ఆ మధ్య వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ..’ సినిమా చూసే ఉంటారుగా. అందులో హీరోయిన్ పదేపదే ‘నాకు స్పేస్ కావాలి’ అంటూ.. ‘కొంచెం దూరంగా ఉండాల’ని చెప్తూ ఉంటుంది. సినిమాలో ఇది కొంచెం ఫన్నీగా అనిపించినా, నిజ జీవితంలో వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలలో ఈ స్పేస్‌కి చాలా ప్రాముఖ్యం ఉంది. మనుషులు తెలిసో తెలియకో తమ చుట్టూ వృత్తాలు గీసుకుంటారు. ఆయా వృత్తాల్లోకి ఎవరిని అనుమతించాలనేది కూడా నిర్దేశించుకుంటారు. ఏ పరిధిలో వారుంటే ఏ బాధా లేదు. వాటిపై అవగాహన లేక తమది కాని వృత్తంలోకి చొరబడితే మనుషుల మధ్య అపోహలు, అపార్థాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఈ స్పేస్ ఏంటి?.. దాని కథ ఏంటో తెలుసుకుందాం.
Personal Space | మోహిత్ చురుకైన యువకుడు. ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి చేసి ఓ ఎమ్ఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరాడు. సహజంగానే ఉత్సాహవంతుడు, కలుపుగోలుతనం ఉండటంతో ఆఫీసులో అందరికీ దగ్గరయ్యాడు. కొంతకాలం తర్వాత మోహిత్‌పై టీమ్లీడర్కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అతణ్ని పిలిచి పద్ధతి మార్చుకోమని టీమ్ లీడర్ సున్నితంగా చెప్పాడు. తనేం తప్పు చేశాడో మోహిత్‌కి అర్థం కాదు. అందరితో బాగున్నా, అడపాదడపా పనిలో సాయం చేస్తున్నా తనపై ఫిర్యాదులు ఏంటని బాధ పడ్డాడు. అప్పటి నుంచి టీమ్ మెంబర్స్‌కి కొంచెం దూరంగా ఉండటం, సరిగ్గా మాట్లాడకపోవడం, వారిపై నెగటివ్ దృక్పథాన్ని ఏర్పర్చుకోవడం చేశాడు. ఇది తన పని సామర్ధ్యంపై ప్రభావం చూపింది. దీంతో మరింత నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయాడు. మిత్రుల సలహా మేరకు సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నాడు. మూడు సెషన్స్ తర్వాత సమస్య ఏంటో మోహిత్‌కు అర్థమైంది.
మోహిత్‌కి వ్యక్తిగత సరిహద్దులపై అవగాహన లేకపోవడంతో తరచూ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చేవాడు, దీంతో కొలీగ్స్‌కు నచ్చలేదు. ఇదే అతనిపై ప్రతికూల భావన ఏర్పడటానికి కారణమైంది. చివరికి టీమ్ లీడర్‌కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. మోహిత్లాగా చాలామందికి పర్సనల్ స్పేస్‌పై అవగాహన లేక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తమ ఉద్దేశం మంచిదే అయినా ఎదుటివారు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ ఉంటారు. ఆంత్రోపాలజిస్ట్ ఎడ్వర్డ్ టి హాల్ 1996లో వ్యక్తులు మరొకరితో మాట్లాడే సమయంలో ఎంత దూరంలో ఉంటున్నారనే విషయంపై అధ్యయనం చేసి, ఈ పర్సనల్ స్పేస్ భావనను రూపొందించాడు. హాల్ ప్రకారం ప్రతి వ్యక్తి తన చుట్టూ నాలుగు రకాల వృత్తాలను గీసుకుంటాడు. సంబంధిత వ్యక్తులను మాత్రమే ఆ వృత్తంలోకి అనుమతిస్తారు. ఆ వృత్తానికి చెందని వ్యక్తులు ఎవరైనా దాంట్లోకి ప్రవేశిస్తే అసహనం ప్రదర్శిస్తారు. ఆ నాలుగు వృత్తాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
వ్యక్తి నుంచి 46 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ వృత్తంలో భార్య, కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు, పెంపుడు జంతువులకు మాత్రమే ప్రవేశం. వైద్య సిబ్బందికి కొంతమేరకు వెసులుబాటు ఉంటుంది.
సుమారు ఒకటిన్నర అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు విస్తరించి ఉంటుంది. స్నేహితులు పరిచయస్తులు ఇందులో ఇమిడి పోతారు. ఇద్దరి మధ్య షేక్ హ్యాండ్ ఇచ్చేంత దూరం ఉంటుంది.
నాలుగు నుంచి 12 అడుగుల వరకు విస్తరించి ఉంటుంది. వ్యాపార కార్యకలాపాల్లో తారసపడే వ్యక్తులు, క్లయింట్లు ఈ వృత్తంలోనే ఆగిపోతారు.
ఇది 12 నుంచి 25 అడుగుల వరకు విస్తరించి ఉంటుంది. రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు సామాన్యులను ఈ వృత్త పరిధిలోనే ఉంచుతారు. ముఖ పరిచయం లేని వ్యక్తులు ఈ వృత్తానికే పరిమితమవుతారు.
ఈ వృత్తాల పరిధి అందరికి ఒకేలా ఉంటుందా అంటే, ఉండదనే చెప్పాలి. సాంస్కృతిక, భౌగోళిక పరిస్థితులు, వ్యక్తి స్వభావాన్ని బట్టి ఈ పరిధి మారుతూ ఉంటుంది. పురుషులు, మహిళల వృత్తాల పరిధిలో భేదం ఉంటుంది. భారతదేశంలోని ఉత్తరాది రాష్ర్టాల్లో పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలు తండ్రి, అన్నదమ్ములతో చాలా సన్నిహితంగా ఉంటే, దక్షిణ భారతదేశంలో కాస్త దూరంగా మసులుతుంటారు. మహిళలు తమ వ్యక్తిగత వృత్తంలోకి ఎక్కువ మందిని ఆహ్వానిస్తే.. పురుషులు చాలా తక్కువ మందిని అనుమతిస్తారు. ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌లో ఈ స్పేస్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వారు మనల్ని ఎక్కడ ఉంచుతున్నారో గమనించి, అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఏ ఇబ్బందులు తలెత్తవు. వృత్తిగత, వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతుంది.
మానవ సంబంధాలలో ఒక వృత్తానికి పరిమితం చేసిన వ్యక్తి అనుమతి లేకుండా మరో వృత్తంలోకి ప్రవేశిస్తే అతనిపై ప్రతికూల భావనలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. సాంఘిక వృత్తానికే పరిమితం చేసిన స్నేహితుడు వ్యక్తిగత వృత్తంలోకి ప్రవేశిస్తే అసహనం కలుగుతుంది. ఇది కచ్చితంగా వారి స్నేహ సంబంధంపై ప్రభావం చూపుతుంది. మోహిత్ విషయంలో జరిగింది అదే. అతను తన సహజ స్వభావమైన చొచ్చుకుపోయే నైజంతో సరైన బంధం ఏర్పడక ముందే టీమ్ మెంబర్స్ వ్యక్తిగత వృత్తంలోకి ప్రవేశించడం ప్రారంభించాడు. దీంతో అతడి ఉద్దేశం మంచిదే అయినా మేనర్స్ తెలియదనే ముద్ర పడింది.