సూర్యాపేట, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ):ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ వైద్యంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతున్నది. ప్రధానంగా ప్రసూతి వైద్య సేవలు చాలా మెరుగుపడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానల్లో కాన్పు చేయించుకున్న మహిళలకు అందిస్తున్న కేసీఆర్ కిట్ ఎంతో ప్రయోజనకారిగా ఉన్నది. 14 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్‌తోపాటు నగదు ప్రోత్సాహకం అందిస్తుండడంతో సర్కారు దవాఖానల్లో కాన్పులు పెరిగాయి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవమై.. శిశువుకు తొమ్మిదో నెలలో టీకా వేసే వరకూ సేవలు అందిస్తున్నారు. దాంతో సర్కారు దవాఖానల్లో సుఖ ప్రసవాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో ఎంతటి పెద్ద రోగానికైనా ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స అందించేలా వసతులు సమకూరాయి. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేయగా ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరై విజయవంతంగా నడుస్తున్నాయి.
గతంలో ప్రభుత్వ దవాఖానలను పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో ప్రజలు ఏదైనా అనారోగ్యానికి గురైతే ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. ప్రైవేట్‌కు వెళ్తే జేబులు గుల్ల అయ్యేవి. నేడు సీఎం కేసీఆర్ చొరవతో ఎంతటి పెద్ద రోగానికైనా ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స అందించేలా వసతులు ఏర్పాటు చేశారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయగా సమాంతరంగా జనరల్ ఆసుపత్రులు రావడం, ప్రతి ఏరియా ఆసుపత్రిని అప్‌గ్రేడ్‌తోపాటు ఆధునీకరణ చేసి అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని నియమించారు. అలాగే పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు పల్లె, పట్టణ దవాఖానలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం చేరువైంది. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో సకల హంగులు కల్పించడంతో గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు పొందుతున్నారు. తల్లీబిడ్డల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా కేసీఆర్ కిట్టు అందిస్తున్నారు. గర్భం దాల్చినట్లు నిర్ధారణ కాగానే రూ.3వేల నగదు ఇచ్చి, నెలనెలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రసవించిన తర్వాత ఆడ శిశువు పుడితే రూ.5వేలు, మగబిడ్డ అయితే రూ.4వేలు నగదుతోపాటు రూ.1850 విలువ చేసే పౌడర్లు, డైపర్లు, తైలం, తదితర 14 రకాల ఐటెమ్స్‌ను ఇస్తున్నారు. అలాగే శిశువుకు 3వ నెల టీకా సమయానికి రూ.2వేలు, 9వ నెల టీకా సమయంలో రూ.3వేల నగదు ఇస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆడ శిశువుకు జన్మనిస్తే రూ.13వేలు, మగ శిశువు పుడితే 12వేల నగదు అందిస్తున్నారు. అనంతరం తల్లీబిడ్డలను 102 వాహనం ద్వారా దవాఖాన నుంచి ఇంటికి చేర్చుతున్నారు. అన్ని సబ్ సెంటర్లలోని ఏఎన్ఎంలకు ట్యూబ్‌లు అందజేసి ఆన్లైన్ ద్వారా మాతా శిశు రక్షణ వివరాలు పొందుపర్చుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం ఇస్తున్నారు. మొత్తం మీద సర్కారు వైద్యమంటే సబ్బండ వర్గాల సంక్షేమ వైద్యంగా కేసీఆర్ ప్రభుత్వం చాటి చెబుతూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నది. అలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో కీలకంగా మారితే తెలంగాణ మాదిరి ఆరోగ్య భారత్‌గా మారడం ఖాయమని అన్ని వర్గాలతోపాటు గర్భిణులు, బాలింతలు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ దేశంలో ఉంచే చాలా మంచిది..
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాల్లో కేసీఆర్ కిట్టు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల కోసం చాలా పథకాలు ప్రవేశపెట్టారు. పేదింటి ఆడ పిల్లలకు వివాహ కానుకగా కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 అందిస్తున్నారు. గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందజేస్తున్నారు. నెలలు నిండిన తరువాత ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పు అయ్యేలా చూస్తున్నారు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డకు అవసరమయ్యే వస్తువులతో కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. మగ శిశువు పుడితే రూ.12వేలు, ఆడపిల్ల పుడితే 15వేల రూపాయలు అందిస్తున్నారు. ఇటువంటి పథకాలను అందించే కేసీఆర్ వంటి నేతలు దేశంలో ఉంటే చాలా మంచిది.
– కుర్ర సుజాత, బంగారికుంటతండా (అడవిదేవులపల్లి)
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని అన్ని రాష్ర్టాలు కోరుకుంటున్నాయి..
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు అందిస్తున్న కేసీఆర్ కిట్ ఎంతో ఉపయోగకరమైనది. ఆ కిట్‌లో తల్లికి, బిడ్డకు అవసరమైన వస్తువులు అందించడం సంతోషకరం. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులకు ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. దాంతో శస్త్రచికిత్స బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. నేను వేములపల్లి పీహెచ్సీలో ప్రసవించాను. ఆసుపత్రి వారు నాకు, నా బిడ్డకు అవసరమైన వస్తువులు ఉన్న కిట్‌ను అందించారు. రాష్ట్రంలో అందిస్తున్న కేసీఆర్ కిట్‌ను చూసి ఇతర రాష్ర్టాల మహిళలు తమకు కూడా కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి ప్రవేశపెడుతున్న పథకాలను గమనిస్తున్న ఇతర రాష్ర్టాల ప్రజలు తమకు కేసీఆర్ నాయకత్వం కావాలని ఆకాంక్షిస్తున్నారు.
– ఆవుల భవాని, ఆమనగల్లు (వేములపల్లి)
కేసీఆర్ నాయకత్వంలో దేశం సుభిక్షం
గర్భంలో పిండ దశ నుంచి ప్రసవం వరకు తల్లీబిడ్డల సంరక్షణకు పాటుపడుతున్న ముఖ్యమంత్రి దేశంలోనే కేసీఆర్ ఒక్కరే. గతంలో ఏ ప్రభుత్వమూ మాతా శిశు సంరక్షణకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, కాన్పు తర్వాత తల్లీబిడ్డకు అవసరమైన కేసీఆర్ కిట్ ఇవ్వడంతోపాటు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇచ్చి ప్రభుత్వ వాహనంలో ఇంటికి సురక్షితంగా పంపిస్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వం, ఇంత గొప్ప ముఖ్యమంత్రి దేశంలోనే లేడు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లోకి వెళ్తే మేమంతా ఆయన వెంటే ఉంటాం. ఆయనతో దేశ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. స్వాతంత్య్ర ఫలాలు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ అందుతాయి. కేసీఆర్ రాష్ట్రంలో తల్లీబిడ్డలను సురక్షితంగా కాపాడిన విధంగానే దేశాన్ని కూడా సుభిక్షంగా ఉంచుతాడన్న నమ్మకం ఉంది.
– రమావత్ మమత, పూల్యతండా, పెద్దవూర మండలం (హాలియా)
కేసీఆర్ సారు దేశ రాజకీయాల్లోకి రావాలి
నాకు నెలలు నిండగానే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పోయిన. నేను అవస్థ పడడం చూసిన నర్సులు వెంటనే డాక్టర్‌కు చెప్పిండ్రు. ఆపరేషన్ చేస్తారేమోనని భయపడ్డా. డాక్టర్లు, నర్సులు ధైర్యం చెప్పి ఆపరేషన్ లేకుండా సాధారణ కాన్పు చేసిండ్రు. నేను, నా కొడుకు ఆరోగ్యంగా ఉన్నాం. అంతా బాగుందని చెప్పారు. మూడు రోజులకే ఇంటికి వెళ్లాం. వెళ్లేటప్పుడు కేసీఆర్ కిట్టు ఇచ్చిండ్రు. అందులో పౌడర్, కాటుక, మందులు, ఆట వస్తువులు ఉన్నాయి. వాటిని సీఎం కేసీఆర్ ఇయ్యకపోతే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది. తల్లీబిడ్డల కోసం ముఖ్యమంత్రి సారు చాలా మంచి పథకాలు ఇస్తున్నారు. ఇట్లాంటి పథకాలు ప్రవేశపెడుతున్న కేసీఆర్ సారు దేశ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని ప్రజలంతా సంతోషంగా ఉంటారు.
– మర్రి సౌజన్య, కంచనపల్లి, నల్లగొండ మండలం
ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు బాగున్నాయి..
గతంలో ప్రభుత్వ దవాఖానల్లో వసతులు లేక ప్రైవేటు ఆస్పత్రులకు పోవాల్సి వచ్చేది. దాంతో మాలాంటి నిరుపేదలు వైద్యం కోసం అప్పులు చేసేది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సర్కారు దవాఖానలు బాగుపడ్డయి. నాకు రెండు కాన్పులు మేళ్లచెర్వు ప్రభుత్వ దవాఖానలోనే అయినయి. గర్భిణి సమయంలో ఆశ కార్యకర్తలు సకాలంలో మందులు ఇచ్చేది. డెలివరీ అయ్యాక కేసీఆర్ కిట్ కూడా ఇచ్చిండ్రు. సీఎం కేసీఆర్ సార్ దయతో మాలాంటి పేదోళ్లకు డబ్బుల ఖర్చు లేకుండా వైద్యం అందుతుంది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయి. ఇవి దేశమంతా ఉంటే ఇంకా బాగుంటుంది.
– ఉప్పతల వెంకటమహాలక్ష్మి, వేపలమాధవరం (మేళ్లచెర్వు)
దేశం మెచ్చిన నేత కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యానికి ప్రాధాన్యమిచ్చి తెలంగాణను దేశంలోనే ఆరోగ్య రాష్ట్రంగా నిలిపారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయిన బాలింతలకు కేసీఆర్ కిట్టు ఇస్తున్నారు. పుట్టింటి వారి లెక్క తల్లితోపాటు చిన్నారికి అవసరమైన సబ్బులు, బేబీ నూనె, బట్టలు, దోమతెరతోపాటు అనేక వస్తువులు అందజేస్తున్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా నిత్యం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం మెచ్చిన నేత. ఆయన దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంటే అన్ని రాష్ర్టాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తారు.
– బత్తులకూరి విజయలక్ష్మి, ఆత్మకూర్.ఎస్