హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కల్లుగీత వృత్తిలోకి కార్పొరేట్ శక్తుల ప్రవేశాన్ని సహించబోమని గౌడ ఐక్య సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ హెచ్చరించారు. ప్రభుత్వం ప్రైవేట్ టాడీ ఫెస్టివల్స్‌ను ప్రోత్సహించడం సరికాదని సూచించారు. శుక్రవారం ఆయన సంఘం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కల్లుగీత సొసైటీల పర్యవేక్షణలోనే టాడీ ఫెస్టివల్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
30 ఏండ్ల క్రితమే ప్రైవేట్ సంస్థలు కల్లుగీత వృత్తిని దెబ్బతీసే కుట్రలో భాగంగా నీరాను అమ్మాలని చూస్తే.. ఆనాటి కల్లుగీత సంస్థలు అడ్డుకున్నాయని వివరించారు. కల్లుగీత గీత వృత్తిదారులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, వ్యాపారి రాందేవ్రావు నిర్వహించే తాటికల్లు మేళాను ప్రోత్సహించడం తగదని చెప్పారు. తమ సంఘం ఆధ్వర్యంలో ‘పండుదాళ్ల పండుగ’ను త్వరలో నిర్వహిస్తామని తెలిపారు.