టీవీ, ఫోన్, సినిమా ఏదైనా కళ్లకు, చెవులకు మాత్రమే పని చెబుతాయి. ‘చెబితే వినబడుతుంది. చూస్తే కనిపిస్తుంది’ అన్న నానుడి సగంలోనే ఆగిపోతుంది. కానీ, చెప్తేనే అర్థమవుతుంది. కలిపితేనే పూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణత సజీవ నాటకానిదే. సామూహిక మానవ జీవన గమనంలో నాటకాన్ని విడదీయలేం. చర్య-ప్రతిచర్య- ప్రతి చర్యకు ప్రతిచర్య.. ఇలా మానవ మాటల చేతలతో జీవన్నాటకం సాగుతుంది. కథ చెప్పడంలో, విషయాన్ని వివరించడంలో, బోధించడంలో, అనుకరించడంలో… అభినయం సర్వవ్యాపితం. ఈ మాటను కొట్టివేయలేం.
‘విప్పి చెప్పేది వ్యాసం. కప్పి చెప్పేది కవిత్వం’ అన్నారు సినారె. వ్యాసంలో వివరణ ఉంటుంది. వ్యాఖ్య ఉంటుంది. సమీక్ష ఉంటుంది. విమర్శ ఉంటుంది. ‘నాటకాంతం హి సాహిత్యమ్’ అని పెద్దలు వాక్రుచ్చినా, తెలుగు నాటకం ఆఖరి స్థానంలోనే నిలిచిపోయింది. తెలుగులో నాటక రచయితలు వేళ్ల మీద లెక్కించగలిగే సంఖ్యలోనే ఉన్నారు. పాఠ్యపుస్తకాల్లో నాటకం అంతర్థానమైపోయింది. డిజిటల్ ఎరా (శకం)లో జీవిస్తున్నా ఈ నాటకాల గోలేంటి? అనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. నాటకం జీవితంలో అంతర్భాగమని, అబద్ధం ఆడినప్పుడల్లా, ఇష్టం లేని పనులు చేసినప్పుడల్లా మనలోని సహజాతమైన నాటక ప్రవృత్తి మేల్కొంటుందన్న వాస్తవాన్ని వారు గ్రహించలేకున్నారు. అలాగే చెప్పేదొక్కటి, చేసేదొకటి అయినప్పుడు జీవితమే నాటకంగా తిరగబడిందన్న సత్యాన్నీ తెలుసుకోరు.
కార్పొరేట్ వ్యవస్థ నేడు విశ్వమంతటా శాస్త్ర సాంకేతిక, కృత్రిమ మేధస్సు (ఏఐ) అంశాలతో మనిషిని శాసిస్తున్నది. దైనందిన జీవితంలో అలా కొట్టుకుపోతున్న (మర)మనిషిని మరల తిరిగి మానవ హృదయానికి చేరువ చేసేది కళ ఒక్కటే. అందులో నాటకం అద్వితీయం. అందుకే మనిషిని మనిషిగా మేల్కొల్పేందుకు నేడు అమెరికా ఎంఐటీ, నాసా, ఐఐటీ వంటి అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థల్లో రంగస్థల కళా విద్య (థియేటర్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్) ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. నాటకం ప్రాధాన్యాన్ని గ్రహించినవారు తమ సంస్థల్లో ఈ కళకు అగ్రతాంబూలం ఇస్తున్నారు. సమాచార నైపుణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్), భాషా నైపుణ్యాలు (లాంగ్వేజ్ స్కిల్స్) అన్నీ అభినయంతో ముడిపడి ఉన్నాయి. మాట్లాడటం, స్పష్టంగా మాట్లాడటం, బిగ్గరగా మాట్లాడటం, అర్థవంతంగా మాట్లాడటం, అవగాహనతో మాట్లాడటం, ఆకర్షణీయంగా (పాత్రోచితంగా) మాట్లాడటం ఇవన్నీ దశలు. మన విద్యావ్యవస్థలో ఇవన్నీ కొరవడి విద్యార్థులు మార్కులు, ర్యాంకులు ఒరవడిలో కొట్టుకుపోతున్నారు.
సాంఘిక నాటకాలకు పరిషత్లు వేదికలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాలు నంది నాటకోత్సవాలకు, యంగ్ తరంగ్ వంటి ఉత్సవాలకు అప్పుడప్పుడూ తెర తీస్తున్నాయి. బాలోత్సవాల్లో బాలలు స్కిట్స్ వేస్తున్నారు. ఎన్జీఓలు అక్కడక్కడా కళా జాతరలు నిర్వహిస్తున్నాయి. దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఆధునిక తెలుగు నాటకం ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూసింది. ఒడుదొడుకులను ఎదుర్కొన్నది. పల్లెల్లో పద్యనాటకం, యక్షగానం, వీధి నాటక ప్రక్రియలు పౌరాణిక, చారిత్రక ఇతివృత్తాలతో ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని అవశేషాలని చెప్పలేం. ఏ చిన్న ప్రాణాంశం ఉన్నా అది మరల లేచి బట్టకట్టగలుగుతున్నది. మరో రూపంలో సాక్షాత్కరిస్తున్నది. సృజనశీలత అంటే అదే కదా!
ఇలాంటి దశలో దాదాపు ఈ ఏడాది (2025) ఏభైవారాల పాటు నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో ‘ఆన్స్టేజ్’ శీర్షికలో పలు నాటకాలు-నాటికలు పరిచయం చేయడం సాధ్యమైంది. నాటక కళాకారులలో, అభిమానులలో ఏ పత్రికకు లభించని గౌరవం ‘నమస్తే తెలంగాణ’కు దక్కింది. ‘నాటకం మానవ జీవన దర్పణమే కాదు. పోరు బాటలో నడిచే సాధనం కూడా’ అని చరిత్ర చెబుతున్నది. జీవితం చేయలేని స్పష్టత నాటకం చేస్తుంది. అలాగే సమాజం గతంలో, ఇప్పుడు ఎట్లున్నదో చూపడమే కాకుండా భవిష్యత్లో ఎలా ఉంటే బావుంటుందో కూడా రంగస్థలం చర్చకు పెట్టవలసి ఉంటుంది. అది నాటకం.. ఆధునిక ప్రజాస్వామ్య విధి. యుద్ధాలు, ఉగ్రదాడులు, అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం, కుల-మత విద్వేషాలు, మానవ హక్కుల హననం లోకమంతటా విస్తరిస్తున్నాయి. ఈ కాలంలో మానవ జాతికి ఆత్మైస్థెర్యం నూరిపోసి, జీవితంపై అనురక్తి కలిగించి, మనిషిని సచేతనంగా ముందుకు నడిపించే కర్తవ్యాన్ని నాటకం ఎప్పుడూ భుజాన ఎత్తుకుంటూనే ఉంటుంది. మనిషిలో కరుడుగట్టిన స్వార్థాన్ని ప్రక్షాళన గావించేందుకు, పేరుకుపోయిన అమానవీయ కుళ్లును కడిగేందుకు రంగస్థలం నిరంతరం తెరతీస్తూనే ఉంటుంది. నాటకమా వర్థిల్లు.
ధన్యవాదాలతో..
…? కె.శాంతారావు