హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ‘ధరణి’ అంటే నవ్వారు., ఇదేంటి అని వక్రభాష్యాలు చెప్పారు. బీఆర్ఎస్ ఓ పసలేని పోర్టల్‌ను తెచ్చి ఊదరగొట్టిందని, దాన్ని తలదన్నేది తీసుకొస్తాం చూడండని ప్రగల్భాలు పలికారు. భూముల రక్షణకు అసలుసిసలు భద్రతతో కూడిన కేరాఫ్ అంటూ ఎటుజేసి బీఆర్ఎస్ తెచ్చిన పోర్టల్‌ను మరుగున వేయాలని ప్లాన్ చేశారు. కసరత్తు, కార్యాచరణ అంటూ కొత్తగా భూభారతి తెస్తే తీరా పనిలోకి దిగితే అది కాస్త బేర్మన్నది., పోర్టల్ పనితీరు పేలవంగా తేలిపోయింది. ఒక్క జనగామ ఉదంతంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెస్టీజియస్‌గా భావిస్తున్న పోర్టల్ చుట్టూ సవాలక్ష అనుమానపు వలయాలు అల్లుకోగా, కోట్లాది మంది రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
భూముల క్రయవిక్రయాలతో పాటు భూముల వివరాల కోసం కాంగ్రెస్ సర్కార్ఏడాదిన్నర క్రితం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన వ్యవస్థ భూభారతి. దీంతో భూసమస్యలు ఉండబోవని, అవకతవకలకు అవకాశమే ఉండదని చెప్పింది. కానీ అంత గొప్ప వ్యవస్థను మీసేవ నడుపుకొనే ఓ వ్యక్తి హ్యాక్ చేయడమే కాకుండా కోట్ల రూపాయల సర్కార్ సొమ్మును కాజేశాడు. దీంతో రక్షణపరంగా భూభారతి పోర్టల్ ఎంత పేలవమో తేలిపోయింది, డొల్లతనం బయటపడింది.
భూముల వివరాలు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా బీఆర్ఎస్ సర్కార్ ధరణి పోర్టల్‌ను తీసుకురాగా, దానిపై నాటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విషబీజం నాటింది. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో పడేసి భూభారతి తీసుకొస్తామని ప్రకటించి, అన్నట్టుగా 2024 ఏప్రిల్ 14న అమల్లోకి తెచ్చింది. ధరణి లోపాలను సరిదిద్దుతామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ భూభారతితో సమస్యలు రెట్టింపు చేసింది. కేవలం బీఆర్ఎస్, ధరణిపై కోపంతో ముందస్తు కసరత్తు, ఆలోచన, ప్రణాళిక లేకుండా పోర్టల్‌ను హడావిడిగా అమల్లోకి తెచ్చింది. పోర్టల్‌లో రంగులతో రేవంత్ తదితరుల ఫొటోలు నింపారే తప్ప రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపించలేదనే విమర్శలున్నాయి. 33 మాడ్యూల్స్‌ను 6 కుదించారేగానీ కొత్త అంశాలేమి చేర్చలేదు. ఇప్పటికీ భూభారతి పోర్టల్‌తో ఉపయోగం ఏంటి.. అంటే అటు మంత్రులు, ఇటు అధికారులు సమాధానం చెప్పలేని దుస్థితి.
కోట్లమంది రైతులకు సంబంధించిన, కోట్లాది ఎకరాల వివరాలు ఒకేచోట పొందుపరుస్తున్నప్పుడు ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, అందునా ప్రస్తుత డిజిటల్, సాంకేతికయుగంలో పోర్టల్‌లోని వివరాలు బయటకు పొక్కకుండా భద్రమైన సాంకేతికత వినియోగించాలి. కానీ ఈ విషయాల్లో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. భూభారతి పోర్టల్ రూపొందించే, నిర్వహించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)కు అప్పగించింది. ఇంత పెద్ద వ్యవస్థను నిర్వహించే సామర్థ్యం నిపుణుల కొరతతో అవుట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తున్న ఎన్ఐసీకి ఉన్నదా? అనే అనుమానాలు నాడే రెవెన్యూ యంత్రాంగం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో భూభారతిని దాని చేతిలో పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తగా అనుకున్నట్టే పోర్టల్ ఓ అనామకుడి చేతిలో హ్యాక్‌కు గురై డొల్లతనాన్ని బయటపెట్టుకున్నది. ధరణి పోర్టల్‌లో సాంకేతిక డొల్లతనం ఎప్పుడూ ఎదురుకాలేదు. రైతులు, ప్రభుత్వ భూములు భద్రంగా ఉండాలనే బీఆర్ఎస్ సర్కార్ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థ టెర్రా సీఐఎస్‌కు అప్పగించినప్పుడు నాడు కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టి తీవ్ర విమర్శలకు దిగి, ప్రైవేటు సంస్థకు ఇస్తారా.. అని రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. అదే ఇప్పుడు భూభారతిని ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించినా యథేచ్ఛగా అవకతవకలు జరుగుతుండడం గమనార్హం.
భూభారతి పోర్టల్‌కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులు అన్నీఇన్ని కావు. అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. భూభారతి పోర్టల్ ఆవిష్కరణ సందర్భంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఈ పోర్టల్ తాత్కాలికమే. మరింత పకడ్బందీ పోర్టల్‌ను త్వరలోనే తీసుకొస్తాం..’ అని ప్రకటించినా రెండేండ్లు కావొస్తున్నా అందుబాటులోకి తీసుకురాలేదు. అంటే ఆవిష్కరణ సమయంలో లోపాలున్నాయనే విషయం తెలిసే ప్రకటించినా ఇన్ని రోజులు ఇంత ఉదాసీనంగా ఉండటంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్పై కోపంతో హడావుడిగా భూభారతి తాత్కాలిక పోర్టల్‌ను తీసుకొచ్చి రైతులపై రుద్దారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు సర్కార్ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న ఓ మీసేవ నిర్వాహకుడు హ్యాక్ చేసి సర్కార్ సొమ్మును కాజేశాడు.
జనగామలో భూభారతి భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన అవకతవకలు వ్యవస్థను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ నేపథ్యంలో పోర్టల్‌లో నిక్షిప్తమైన భూములు సేఫేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్‌కు చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మెజారిటీ మొత్తాన్ని వారి ఖాతాలోకి మళ్లించారు. జనగామలో ఒక్క రోజులోనే రూ.85 లక్షలు కాజేయడంతో తీగ లాగితే డొంక కదిలినట్టు దందా రాష్ట్రమంతా జరిగినట్టు రెవెన్యూ అధికారులు, పోలీసుల విచారణలో తేలింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ భూములు ఉన్నాయో.. ఇతరుల పేర్లపైకి మారాయో అంటూ భయానికి గురవుతున్నారు. భూముల వివరాల కోసం మీసేవ సెంటర్లకు క్యూ కడుతున్నారు. కాగా, ఈ ఘటన కేవలం డబ్బు మళ్లింపు వరకే ఆగిందా.. అంతకు మించి ఇంకేమైనా జరిగిందా.. అనే ఆందోళనల్లో రెవెన్యూ అధికారులు ఉన్నారు.