కొన్ని క్షేత్రాలు ఎంత ఉన్నతంగా, శక్తిపూర్ణంగా ఉంటాయో.. అదేవిధంగా ఎన్ని సంవత్సరాలైనా మరుభూములు అంతే విరుద్ధమైన (నెగెటివ్) శక్తులతో నిలిచి ఉంటాయి. ఇంటి పక్కన శ్మశానం ఉంటేనే ఇల్లు తీసుకోము. అలాంటిది మొత్తం అపార్ట్మెంట్ ఒక శ్మశానంపైన నిర్మించారు అంటే.. వ్యాపార సరళి ఎంతటి వికృత పోకడలకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతిలో కలిసిపోయి ఉండే విరుద్ధ వాతావరణాన్ని మనం వేరు చేయలేము. బాగు చేయలేము. ఇలాంటి చోట మనిషి తన ఇంద్రియ బలహీనతలకు పూర్తిగా బానిసగా మారి.. తనకు తానే శతృవుగా మారుతాడు. మన స్వస్థితి నుంచి జారిపోతాము. వరుస వ్యాధులు, దుస్సంఘటనలు జరుగుతుంటాయి. వెంటనే ఆ ఇంటిని వదిలి వెళ్లండి. ఇల్లు చూడటం కాదు.. దాని మూలస్థానం ఎలా వచ్చింది? అనే విచారణ కూడా అవసరమే!
మనిషి రెండిటిని జీవితంలో చక్కపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి.. తన కుటుంబ కర్తవ్యాన్ని, రెండు.. తన జీవిత లక్ష్యాన్ని. నిత్యం అనుష్ఠానంతో అంటే, పూజాపునస్కారాలతో, జపతపాలతో చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా సరైన మార్గంలో నడిచి, తన కుటుంబాన్ని గెలుస్తాడు. నిత్యం దేవాలయ దర్శనం చేస్తూ.. ఆయన దృష్టిలో పడతాడు. ఆలయం అనేది అనేక ఆధ్యాత్మిక విద్యలకు కేంద్రస్థానం. అలా భవగత్ తత్తాన్ని తెలుసుకొని, అత్యాశలకు వెళ్లకుండా జీవిత సాఫల్యత పొంది.. జన్మగత దుఃఖాలను గెలిచి జ్ఞానాన్ని అందుకుంటాడు.
తద్వారా సంసారంలో ఉంటూనే, నిత్య కార్యాలు చేస్తూనే తలలో సంసారాన్ని కాకుండా.. సర్వేశ్వరుడిని పెట్టుకొని సమదృష్టితో సాగిపోతాడు. ఇది పెద్దల దృష్టి. అయితే, తన వ్యక్తిగత, పూజాధికాలు చేసుకోవడానికి గుడిలో సాధ్యంకాదు. అది అందరిదీ. అలాగే గుడిలో చేసే శాస్త్రీయ అర్చనలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు గృహంలో జరపడం అసాధ్యం. గంగలో మునక వేసికూడా గంగ (నీళ్లు)ను ఒక పాత్రలో నింపుకొని వస్తాం. నిత్యం నీటిలో కలుపుకొని స్నానం చేస్తాం. అలా.. ఇంటిలో పూజగది, ఊరిలో గుడి ఉన్నా.. వేటి ప్రాధాన్యతలు వాటివే!
కిచెన్‌కు ఎంత వెంటిలేషన్ ఉంటే అంత మంచిది. అనేక ఆహార పదార్థాల తయారీ అంతా అక్కడే! అలాగే, ఆహార సామగ్రి కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి, కిచెన్ సహజసిద్ధమైన వాతావరణం హైజెనిక్‌గా ఉండాలి. కిటికీలు తూర్పు-ఈశాన్యంలో, అలాగే దక్షిణ-ఆగ్నేయంలో పెట్టాలి. తద్వారా క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. ప్లాట్‌ఫామ్ ఎత్తు.. ఆ ఇంటి గృహిణి (ఇల్లాలు) ఎత్తును బట్టి సహజంగా ఫ్లోరింగ్ నుంచి 30 అంగుళాలు పెడతారు. కొందరు ప్లాట్‌ఫామ్ ఎత్తుగా ఉందని.. తిరిగి కాళ్లకింద గద్దె కట్టించుకుంటారు.
ఇదంతా కాకుండా.. ముందుగానే ఇంటి యజమానురాలికి అనుకూలమైన ఎత్తును పెట్టుకోవచ్చు. కింద మెట్టు వద్దు. తూర్పులో పెట్టే కిటికి ప్లాట్‌ఫామ్ నుంచి రెండు అడుగుల ఎత్తు తరువాత ఉండాలి. లేకుంటే వంట చేయడం కష్టం. గాలితో స్టవ్ ఆరిపోయే అవకాశం ఎక్కువ. సింకు.. గదికి ఈశాన్యంలోనే రావాలి. ఇక సెల్ఫ్‌లు దక్షిణం-పడమర పెట్టుకోవాలి. వీలైనంత విశాలమైన ఏరియాతో కిచెన్‌ను నిర్మించాలి. లైట్ వేయకుండానే వంట చేయగలిగే కిచెన్ ఎంతో గొప్పది.
అపార్ట్మెంట్ ఆవరణం కూడా.. వాస్తుపరంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కామన్ ఏరియా అనేదాని మీద అందరికీ హక్కు ఉన్నట్లే.. కార్ పార్కింగ్ ఏరియాలో ఉండే నిర్మాణ లోపాలు, అపరిశుభ్రత, ఎత్తు పల్లాలు, తదితర మూలల్లో కట్టే గదులు.. అన్నీ అందరిమీదా ప్రభావం చూపుతాయి. మనిషికి అర్థంకానిది ఏంటంటే.. తనకు తెలియకుండా ఒక సూక్ష్మ శక్తి.. అది నెగెటివ్ అయినప్పుడు ఎంతో క్రూరంగా, మానవ మనో వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుంది. అందరం కరోనాను ఎదుర్కొన్నాం.
కానీ, దానిని మనం చూశామా? సైంటిస్టులు తప్ప.. దాని కార్యప్రణాళికను, అది ఆక్రమించిన తీరును సామాన్యులు తెలుసుకోగలిగారా?. అలాగే, మనకు కనిపించని సూక్ష్మ ప్రపంచంలో ఎన్నో భయంకరాలు జరుగుతుంటాయి. వాటికి కొన్ని భౌతిక నిర్మాణాలు, పరిసర దోషాలు దోహదపడతాయి. అందుకే.. ఈ శాస్త్రపరమైన జాగ్రత్తలు. వెంటనే ఆ గదిని తొలగించండి. ఆగ్నేయంలో కట్టండి. మీకేకాదు.. అందులో ఉండే స్టాఫ్‌కి కూడా ఆ గది ఇబ్బందులను కలిగిస్తుంది.