హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : ప్రజా సేవలో భాగంగా రోజుకు 16 గంటలకుపైగా శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం తన బాధ్యత అని డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. గతంలో తాను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (ఎన్జీవో) సహకారంతో 20 వేల మంది సిబ్బందికి హెల్త్ ప్రొఫైలింగ్ చేయించి ‘ఫిట్‌కాప్’ ప్రోగ్రాం ప్రారంభించానని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో ఉన్న 75,000 మంది పోలీసు సిబ్బందికి ఒక ప్రత్యేక యాప్, సాంకేతికత ఆధారంగా వారి ఆరోగ్యాన్ని మానిటర్ చేయబోతున్నట్లు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తన ఫిట్నెస్ రహస్యాన్ని పంచుకుంటూ.. అండర్-19 క్రికెటర్ రోజులనుంచి నేటివరకు నిరంతరం బరువును 75-76 కేజీల మధ్యే కాపాడుకుంటున్నానని తెలిపారు. వారానికి మూడు రోజులు వెయిట్ ట్రైనింగ్, క్రికెట్, టెన్నిస్, గోల్ఫ్ ఆడుతుంటానని, గత ఏడాది లీగ్ క్రికెట్లో 5 సెంచరీలు కూడా చేశానని చెప్పారు. తన ఆహారంలో ఫోర్ వైట్స్ (అన్నం, పంచదార, ఉప్పు, మైదా) ఎప్పుడో కట్ చేశానని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుశాఖలో మున్ముందు ఎఫెక్టివ్ పోలీసింగ్ చూస్తారని ఆయన వివరించారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 7,500 మంది, దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుండటం పట్ల డీజీపీ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ట్రాఫిక్ విధానాలను అమలు చేయడం తద్వారా ప్రమాదాలను నివారించడం కోసం త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయబోతున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఇందులో ఆర్అండ్బీ, రవాణా శాఖల ఇంజినీర్లు, నిపుణులు ఉంటారని, ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్లను గుర్తించి మార్పులు చేస్తామని చెప్పారు. వెనుక సీటులో ఉన్నవారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. జంక్షన్ల వద్ద యూటర్న్ల ఏర్పాటు శాస్త్రీయంగా అధ్యయనం చేసిందేనని, ట్రాఫిక్ ఫ్లో పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు. 174 ఏండ్ల హైదరాబాద్ పోలీస్ చరిత్రలో ఏ రోజూ ఒక మహిళా అధికారి కూడా లా అండ్ ఆర్డర్ ఎస్‌హెచ్‌వోగా పని చేయలేదని, తాను సీపీగా వచ్చిన తర్వాతే మధులత అనే ఇన్స్పెక్టర్ను లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా నియమించానని గుర్తుచేశారు. తన హయాంలో 18 మంది డీసీపీలలో 9 మంది మహిళలే ఉన్నారని, వారు అత్యంత సున్నితమైన జోన్లను పురుషుల కంటే అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. పోలీసు శాఖలోకి వచ్చే యువతకు సేవ చేయాలన్న తపన ఉంటేనే ఈ శాఖలోకి రావాలని పిలుపునిచ్చారు. తన 35 ఏండ్ల సుదీర్ఘ సర్వీసులో ఎన్నో జనరేషనల్ మార్పులను చూశానని, ప్రస్తుత జెన్-జీ, ఆల్ఫా తరాల ఆలోచనా విధానం, సామాజిక విలువలు గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని పేరొన్నారు. వారిని సరైన మార్గంలో గైడ్ చేయాల్సిన బాధ్యత యువ అధికారులపై ఉన్నదని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో శుక్రవారం నాడు జరిగిన ఓ సదస్సులో డీజీపీ సీవీ ఆనంద్ ప్రసంగాన్ని రిపోర్ట్ చేయడంలో పొరపాటు జరిగింది. పోలీసుల సామర్థ్యం గురించి ఆయన అనని మాటలను అన్నట్టుగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాము. నిజానికి పోలీసుల శక్తియుక్తుల గురించి అనుమానాలు రేకెత్తించే ఎటువంటి వ్యాఖ్యలనూ డీజీపీ ఆనంద్ చేయలేదు. తెలంగాణలో రానున్న రోజుల్లో ఎఫెక్టివ్ పోలీసింగ్‌ను అమలు చేస్తామని మాత్రమే ఆయన చెప్పారు. సాంప్రదాయ పోలీసు పద్ధతులను వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త సవాైళ్లెన నార్కొటిక్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతలపై శాఖను సమూలంగా సన్నద్ధం చేస్తున్నట్టు వివరించారు.ప్రస్తుతం కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా పీహెచ్డీ, పీజీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారని, ప్రత్యామ్నాయాలు ఉన్నా ఈ వృత్తిలోకి వస్తున్నప్పుడు నిబద్ధత అవసరమని ఆయన తెలిపారు.