కారు గ్యారేజ్‌ను ఇంటికి నైరుతిలో పెట్టుకోవచ్చా? స్మిత, తెల్లాపూర్
ఇంటి ఆవరణలోని ఖాళీస్థలాన్ని కారు పెట్టడానికి వాడుకోవటం అన్ని విధాలుగా బాగుంటుంది. ‘కారు గ్యారేజ్’ కావాలంటే, ఇంటి నిర్మాణ భాగంలో ఏదో ఒక మూల పూర్తిగా వాడుకోవాల్సి వస్తుంది. పూర్తిగా ఇంటిని ముట్టకుండా కారుకు ఇంటి ఆగ్నేయంలో లేదా వాయవ్యంలో ప్రహరీని అంటకుండా ‘గది కట్టి’ దానికి షెట్టర్ పెట్టి (ఒక ఉప గది) వాడుకోవాలి. ఇంటి మూలలను, మధ్యభాగాలను.. అంటే దిక్కులను, విదిక్కులను కట్ చేసే విధానం మంచిది కాదు. ప్రధానంగా ఇంటి నైరుతి భాగం కట్ చేసినా, ఇంటి స్థలం నుంచి ఏదో కారణంగా వేరు చేసినా యజమానులు తీవ్రంగా నష్టపోతారు.
ఇంటిమీద రేకుల రూమ్ వేసుకోవాలి. అలాగే ‘నీళ్ల ట్యాంక్’ రావాలి. ఏ దిశల్లో వాటిని కట్టాలి? నర్సిరెడ్డి, మూటకొండూరు
టెర్రస్‌పైన గది కట్టుకోవాలని అనుకున్నప్పుడు, నీళ్ల ట్యాంక్కన్నా గది ప్రధానం అవుతుంది. అపుడు, ఆ గది స్లాబ్ మీద నైరుతిలోనే వేసుకోవాలి. దానిని రేకులతో వేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి, నీళ్ల ట్యాంక్ వాయవ్యంలోకి మార్చండి. నీళ్ల ట్యాంక్ నైరుతిలో మాత్రమే ఉండాలి అనేది కాదు. ఎత్తుగా నైరుతి భాగాన రేకుల గది వస్తుంది కాబట్టి, దానికి అంటే.. టెర్రస్‌మీద దక్షిణంలో కానీ, పడమర వాయవ్యంలో కానీ నీళ్ల ట్యాంక్ కట్టుకోండి. మీరు కట్టే గదిలోకి నీళ్లు రావాలి. అందులో కూడా టాయిలెట్ పెట్టుకోవాలంటే, అదే గదికి స్లాబ్ వేసుకొని దాని నైరుతిలో ట్యాంక్ పెట్టి వాడుకోవాల్సి వస్తుంది.
ఆగ్నేయంలో మెట్లకు గ్లాస్‌తో ఎలివేషన్ చేయవచ్చా? చంద్రం, బడంగ్‌పేట
ఎలివేషన్ గ్లాస్‌తో చేసినా… సిమెంట్ పరదాలతో చేసినా ఆగ్నేయం మూత పడకుండా చేయాలి. మెట్లకు గ్లాస్ పెట్టాలనుకుంటున్నారు అంటే, మీరు మెట్ల భాగాన్ని కింది వరకే మూస్తున్నారని అర్థం. మీరు ఎన్ని అంతస్తులు వేశారో తెలియదు. అవి ఎన్నయినా కింది గ్రౌండ్‌ఫ్లోర్‌ను వదిలేసి, మీదున్న ఫ్లోర్లకు మాత్రమే అద్దాల ఎలివేషన్ వచ్చేలా చూడండి. కింది ఫ్లోర్లో మెట్లు కనబడే విధంగా వదిలి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ పైకి ఎలివేషన్ వేయండి. అప్పుడు ఆగ్నేయం మూత పడకుండా ఉంటుంది. ఇంటి అందాలు ఇంటిసభ్యులకు బంధాలు కావద్దు.
ఉత్తరం అరుగు తూర్పు అరుగు కన్నా ‘డౌను’ ఉండవచ్చా? ఇంటికి అరుగులు ఎటు దిక్కు ఉంటే మంచిది? భావ నారాయణ, కిలాషాపూర్
ఏ సింహద్వార గృహానికైనా… అరుగులు వేసుకోవచ్చు. అరుగుల ఎత్తు అనేది ఇంటిని మింగినట్టుగా అంటే.. ఇంటి గర్భస్థలాన్ని మించి కాకుండా భుజాల మాదిరిగా ఇంటికి ఒదిగి ఉండాలి. అవి అందాన్ని ఆనందాన్ని ఇస్తాయి. ఉత్తరం, తూర్పు అరుగులు వేస్తున్నప్పుడు రెండు దిశలతో ఒకే ఎత్తు కలిగిన అరుగులు వేసుకోండి. తూర్పు ఎత్తు, ఉత్తర పల్లం చేసుకోవడం మంచిది కాదు. ఇంటి ద్వారాలనుంచి బయటకు రాగానే ‘ఒక మెట్టు కిందకు’ సమానమైన అరుగులు ఉండటం మంచిది. దక్షిణ పశ్చిమాల్లో కూడా ఒకే ఎత్తు కలిగిన అరుగులు వేసుకోవచ్చు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678