లిందా? లేక ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచన మేరకు కేంద్రం నోటి మాటగా రుణాన్ని ఆపండి.. అంటే ఆగుతుందా? ఇంతకీ… రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన రూ.176 కోట్ల ట్రాన్సక్షనల్ అడ్వయిజరీ ఫీజు, ఐఆర్ఎఫ్సీకి ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించిన రూ.84 కోట్ల మాటేమిటి? ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రి అన్నట్టు.. ‘కాసులు పోనాయి… నానేటి సేసేది?’ అన్నట్టుగా రూ.1,660 కోట్లు ఖజానా నుంచి పోయిన తర్వాత… అధికారులు సంబురాలు చేసుకున్న తర్వాత… రుణం ఆగిపోయింది! కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆపిండు? నేనేం చేయాలని సాక్షాత్త్తు సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి బీద అరుపులు అరవడం ఎంతవరకు నమ్మశక్యం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
4% వడ్డీ రేటు నిజమేనా?
మెట్రో మొదటి టేకోవర్‌లో కీలకమైనది… ఐఆర్ఎఫ్సీ రుణం. రూ.13,600 కోట్లను తాను కేవలం 4% వడ్డీపై తీసుకొనివచ్చానని, దానిని కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. 4% వడ్డీపై రుణం వచ్చి ఉంటే ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏటా రూ.100 కోట్ల లాభంతో మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేదని వివరించారు. ఇక్కడే పలువురు ఆర్థిక నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఐఆర్ఎఫ్సీ రుణ ప్రక్రియను ప్రారంభించి ఆరు నెలలకు పైగా అవుతున్నది. కానీ ఎక్కడా వడ్డీ రేటును మాత్రం వెల్లడించలేదు. చివరకు రుణ ప్రక్రియపై ఒప్పందం ముగిసిన తర్వాత ప్రభుత్వం జారీచేసిన జీవోలో సైతం అన్ని వివరాలను పొందుపరిచిందేగానీ ఎక్కడా రూ.13,600 కోట్లపై ఇంత వడ్డీ అని పేర్కొనలేదు. సీఎం మీడియా సమావేశంలో అధికారికంగా 4% వడ్డీ అని చెప్పినపుడు దానిని జీవోలో ఎందుకు పొందుపరచలేదనేదే ఇప్పుడు అనుమానాలను రేకెత్తిస్తున్నది. దీంతోపాటు ఐఆర్ఎఫ్సీ 2025-26 వార్షిక ఆర్థిక నివేదికను పరిశీలిస్తే, ఆ సంస్థ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 1.51 శాతంగా ఉన్నది. అంటే ఐఆర్ఎఫ్సీ బాండ్ల రూపంలో, జైకా వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలను తీసుకొని, దానిపై 1.51% ఎక్కువ వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే రైల్వే ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తుంది. అందుకోసం తీసుకొనే కమీషన్‌ను ఎన్ఐఎం అంటారు.
ఐఆర్ఎఫ్సీ వార్షిక ఆర్థిక నివేదికలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.4,17,940.38 కోట్ల రుణాలు ఇచ్చినట్టు ఉన్నది. ఇందులో వడ్డీ రేటు సరాసరిన రూ.8-8.5%గా ఉన్నది. పైగా ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సూరత్ మెట్రో ప్రాజెక్టుకు కూడా ఇదే ఐఆర్ఎఫ్సీ రుణాన్ని ఇచ్చింది. ఆ రుణ వడ్డీ 8-8.5%గా ఉన్నదని పబ్లిక్ డొమైన్లో ఉంది. అలాంటప్పుడు ఇక్కడ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాము 4% వడ్డీకే రుణం తీసుకొనివచ్చామని చెప్పడంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఓ ఉన్నతాధికారి స్పందిస్తూ, ఆర్బీఐ నుంచి లిఖితపూర్వకంగా మ్యాండేట్ ఇచ్చినందునే గతంలో ఎవరికీ ఇవ్వనిరీతిలో తక్కువ వడ్డీకి రుణం ఇచ్చినట్టు చెప్పారు. కానీ, ఆర్బీఐ నుంచి లిఖితపూర్వక మ్యాండేట్ కోరడం వెనుక కారణం మరొకటి కావడం గమనార్హం. ఏడీబీ, జైకా వంటి సంస్థలు రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేయడానికి ప్రధాన కారణం… మెట్రో ప్రాజెక్టు గిట్టుబాటు కాదు (వయబులిటీ లేదు) అనేది.
రోజుకు 16 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉండగా, ఇప్పటికీ 4-5 లక్షల మధ్యనే ప్రయాణికుల సంఖ్య ఉన్నది. దీంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన 260 ఎకరాలకుపైగా భూముల్లో వ్యాపారపరంగానూ గిట్టుబాటు కాలేదు. అందుకే ఏటా రూ.400-500 కోట్ల లోటులో మెట్రో నడుస్తున్నది. ఈ విషయం ఎల్అండ్టీ ఆర్థిక నివేదికలోనే వెల్లడించింది. అది పబ్లిక్ డొమైన్లో ఉన్నది. అలాంటప్పుడు ఐఆర్ఎఫ్సీకి తెలియకుం డా ఉండదు. అందుకే మెట్రో నష్టాల్లో ఉన్నప్పటికీ తనకు రావాల్సిన రుణ వాయిదాలు రాబట్టుకొనేందుకు మెట్రో లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఆర్బీఐ నుంచి నేరుగా తన ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను బదిలీ చేసుకొనే విధంగా ఆటోడెబిట్ జాగ్రత్తలను ఆ సంస్థ తీసుకొన్నది. పైగా ఐఆర్ఎఫ్సీ ఒప్పంద సమయంలో ఎల్అండ్టీ ప్రతినిధులు కూడా ఉన్నారు. దీంతో ఆర్బీఐ పూచీకత్తుతో తక్కువ వడ్డీ అనే వాదన సమంజసంగా లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఐఆర్ఎఫ్సీ నిజంగా 4% వడ్డీకే రుణమిస్తే ఎల్అండ్టీ సంస్థ దానిని ఎందుకు సద్వినియోగం చేసుకోకుండా ఉండేది? అవసరమైతే, కేంద్రం సహకారం తీసుకునేది కదా! అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర ఖజానా నుంచి 1,660 కోట్ల చెల్లింపులు పూర్తి
మెట్రో రెండో దశ విస్తరణకు అడుగు పడాలంటే, మొదటి దశను ఎల్అండ్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్అండ్టీకి ఉన్న రూ.13,600 కోట్ల రుణాన్ని ప్రభుత్వం తీసుకోవడంతోపాటు నగదుగా ఇస్తానన్న రూ.2వేల కోట్లను కూడా చెల్లించాలి. ఇందులో గతంలోని బకాయిలు, ఇతరత్రా అన్నింటినీ కలిపితే రూ.1,400 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని తేలింది. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశంతో అధికారులు ఆ ప్రక్రియను శరవేగంగా ముందుకు తీసుకుపోయారు. ఇందులో భాగంగా మే 25న రూ.13,600 కోట్ల ఎల్అండ్టీ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదికి రీషెడ్యూల్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కీలకమైన అధికారులు ఈ ఒప్పందంలో పాల్గొన్నారు.
అయితే, ఎల్అండ్టీ రుణాన్ని తన పేరు మీదికి మార్చడంతోపాటు నగదుగా రూ.1,400 కోట్లను కూడా (మ్యాచింగ్ గ్రాంట్) ఆ సంస్థకు చెల్లించారు. ఐఆర్ఎఫ్సీ రుణాన్ని ఇప్పించడంలో కీలకమైన అసెట్ వ్యాల్యూ ప్రక్రియ నిర్వహించినందుకు ట్రాన్సక్షనల్ అడ్వయిజరీ ఫీజు కింద ఐడీబీఏ బ్యాంకింగ్‌కు రూ.176 కోట్లు చెల్లించారు. ఐఆర్ఎఫ్సీ రుణ ప్రక్రియలో డాక్యుమెంట్లు, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.84 కోట్లు చెల్లించారు. ఇలా సర్కార్ ఖజానా నుంచి రూ.1,660 కోట్లు వెళ్లాయి. ఈ మేరకు గత నెల 29న ఐఆర్ఎఫ్సీ నుంచి రూ.13,600 కోట్లు ఎల్అండ్టీ ఖాతాలోకి పోతే… ఆ సంస్థ మెట్రోను ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సి ఉండేది. అందుకే ప్రభుత్వం జూన్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని ప్రకటించింది. కానీ గత నెల 29న ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం ఎల్అండ్టీ ఖాతాలోకి పోలేదు. ఇక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది.
19 రోజులపాటు ప్రభుత్వం ఏం చేసింది?
కాంగ్రెస్ ప్రభుత్వం గత నెలలో ప్రకటించినట్టు గత నెల 29న ఐఆర్ఎఫ్సీ రూ.13,600 కోట్ల మొత్తాన్ని ఎల్అండ్టీ ఖాతాలో జమ చేయాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం-ఎల్అండ్టీ టేకోవర్ ప్రక్రియలో మిగిలిన అంకాన్ని పూర్తి చేస్తే జూన్ ఒకటో తేదీ నుంచి మెట్రో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతుంది. అయితే, ఇప్పటిదాకా రుణం విడుదల కాలేదని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మీడియా ముందు వెల్లడించారు. మరి గత నెల 29న రుణం విడుదల నిలిచిపోగానే ప్రభుత్వం ఏం చేసింది? హుటాహుటిన అధికార యంత్రాంగం ఢిల్లీకి పోవాలి కదా! రుణం ఆగిపోయిన విషయం ఇప్పటివరకు ప్రభుత్వం ప్రజలకు ఎందుకు చెప్పలేదు? మరీ ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి తాను ఇటీవల నీతి ఆయోగ్ సమావేశానికి పోయిన తర్వాత కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రిని కలిశానని, అప్పుడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్తే రుణం విడుదల ఆగిపోయినట్టు తెలిసిందని పేర్కొన్నారు.
అలాంటప్పుడు ఢిల్లీ వేదికగానే కేంద్రం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఎందుకు ఎండగట్టలేదు? అందుకు మూడు, నాలుగు రోజుల సమయం ఎందుకు తీసుకున్నట్టు? రాష్ర్టానికి ప్రదాని మోదీ సహకరిస్తున్నందున తనకు ఆయన బడేభాయ్ అని చెప్పుకొంటున్న ఈ చోటేభాయ్… ప్రధానమంత్రిని కలిసినపుడు మెట్రో అంశాన్ని ఎందుకు ఆయన ముందు ప్రస్తావించలేదు? రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా… కనీసం కేంద్రం, ఆర్బీఐ పూచీకత్తు ఇచ్చిన తర్వాత కూడా ఐఆర్ఎఫ్సీ రుణాన్ని మంజూరు చేయలేదనే విషయాన్ని ప్రధాని ముందు ఎందుకు ప్రస్తావించలేదు? ఇన్నిరోజుల తర్వాత అదీ మీడియా సమావేశాన్ని నిర్వహించి రాజకీయ ఆరోపణలతో మెట్రోకు రావాల్సిన రుణాన్ని కిషన్‌రెడ్డి ఆపేశారు.. అంటూ సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొన్నారు.
రెండో దశపై నీలినీడలు
తాజా పరిణామాలకు తోడుగా… నగర ప్రజల రవాణా కష్టాలను తీర్చాల్సిన హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ కూడా ఇప్పుడు అనిశ్చితిలో పడింది. ఒకవైపు సర్కార్ రూపొందించిన డిజైన్లలో లోపాలపై కేంద్రం కొర్రీలు పెడుతున్నది. దీంతో ప్రాజెక్టు అసలు ముందుకెళ్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం రెండో దశ విస్తరణకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తే… అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఆలైన్మెంట్ మార్చి, విలువైన కాలాన్ని పూర్తిగా వృథా చేసింది. కాలయాపనతో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. దీనికితోడు వారసత్వ, చారిత్రక కట్టడాల రక్షణకు ప్రత్యేకంగా నిర్మాణంలో మార్పులు చేయాల్సి వచ్చిందని రాష్ట్ర సర్కార్ చెప్పిన మాటలపై అభ్యంతరం తెలుపడంతో మరో చిక్కుముడితో మెట్రో విస్తరణ ప్రశ్నార్థకంగా మారుతున్నది. శంషాబాద్ వద్ద భూగర్భ స్టేషన్, సిగ్నలింగ్ సాఫ్ట్వేర్ పరంగా 50% నిధులు అదనంగా వ్యయం, వారసత్వ కట్టడాలకు 15% అదనపు నిధులు, ఇంటర్చేంజ్ స్టేషన్లతో మరో 50% మేర ఖర్చు పెరుగడాన్ని కేంద్రం అంగీకరించే పరిస్థితిలో లేదు. ఇక లక్షలాది మంది ప్రయాణించేందుకు అవకాశం ఉన్నా, రాయదుర్గం-కోకాపేట, నాగోల్-శంషాబాద్, జేబీఎస్-మేడ్చల్ మార్గాల్లో లక్షలాది మంది మెట్రో కోసం ఎదురుచూస్తున్నారు కానీ, రాష్ట్ర సర్కార్ ప్రతిపాదనలపై కేంద్రం చెప్తున్న అభ్యంతరాలు మెట్రో రెండో దశపై నీలినీడలు కమ్ముకొనేలా చేస్తున్నాయి.