ఆత్మకూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ఆదివారం జూరాల రిజర్వాయర్ నుంచి 5 గేట్లెత్తి నీటి విడుదల చేస్తున్నారు. 71వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో జూరాలకు చేరుకుంటుండగా 5 గేట్లు మీటరు ఎత్తి స్పిల్ వే ద్వారా 20,675 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ఆయ కట్టు, త్రాగునీటి అవసరాలకై ఎడమ కాలువకు 820 క్యూసెక్కులు, కుడి కాలువకు 773, సమాంతర కాలువకు 150, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 44,227 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎగువ, దిగువ కేంద్రాలలో 12యూనిట్లలో విద్యుదుత్పత్తి నిర్విరామంగా కొనసాగుతున్నది.
ఎగువ జూరాలలో 6 యూనిట్ల ద్వారా 4.923 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటివరకు మొత్తంగా 237 మి.యూ ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాలలోనూ 6 యూనిట్ల ద్వారా 4.688 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 263.209 మి.యూ విద్యుతుత్పత్తి జరిగింది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 9.152 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజక్టు నుంచి 67,489 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది.