శీతాకాలం వచ్చిందంటే చలిమంటలు వేయడం మనకు తెలిసిందే. కానీ చలివంటల గురించి విన్నారా?! నిజమే, ఇవి, భగ్గున మండుతాయి కూడా. ఆహారాన్ని ఇలా మంటల్లో పెట్టి వడ్డించడం ఇప్పుడో ట్రెండు. ఫ్లేమ్బీయింగ్, ఫైర్ కుకింగ్లాంటి పేర్లతో పిలిచే ఇది ఫుడ్ ప్రెజెంటేషన్‌లో ఒక ప్రత్యేక పద్ధతి. అందుట్లోనూ చలికాలం కాబట్టి, సెగలు కక్కుతూ… సారీ మండిపోతూ నోట్లోకి, అదే ప్లేట్లోకి వచ్చే వీటికి ఎంతో క్రేజ్ మరి! ఇంతకీ అలా ఎలా… అంటారా?! ఇదిగో ఇలా…
ఆహారం ఎంత రుచిగా ఉంది అన్నది ఎంత ముఖ్యమో ఎంత ఆకట్టుకునేలా వడ్డించారు అన్నది కూడా అంతే ముఖ్యం ఈ రోజుల్లో. అందుకే ఇప్పుడు ఫుడ్ ప్రెజెంటేషన్ అన్నది ఓ పెద్ద సబ్జెక్టు అయిపోయింది. పదార్థాన్ని తినగానే ముఖం విప్పారుతుందా లేదా అన్నది తరువాత చూడగానే మాత్రం కళ్లు తళుక్కున మెరవాలి. అదే నేటి కాన్సెప్ట్. ఈ ఫైర్ కుకింగ్‌కి అదే మూలం కూడా.

సిజ్లర్స్ అంటూ వేడి వేడి ఇనుప ప్లేట్లో సెగలు కక్కేలా ఆహారాన్ని వడ్డించడం మనం చూసే ఉంటాం. దానికి మరో అడుగు ముందుకెళ్లి ఏకంగా భగ్గున మండేలా ఆహారాన్ని అందిస్తున్నారు. ఫ్లేమ్బీ టెక్నిక్‌గా పిలిచే ఇది ఇప్పుడు లగ్జరీ డైనింగ్‌లో భాగంగా కనిపిస్తున్నది. మన దగ్గర ఇంతకు ముందు ఫైర్ పాన్, ఫైర్ మోమోస్ ఎలా ఫేమస్ అయ్యాయో అలానే ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా ప్రదర్శన ఎంతో మందిని ఆకట్టుకుంటున్నది.

ఫ్లేమ్బీ అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది. దానికి మండించడం అనే అర్థం ఉంది. అయితే ఇలా మండించేందుకు మన దగ్గర ఫైర్ మోమోస్‌లో వెనిగర్‌ను వాడతారు. అదే ఫైర్ పాన్ అయితే కర్పూరం వాడతారు. కానీ ఫ్లేమ్బీడ్ ఫుడ్స్‌లో సాధారణంగా లిక్కర్‌నే ఇలా ఆహారం మీద మంట తెప్పించడానికి వినియోగిస్తారు. అంటే ఆ పదార్థం వడ్డించేప్పుడు బ్రాందీ, రమ్లాంటివి దాని మీద పోస్తూ మంటను వెలిగిస్తారన్న మాట. అంటే ఆ ఆహారంలో మద్యం ఏమీ ఉండదు. కానీ స్మోకీ (పొగచూరిన) ఫ్లేవర్ దానికి వస్తుంది. అలాగే డెజర్ట్స్లాంటివి వడ్డించినప్పుడు దానిపైన ఉండే క్రీమ్ పొర మండి పాకంలాగా మారి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.

వీటన్నింటికన్నా ముఖ్యంగా ఈ విధానం ముఖ్య ఉద్దేశం ఆ టేబుల్ మీద కూర్చున్న వారితో పాటు రెస్టారెంట్లో చుట్టూ ఉన్న అతిథుల్నీ ఆకట్టుకోవడం. క్రిస్మస్ పుడ్డింగ్, ఫ్లేమ్బీ చీజ్ కేక్లాంటి వాటితో పాటు కేక్ ఐస్‌క్రీమ్‌ల కలబోతగా ఉండే బేక్డ్ అలాస్కా, చెర్రీస్ జూబ్లీలాంటి డిజర్ట్స్ ఈ తరహాలో బాగా పేరు పొందాయి. పిజ్జా, పాస్తా, కొన్ని కూరగాయల ముక్కలతో చేసే వంటకాలతో సహా రొయ్య, పీతలతో వండే వాటినీ ఈ విధానంలో వడ్డిస్తున్నారు. అయితే భగ్గున మంట అంటుకునే స్వభావం ఉన్న పదార్థాలను ఇందులో వాడతారు కనుక నిపుణులు మాత్రమే ఇలా చేయగలరు. ఇండియాలోనూ కొన్ని పెద్ద రెస్టారెంట్లలో ఈ తరహా విందులు అందుబాటులో ఉన్నాయి. ఇది 15 సెకన్ల నుంచి 60 సెకన్లలోపు పూర్తయ్యే ప్రదర్శనే అయినా… ఈ చలివంటలు ఎప్పటికీ నిలిచిపోయే అనుభూతిని మిగులుస్తాయి.