హైదరాబాద్ సిటీబ్యూరో/మల్కాజిగిరి, జూన్ 26(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంచలనం రేపిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కామ్‌లో ప్రధాన నిందితుడైన జయరాజ్ గంగాధరన్ ఓ కాంగ్రెస్ నేత, ఓ మాజీ ఎమ్మెల్యేకు అనుచరుడిగా కొనసాగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అతడు పరారీలో ఉ న్నట్టు పోలీసులు ప్రకటించగా, గంగాధరన్ ఇ దివరకే చనిపోయాడని స్థానికులు చెప్తుండటం గమనార్హం. అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 20న నమోదైన ఈ కేసులో పుష్పలత ఆమె కొడుకు విశాల్, జిరాక్స్ సెంటర్ యజమాని మహేందర్సింగ్ను పోలీసులు గురువారం అ రెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్ర ధాన నిందితుడు మృతిచెందినట్టు తమకు మ రణ ధ్రువీకరణ పత్రం అందలేదని పోలీసులు చెబుతున్నారు. అతని కుటుంబ సభ్యులైన ని షారాజ్, చింటూ రాజ్ కూడా పరారీలో ఉన్న ట్టు పోలీసులు ప్రకటించారు. రాజకీయ ప్రమేయంతో బాధితులు తొలుత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా కేసు కాకుండా చాలారోజులు పైస్థాయి లో ఒత్తిడి తెచ్చినట్టు బాధితులు ఆరోపిస్తున్నా రు. బాధితులంతా ఒక్కటై ఉన్నతాధికారులను కలువడంతో చివరకు ఇండ్ల స్కామ్‌పై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమా చారం. ఈ స్కామ్‌లో బాధితుల సంఖ్య మరింతగా ఉన్నట్టు తెలుస్తున్నది. రాజకీయ నేప థ్యం ఉన్న ఒక కుటుంబం స్థానికంగా అమాయకులైన పేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి కోట్లు కాజేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
డబుల్ ఇండ్ల పేరిట పక్కా ప్లాన్
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని మోసం చేసేందుకు ఈ ముఠా పక్కాప్లాన్ అ మలు చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. జయరాజ్‌కు రాజకీయ నేపథ్యం ఉండటం, అలాగే జీహెచ్ఎంసీలో పుష్పలత అధికారిగా పనిచేస్తున్నట్టు నమ్మించడంతో వా రు నమ్మి డబ్బులు ఇచ్చినట్టు స్థానికులు పే ర్కొంటున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిందని, అందుకు సంబంధించిన కేటాయింపు లేఖలు (నకిలీవి) బాధితులకు అప్పగించారు. బాధితులను నగర శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్దకు కూడా తీసికెళ్లి వాటిని తమకు చూపినట్టు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన స్టాంప్‌లు, లెటర్ ప్యాడ్లు నకిలీవి తయారుచేసి అమాయకులను సునాయాసంగా మోసంచేశారు.
నకిలీల తయారీలో కొడుకు!
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నట్టు చెప్పుకొన్న పుష్పలత గతంలో జీహెచ్ఎంసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి, ఆ తర్వాత కలెక్టరేట్లోనూ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఆమె కొడుకు విశాల్ బీటెక్ పూర్తిచేశాడు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట నకిలీ లేఖలను విశాల్‌తోనే పుష్పలత తయారు చేయించినట్టు విచారణలో తేలింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు లేఖలు ఎలా ఉన్నాయి? ఏ ఫాంట్ వాడారు? ఏ స్టాంప్ వాడారు? అన్న విషయాలను పరిశీలించగా, నిందితుడైన విశాల్ అసలు పత్రాల మాదిరిగానే డబుల్ ఇండ్ల కేటాయింపు నకిలీ లేఖలు తయారు చేసినట్టు బయటపడింది. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేయాల్సిన విశాల్.. తల్లి చెప్పినట్టు చేసి ఈ కేసులో నిందితుడిగా మారాడు. అలాగే ప్రధాన నిందితుడు జయరాజ్ పిల్లలు సైతం ఈ కేసులో నిందితులుగా ఉండటం గమనార్హం.