శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 09, 2020 , 01:29:45

రైతు సంక్షేమ బడ్జెట్‌

రైతు సంక్షేమ బడ్జెట్‌

 2020-2021 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా అంతటా హర్షం వ్యక్తమవుతోంది. అన్నదాతల సంక్షేమంతోపాటు.. విద్య, వైద్యం, వెనుకబడిన తరగతుల సంక్షేమం సహా గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌తో పాటు పలు విభాగాలకూ ప్రాధాన్యం కల్పించారు. ఆర్టీసీకీ రూ.వెయ్యి కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.11,758కోట్లు కేటాయించారు. ఆసరా లబ్ధిదారుల అర్హత వయస్సు 57ఏండ్లకు తగ్గించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల మందికి అదనంగా లబ్ధి చేకూరనుంది. కొత్త పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల మంజూరుతో రైతు బంధు, రైతు బీమా లబ్ధిదారుల సంఖ్య సైతం పెరగనుండగా.. వారికీ లబ్ధి చేకూరనుంది. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12లక్షల చొప్పున నిధులు కేటాయించగా.. నల్లగొండ జిల్లాలో 140 రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం గృహ నిర్మాణ శాఖకు, ఎస్సీల ప్రగతితోపాటు వెనుకబడిన తరగతుల సంక్షేమానికీ భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో బడ్జెట్‌ పైన సబ్బండ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బడ్జెట్లో మహిళలకు పెద్దపీట

జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలకు బడ్జెట్లో రూ.1200కోట్లు కేటాయించి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. భారీగా నిధుల కేటాయింపుతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతారు. ఈ బడ్జెట్‌ మహిళల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతుంది. మహిళలు ఒకరిపై ఆధారపడి జీవించాల్సిన అవసరం ఉండదు. తమకు నచ్చిన వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలంతా రుణపడి ఉండాలి. 

-వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కోదాడ 

రైతుల సంక్షేమమే ధ్యేయంగా.. 

తెలంగాణ ఏర్పాటు నుంచి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది.  అందులో భాగంగానే ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సీఎం కేసీఆర్‌ సర్కార్‌ రైతులకు పెద్దపీట వేసింది. రైతుబంధుకు రూ.14వేల కోట్లు కేటాయించి మరోమారు రైతులపై  ఆదరణ చాటుకుంది. ఇప్పటికే వందల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మరోసారి రుణమాఫీకి రూ.6,225 కోట్లు కేటాయించటం అభినందనీయం.  

-చిల్లంచర్ల సత్యనారాయణ, రైతు, నడిగూడెం


పాఠశాలల అభివృద్ధికి నిధులు హర్షణీయం

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.10,421 కోట్లు కేటాయించడం ఆనందించదగిన విషయం. రాష్ట్రంలో ఎన్నో పాఠశాలలు ఇప్పటికే శిథిలావస్థకు చేరాయి. బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో పాఠశాలలకు కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చుకునేందుకు వీలవుతుంది. ప్రైవేటు పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించడం రాష్ట్ర ప్రజల అదృష్టం.  

-తల్లాడ శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుడు, జి.ప.ఉ.పా.త్రిపురవరం 


వాస్తవిక సమతుల్య బడ్జెట్‌ 

రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, అన్నిరంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆదివారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ప్రణాళికలకు అనుగుణంగా ఉంది. ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ రాష్ర్టాభివృద్ధి కుంటుపడకుండా ఉండేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయం.  రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత ఉండేలా బడ్జెట్‌ను రూపొందించడంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది.  

-వాలుగొండ సత్యనారాయణ, విద్యావేత్త, దేవరకొండ 


logo