హైదరాబాద్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పని చేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్క్ లు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రాం రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వి, అధికారులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను కేసీఆర్‌కు వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని వైద్యాధికారులు సీఎంకు సూచించారు. అందువల్ల.. లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వారు సీఎంకు నివేదిక ఇచ్చారు.
ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖను సన్నద్ధం చేయడం కోసం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్స్‌లో దాదాపు 99 శాతం బెడ్స్‌ను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారని, మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని సీఎం ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామని, ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి లభ్యతకు చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని సీఎం ఆదేశించారు.
అన్ని దవాఖానాల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని సీఎం వైద్యాధికారులను ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాలరీత్యా జనాభా ప్రాతిపదికన, రాష్ట్రంలో డాక్టర్లు, బెడ్లు మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలని సీఎం అన్నారు. నూతనంగా నిర్మించుకున్న సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్ కార్యాలయాలను, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్య శాఖ అవసరాల కోసం ప్రత్యేకించి కేటాయించాలని కేసీఆర్ ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న డయాలిసిస్ సేవలను మరింత విస్తరించాలని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది కిడ్నీ రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్న నేపథ్యంలో డయాలిసిస్ మిషన్లను మరిన్ని పెంచాలని సీఎం ఆదేశించారు.