ఆ కృష్ణుడు యదుకుల భూషణుడైతే.. ఈ కృష్ణుడు కవికుల దీపకుడు
శ్రీ కృష్ణపరమాత్ముడు.. నరకాసురుడి ప్రాణం తీసి దీపావళిని జరిపించాడు. దాశరథి కృష్ణమాచార్యుడు పాటకు ప్రాణం పోసి అక్షర దీపాలను వెలిగించాడు. ఆ కృష్ణుడు యదుకుల భూషణుడైతే.. ఈ కృష్ణుడు కవికుల దీపకుడు. కవిత్వాన్ని, శ్వాసించి, ఉపాసించి, ఉద్యమించిన దాశరథి రుద్రవీణను మీటి అగ్నిధారను కురిపించిన ప్రజాకవి.
సినీగీత శరథి.. దాశరథి
వెన్నెల దీపం వెలిగించిన కలం
శ్రీకృష్ణపరమాత్ముడు.. నరకాసురుడి ప్రాణం తీసి దీపావళిని జరిపించాడు. దాశరథి కృష్ణమాచార్యుడు పాటకు ప్రాణం పోసి అక్షర దీపాలను వెలిగించాడు. ఆ కృష్ణుడు యదుకుల భూషణుడైతే.. ఈ కృష్ణుడు కవికుల దీపకుడు. కవిత్వాన్ని, శ్వాసించి, ఉపాసించి, ఉద్యమించిన దాశరథి రుద్రవీణను మీటి అగ్నిధారను కురిపించిన ప్రజాకవి. రూపమేదైనా, వస్తువేదైనా కవిత్వంలో దీపాన్నే ఇష్టమైన వస్తువుగా చెప్పుకోవడం గమనార్హం. ‘అమృతాభిషేకం’లో ‘నాకున్ దీప శిఖా కుమారికకు ఈనాడా శతాబ్దాల ముందే కానుండెను పెండ్లి’ అని దీపాన్ని ఏకంగా ప్రేయసి అనే చెప్పుకొన్నారు. అలాంటి దాశరథి సినీ శరధిలోంచి ఉద్భవించిన అమృతధారల్లాంటి గీతాలు, వాటిలోని భావాలు ఇక వారం వారం..
దాశరథి, సినిమాలలో సైతం దీపంపై రకరకాల ప్రతీకలతో పాటలూ రాశారు. ‘విచిత్ర బంధం’లో ‘చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి’ అని పల్లవి రాశాక ఆత్రేయ మిగతా పాట పూర్తి చేశారు. ఇదే చిత్రంలో ‘చల్లనిబాబూ, అల్లరి బాబూ’ అనే పాటలో నాయిక తన కొడుకును ‘ఇంటి దీపం’గా సంబోధించటం దాశరథికి దీపం పైన గల ఇష్టాన్ని సూచిస్తుంది. ‘దాశరథి మనోజ్ఞకావ్య శరధీ’ అని సినారె అంతటి మహాకవి ప్రస్తుతించాడు. నిజమే ఆయన సృజించిన సముద్రమంత సాహిత్యంలో ఒక అమృత కలశమే ఆయన సినీ సాహిత్యం!! మూడు దశాబ్దాల కాలంలో ఆయన రాసింది కేవలం 630 పాటలే అయినా రాసిన ప్రతి పాటనూ రమణీయ శిల్పంగా మలిచారు.
సినీ పాటకు దాశరథి కావ్యగౌరవం కలిగించారు. అయితే ఆయన ఎన్నడూ సినీకవి కావాలని అనుకోలేదు. ఆ ప్రయత్నాలు చేయలేదు. 1961లో ఆత్రేయ తను దర్శకత్వం వహించే ‘వాగ్దానం’ చిత్రంలో పాట రాయాలని దాశరథిని ఆహ్వానించారు. నిజానికి దాశరథి తొలిపాటను అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు చిత్రం కోసమే రాశారు. అయితే వాగ్దానం విడుదలైయ్యాకే
(5-10-1961) ఇద్దరు మిత్రులు (29-12-1961) విడుదలైంది. అలా అనుకోకుండా సినీరంగ ప్రవేశం చేసినా అమృత గుళికల్లాంటి ఆపాత మధురాలు అందించారు. ‘వాగ్దానం’ చిత్రంలో ‘నా కంటి పాపలో నిలిచిపోరా‘ అన్న పల్లవితో రాసిన పాట పెండ్యాల వారి స్వరకల్పనలో ఘంటసాల, సుశీల మధురాతి మధురంగా పాడారు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి అభినయించారు.

Cinee Githa Dasarathi
పల్లవి
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
చరణం 1
ఈనాటి పున్నమి ఏ నాటి పున్నెమో..
జాబిలి వెలిగేను మనకోసమే
నెయ్యాలలో తలపుటుయ్యాలలో..
అందుకొందాము అందని ఆకాశమే
చరణం 2
ఆ చందమామలో ఆనందసీమలో..
వెన్నెల స్నానాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో..
దూర దూరాల స్వర్గాల చేరుదమా
చరణం 3
ఈ పూలదారులూ ఆ నీలితారలూ
తీయని స్వప్నాల తేలించగా
అందాలనూ తీపి బంధాలను
అల్లుకొందాము డెందాలు పాలించగా…
నా కంటి పాపలో నిలిచిపోరా..
నీ వెంట లోకాల గెలువనీరా
పాటలో అలంకారిక శైలి, లలిత పదాల పోహళింపు ఎంతో అలరిస్తుంది. నాయిక నాయకుల దివ్య ప్రణయోపాసనను దాశరథి అందంగా అక్షరీకరించారు. నాయిక నాయకులు, పూల దారుల్లో సాగుతూ మేఘాలలో తేలుతూ, ఉయ్యాలలూగుతూ, నీలి తారలను పలకరిస్తూ, వెన్నెల స్నానాలు చేస్తూ… ఆకాశాన్ని దాటి, దూరంలో ఉన్న స్వర్గానికి చేరాలనే ఆకాంక్షతో ఉన్నట్లు పాటను నిర్మించారు. అంతేకాదు వారు దర్శించిన ‘పున్నమి’ ఎన్నో జన్మల ‘పుణ్యం’ వలనే సిద్ధించిందనే రస సమీకరణం చేయడం హృద్యం! ఈ పాటలో ‘వెన్నెల స్నానాలు’, ‘తీయని స్వప్నాలు’ లాంటి భావచిత్రాలు అలరిస్తాయి. పాట ఆసాంతం మేఘం-రాగం, అందం-గంధం, దారులు-తారలూ వంటి పదబంధాలతో ‘అంత్యానుప్రాస అలంకారం’తో వెలిగింది.
‘ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో’ అనే అభివ్యక్తి ‘ఛేకాను ప్రాస’ అలంకారానికి చెందింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లుల జంట, అర్థభేదంతో వ్యవధి లేకుండా పక్కపక్కనే వస్తే దానిని ఛేకానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ ‘పున్నమి’, ‘పున్నెమో’ అనే పదాలలో ‘న్న’ అనే హల్లుల జంట వెంటవెంటనే వచ్చింది. అలాగే వాటి మధ్య అర్థంలో కూడా తేడా ఉంది. పున్నమి అంటే పౌర్ణమి, పున్నెము అంటే పుణ్యము అని అర్థం.
సంగీత పరంగా ఈ పాటను నవరంగ్లోని ‘ఆధా హై చంద్ మా రాత్ ఆధీ’ అన్న పాట ట్యూన్ స్ఫూర్తిగా తీసుకొని పెండ్యాల ఎంతో లలితంగా మధురంగా ‘భీమ్ పలాసి’ రాగంలో స్వరపరచారు. క్లారినెట్, ఫ్లూట్, వయోలిన్ వాద్యాలపై వినిపించిన స్వరాలు నిజంగా శ్రోతలను దివ్య లోకాలకు తీసుకెళుతాయి.
ఇంతకు ‘నా కంటి పాపలో నిలిచిపోరా’ అంటే, ఏమిటి? తనకిష్టమైన వ్యక్తి ఎల్లప్పుడూ తన కళ్ల ముందే ఉండాలని, తన చూపుల్లోనే ఉండిపోవాలని కోరుకోవడం. కంటిపాపలో నిలిచిన ఆ వ్యక్తి ఇచ్చే ధైర్యంతో, ప్రేరణతో ఈ లోకాన్నే గెలవగలననే నమ్మకాన్ని ‘నీ వెంట లోకాల గెలువ నీరా’ తెలియజేస్తుంది. ఇది అమితమైన ప్రేమను, ఆరాధనను వ్యక్తపరిచే ఒక అందమైన భావం. ఈ విధంగా దాశరథి తొలి గీతమే స్వర మధురిమ, లయ చతురిమలతో నిత్య నూతనమై మన హృదయాలలో నిలిచి.. ఈనాటికీ వెన్నెల దీపంలా వెలుగుతూనే ఉన్నది.
డాక్టర్ వి.వి.రామారావు
రచయిత, వ్యాఖ్యాత, గాయకుడు
9849237663
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

