పీసునాసోండ్లు! గిఫ్ట్ ఇచ్చేటందుకు గిదే దొరికిందా!
అక్క పెళ్లి 1979లో అయినప్పుడు బుచ్చిరెడ్డి సార్‌ని ఆహ్వానించాం. ఆయన పెళ్లికి వచ్చారు. పెళ్లి హడావుడి అంతా అయిపోయాక పెళ్లికి వచ్చిన గిఫ్టులన్నీ చూస్తున్నాం. అప్పటి పెళ్లిళ్లలో అదొక సరదా వుండేది. ఇంటిల్లిపాదీ కూర్చుని పెళ్లి ఫొటోలు చూడటం, వీసీపీ కిరాయికి తెచ్చుకుని పెళ్లి వీడియో చూడటం ఎంతో ఇష్టంగా ఉండేది.
రమాయణం
చదువు నేర్పిన రోజుల్లో 5
నువ్వేందే ఇక్కడ… వంకర మూతి పెట్టి ఎటో చూస్తున్నవు?’ అనో ‘అబ్బా! ఇక్కడ కళ్ళు మూసినవేందే!’ అనో.. ‘నువ్వు మటుకు.. పళ్ళన్నీ బయటబెట్టి ఎట్ల నవ్వుతున్నవు చూడు?’ అనో… ‘గీయనెవరే! నెత్తి గోక్కుంటు పిచ్చోని లెక్క ఉన్నడు? మీ అత్తగారి దిక్కు చుట్టాలా ఏంది?’ అనో కామెంట్లు చేసుకుంటూ చూసేవాళ్ళం. అలాగే గిఫ్టులు చూసేటప్పుడు కొన్ని పెద్ద పాకెట్లు చూసి ‘అబ్బో! ఎంత పెద్ద గిఫ్టో!’ అని విప్పి చూస్తే కాగితం విప్పితే ఇంకో కాగితం.. అది విప్పితే ఇంకోటి, అదీ చించి చూస్తే మరొకటి ఇలా పొరలు పొరలుగా వస్తూనే ఉండేవి. తీరా చూస్తే ఓ చిన్న దేవుడి బొమ్మో, ఓ చాక్లెట్టో ఉండేది. ‘తుస్సు.. ఇంతేనా!’ అనుకునేవాళ్లం. దగ్గరి బంధువులు బట్టలు పెట్టేవాళ్లు గానీ, అప్పట్లో స్టీలు సామాన్లు బాగా ఫ్యాషన్. అందరూ తమకు తోచినంతలో స్టీలు గిన్నెలో, గ్లాసులో, ప్లేట్లో, తట్టలో, టిఫిన్ బాక్సులో కొత్తగా పెళ్లయినవాళ్లకు కాపురానికి పనికొస్తాయని వాటి మీద పేరు కొట్టించి మరీ బహుమతులుగా ఇచ్చేవారు. అందులో ఏవైనా నచ్చనివి ఉంటే వెంటనే పేరు చూసి ‘అబ్బ! పీసునాసోండ్లు! గిఫ్ట్ ఇచ్చేటందుకు గిదే దొరికిందా వీండ్లకు!’ అనుకునేవారు కూడా.
ఇంతకూ అక్కకు వచ్చిన బహుమతులు చూస్తుంటే ఒక అందమైన చిన్న ప్యాకెట్ కనిపించింది. విప్పి చూస్తే అదొక పుస్తకం. ఎర్రటి అట్టతో ఉన్న ‘ఆల్ ద జనత మెన్’ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది బుచ్చిరెడ్డి సార్. పుస్తకాలు బహుమతిగా రావడం మాకు అదే మొదటిసారి. అలా పుస్తకం ఇవ్వడం అనే కాన్సెప్ట్ నాకూ, అక్కకూ నచ్చింది. ఆ పుస్తకం ఇంకా మా ఇంట్లో ఉంది. బుచ్చిరెడ్డి సార్‌కు సాహిత్యం అంటే ఇష్టమని నాకు తెలుసు. వాళ్లింట్లో నవలలు, పత్రికలు, కథల పుస్తకాలు చాలా ఉండేవని మా కజిన్ సంధ్య చెబుతూ ఉండేది.
ఆ తర్వాత కొన్నాళ్లకు బుచ్చిరెడ్డి గారు ఇద్దరు పిల్లలను తీసుకొని అమెరికా వెళ్లిపోయారు. అప్పుడప్పుడు ఇందిరా టీచర్, ఆయన విడివిడిగా నాకు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. తర్వాత శంకరాభరణం, సాగర సంగమం సినిమాల రిలీజ్ తర్వాత ఒకసారి ‘టీచర్, మీరు అన్యధా భావించకపోతే నాకు ఆ సినిమాల్లో పాటలు బాగా నచ్చాయి. నాకు క్యాసెట్ పంపించగలరా!’ అని బుచ్చిరెడ్డి సారు ఉత్తరం రాశారు. సాగర సంగమం రిలీజ్ అయ్యేటప్పటికి నా పెళ్లయ్యి పదిహేను రోజులనుకుంటా. నేను, మా ఆయన దేవ్ కలిసి హనుమకొండలో ఉన్న కాకతీయ మ్యూజిక్ సెంటర్‌కు వెళ్లి ఆ పాటలు రికార్డు చేయించి ఆ క్యాసెట్ ఇందిరా టీచర్ మరిది గోపాల్ రెడ్డి గారికి ఇచ్చాం. అది అందుకున్నాక కూడా బుచ్చిరెడ్డి సార్ చాలా సంతోషపడుతూ ఉత్తరం రాశారు.
నేను 1986లో ఆంధ్రాబ్యాంకులో చేరాక ఒకరోజు కాజీపేట బ్రాంచ్ కౌంటర్లో పనిచేస్తున్నప్పుడు సడన్‌గా బుచ్చిరెడ్డి సార్ అక్కడికి వచ్చారు. రావటమే కాదు, మీకు ఒక స్పెషల్ పర్సన్‌ని చూపిద్దామని తీసుకొచ్చాను అంటూ వెంట ఒకాయన్ని తీసుకొచ్చారు. ఆయన తెల్లగా, పొడుగ్గా నొక్కుల జుట్టుతో ఉండి, చూడగానే మేధావి అనిపించేలా ఉన్నారు. మా కాజీపేట బ్రాంచ్‌లో కౌంటర్స్ వెనక రూమ్‌లో విడిగా స్టాఫ్ కోసం డైనింగ్ టేబుల్, చైర్స్ ఉండేవి.
నేను అక్కడికి తీసుకెళ్లి కాఫీ తెప్పించి వాళ్లతో మాట్లాడాను. అప్పుడు ‘ఈయన నా ఫ్రెండ్ మల్లయ్య. మేమిద్దరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుకున్నాం. అంతే కాదు, ఈయన ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్’ అంటూ వెంట ఉన్నాయన్ని పరిచయం చేశారు. అప్పటికి నేను అంపశయ్య చదవలేదు కానీ, స్వాతి మాస పత్రికలో అనుబంధ నవలలుగా వచ్చిన ‘కాటేసిన కాఠిన్యం, దాగుడుమూతలు’ అనే రెండు నవలలు చదివి నవీన్ గారికి విపరీతమైన ఫ్యాన్ అయిపోయాను. తెలంగాణలో.. అందునా మనకి దగ్గరగా వరంగల్‌లో ఇంత గొప్ప రచయిత ఉన్నారా అని చాలా ఆనందం కలిగింది. అప్పటి పరిచయం నవీన్ గారితో ఆ తర్వాత ఇప్పటి వరకు కొనసాగుతున్నది. ఆయన్ని చాలా విషయాలకి నేను గురువుగా భావిస్తాను. ఆయన కుటుంబంలో భార్య అనసూయ గారు, కూతురు స్వప్న గార్లతో కూడా మంచి స్నేహం ఏర్పడింది. నవీన్ గారిని పరిచయం చేసిన బుచ్చిరెడ్డి సార్‌కి మనసులో కృతజ్ఞతలు చెప్పుకొంటూ ఉంటాను.
ఆ తర్వాత కాలక్రమేణా ఇందిరా టీచర్, బుచ్చిరెడ్డి సార్ రాసే ఉత్తరాలు తగ్గిపోయినాయి. ఇందిరా టీచర్నయితే నేను మళ్లీ ఎప్పుడూ చూడనేలేదు. అప్పుడప్పుడు వాళ్ల సమాచారం తెలుస్తూ ఉండేది. వాళ్లకు అమెరికన్ సిటిజెన్ షిప్ వచ్చిందని తెలిసింది. చాలా రోజుల తర్వాత ఈ మధ్య ఎప్పుడో ఫేస్బుక్లో బుచ్చిరెడ్డి గారు మళ్లీ నాకు ఫ్రెండ్ అయ్యారు. అప్పుడప్పుడు మెసేజెస్ పెడుతూ ఉంటారు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఎంజెల్స్‌లో ఉన్నా ఇండియాలోని రాజకీయ, సామాజిక పరిస్థితులు బాగా ఫాలో అవుతున్నట్లు అనిపించింది. అప్పుడప్పుడూ కవితలు రాస్తుంటారు.
ప్రముఖులు ఎవరైనా సరే, ఏ పొజిషన్లో ఉన్నవాళ్లయినా సరే, పిచ్చి వ్యాఖ్యలు చేసినా, అవినీతిపరులైనా, అధికార దుర్వినియోగం చేసినా అనుచితంగా మాట్లాడినా… వెంటనే తన ఫేస్బుక్ వాల్ మీద వాళ్లను దుయ్యబడుతూ ఉంటారు. అమెరికాలో ఉన్న సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ఆయనకు మంచి సంబంధాలు ఉండటమే కాక ఎన్నో సంస్థల్లో ఆయనకు సభ్యత్వం కూడా ఉంది. ఇండియా నుంచి ఏవైనా సమావేశాలకు, సభలకు సెలెబ్రిటీలు వెళ్లినప్పుడు వాళ్లకి ఆతిథ్యం కూడా ఇస్తుంటాడని ఆయన మాటల ద్వారా తెలిసింది. విప్లవ్, చైతన్యలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయని తెలిసింది. వాళ్లకు నేను గుర్తున్నానో లేదో!
– నెల్లుట్ల రమాదేవి, రచయిత్రి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- cheapskates
- Gift
- give
- ramayanam
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

