వివో కంపెనీ భారత్‌లో కొత్త 5జీ ఫోన్‌ను రిలీజ్ చేసింది. వివో ‘టీ4 లైట్’ స్మార్ట్‌ఫోన్.. టీ4 సిరీస్‌లో బేసిక్ వెర్షన్‌గా చేరింది. ఇదే సిరీస్‌లో టీ4, టీ4 అల్ట్రా, టీ4ఎక్స్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ టీ4 లైట్ 5జీ ఫోన్‌కు 6.74 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది. హెచ్డీ రెజల్యూషన్, 90 Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ చాలా స్మూత్‌గా కనిపిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
ఇంకా స్టోరేజ్ కావాలంటే.. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా.. ఫన్‌టచ్ ఓఎస్ 15తో పనిచేస్తుంది. ఈ బడ్జెట్ ఫోన్‌కు వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ మెయిన్ కెమెరా, 2ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్. 15వాట్స్ యూఎస్బీ టైప్-సీ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం వై-ఫై, 5జీ సపోర్ట్, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి. టీ4 లైట్ ఫోన్
మూడు రకాల స్టోరేజ్ ఆప్షన్స్‌లో వస్తున్నది.
-ధర: రూ.9,999 దొరుకు చోటు: ఫ్లిప్ కార్ట్
మీరు ఒకేసారి స్మార్ట్‌వాచ్, ఫోన్, వాలెట్.. ఈ మూడిటినీ మీ చేతి గడియారంలోనే కావాలనుకుంటున్నారా? అయితే, బోట్ కంపెనీ భారత్‌లో కొత్తగా లాంచ్ చేసిన బోట్ వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్ మీకు బెస్ట్ ఆప్షన్. జేబులోంచి ఫోన్ తీయకుండానే పేమెంట్లు చేసేయొచ్చు. ఎందుకంటే.. ఈ వాచ్‌లో కాంటాక్ట్‌లెస్ పేమెంట్ ఫీచర్ ఉంది. అంటే, మీరు మీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ‘బోట్ క్రెస్ట్ పే’ (Boat Crest Pay) యాప్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పిన్ అవసరం లేకుండానే, రూ.5,000 వరకు పేమెంట్లు చేసుకోవచ్చు. ఎన్ఎఫ్సీ సపోర్ట్ ఉన్న ఏదైనా కార్డ్ మెషిన్ దగ్గర వాచ్‌ను ట్యాప్ చేస్తే చాలు.
పేమెంట్ అయిపోతుంది. ఇక వాచ్ ప్రత్యేకతల విషయానికొస్తే.. 1.96 అంగుళాల దీర్ఘచతురస్రాకార డిస్ప్లే ఉంది. 240×282 పిక్సెల్స్ రిజల్యూషన్. మీ ఫోన్‌కు కాల్ వస్తే, నేరుగా వాచ్ నుంచే మాట్లాడవచ్చు. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉండడం వల్ల కాలింగ్ క్వాలిటీ బాగుంటుంది. ఆరోగ్యంపై జాగ్రత్త వహించేలా ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటర్, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి (SpO2) మానిటర్, స్లీప్, స్ట్రెస్ మానిటర్లు ఇందులో ఉన్నాయి. ఆడవారికి పీరియడ్స్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంది. అంతేకాదు, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది కూడా.
-ధర: రూ. 3,299 దొరుకు చోటు: బోట్ అధికారిక వెబ్సైట్.
ఎంత అందమైన ఇల్లు కట్టుకున్నా.. చక్కని సువాసనలతో కూడిన వాతావరణం ఉన్నప్పుడే మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇదే కోరుకుంటున్నారా? ఏదైనా శుభకార్యాలప్పుడు గదిని అద్భుతమైన సువాసనతో నింపాలనుకుంటున్నారా? అయితే, ఐరిస్ సెలెస్టే అరోమాథెరపీ ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్ చక్కని చాయిస్. అత్యాధునిక అల్ట్రాసోనిక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ డిఫ్యూజర్ కేవలం 30 డెసిబెల్స్ శబ్దంతో పనిచేస్తుంది. అంటే, ఇది పనిచేస్తున్నప్పుడు శబ్దమే వినిపించదు.
ఒకవేళ దీన్ని బెడ్రూమ్లో వాడితే మీ నిద్రకు ఎలాంటి భంగం కలగదు. ఈ డిఫ్యూజర్కు 100 ఎంఎల్ నీటిని పట్టుకునే సామర్థ్యం ఉంది. ఒకసారి నింపితే 3-5 గంటల వరకు సువాసనను వెదజల్లుతుంది. ఇది వేడిని ఉపయోగించకుండా పనిచేస్తుంది. దీంతో చాలా సురక్షితం. పర్యావరణానికి కూడా మంచిది. వాడేందుకు.. అడాప్టర్‌ను అల్ట్రాసోనిక్ డిఫ్యూజర్పై ఉండే డీసీ జాక్‌కు కనెక్ట్ చేయాలి. తర్వాత కంటైనర్‌లో నీటిని నింపాలి. దాంట్లోనే వేపరైజర్ ఆయిల్ 10 చుక్కలు నీటిలో వేసి.. టాప్ కవర్‌ను మూసివేయండి. అంతే.. స్విచ్ ఆన్ చేస్తే గదంతా పరిమళమే!
– ధర: రూ.4,000 దొరుకు చోటు: అమెజాన్
సడన్‌గా కరెంట్ పోయినప్పుడు.. లేదంటే చీకట్లో ఏ గార్డెన్లోకో వెళ్లాల్సి వస్తే! ఏం కంగారు పడకండి.. పాతకాలంలో మాదిరిగా ఓ లాంతరు లైటు పట్టుకెళ్లండి. ఇప్పుడు ఆ కిరోసిన్ లాంతరు ఎక్కడ తెమ్మంటారు? అనొద్దు. ఎందుకంటే.. ఇప్పుడు స్మార్ట్ లాంతరు లైట్స్ వచ్చేశాయి. కావాలంటే.. విప్రో కోరల్ ఎమర్జెన్సీ ల్యాంటెన్ లైట్‌ని చూడండి. విప్రో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ స్మార్ట్ లైట్ చూడ్డానికి లాంతరు లానే ఉంటుంది. కాంతిని కూడా పాత పద్ధతిలోనే పెంచుకోవచ్చు.
తగ్గించుకోవచ్చు. క్యాంపింగ్, ప్రయాణాలప్పుడు బాగా ఉపయోగపడుతుంది. 360 డిగ్రీల కోణంలో కాంతిని సమానంగా ప్రసరింపజేస్తుంది. ఈ లాంతరు 3000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీతో పనిచేస్తుంది. పూర్తిగా చార్జ్ అవ్వడానికి 8 గంటలు పడుతుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే, తక్కువ కాంతితో 20 గంటలు.. పూర్తి శాతం కాంతితో 1.5 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది. బరువు తక్కువగా ఉంటుంది. పైన హ్యాండిల్ ఉండటం వల్ల దీన్ని పట్టుకోవడం, తీసుకెళ్లడం చాలా సులువు.
-ధర: రూ. 1250 దొరుకు చోటు: అమెజాన్