ప్రేమకథ.. ఫ్యామిలీ డ్రామా.. లేడీ ఓరియెంటెడ్… జానర్ ఏదైనా తనను తెరపై చూస్తున్నంత సేపు వెన్నెల్లో విహరించిన అనుభూతి పంచిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. అలా తనదైన అందం, అభినయంతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా దశాబ్దానికిపైగా రాణించిందీ ముద్దుగుమ్మ. పెండ్లి తర్వాత కూడా
వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. తాజాగా సత్యభామ’గా సాఫ్ట్ లుక్తో కుర్రకారు మనసు దోచేసింది.
నా మొదటి సినిమా ‘లక్ష్మీ కల్యాణం’. ఆ సినిమా కంటే ముందు ఓ హిందీ సినిమా సైన్ చేశాను. కానీ అక్కడ షూటింగ్ మొదలుపెట్టక ముందే తెలుగులో ‘లక్ష్మీ కల్యాణం’ రిలీజైంది. అలా నేను హీరోయిన్గా తెలుగు సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యా. స్కూల్ డేస్లో ఓ హిందీ సినిమాలో చిన్నపాత్రలో కనిపించా.
ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం మాది. నేను నటి కావాలనేది దైవనిర్ణయం అనుకుంటా. కామెడీ, రొమాన్స్ సినిమాలను ఇష్టపడతాను. నేను ఇప్పటివరకు నటించిన సినిమాల్లోని పాత్రల పేర్లన్నీ గుర్తున్నాయి. ఎన్టీఆర్తో చేసిన ‘బాద్షా’లో జానకి పాత్ర చాలా ఇష్టం.
తెలుగు, తమిళం, హిందీ.. మూడు భాషల్లో దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించా. దాదాపు దక్షిణాదిన స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశం వచ్చింది. అంతేకాదు రెండు తరాల హీరోలతోనూ నటించాను. ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేశాను. ‘మగధీర’ తర్వాత నా కెరీర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది.
మావారిది, నాది స్నేహం నుంచి పుట్టిన ప్రేమ. పదేండ్లు మేం స్నేహితులుగా ఉన్నాం. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాక మా బంధాన్ని ప్రేమగా గుర్తించి పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నాం. బాబు పుట్టిన తర్వాత జీవితానికి పరిపూర్ణత వచ్చిందనుకుంటున్నా.
నేను, చెల్లి మంచి స్నేహితులం. ఇద్దరిలో నేనే ఎక్కువగా అల్లరిపిల్లను. చదువుకునే రోజుల్లో చాలా కొంటె పనులు చేసేదాన్ని. టీచర్స్ నా గురించి అమ్మకు కంప్లయింట్ చేసేవాళ్లు. ఇంటి దగ్గర కూడా మా అల్లరి మామూలుగా ఉండేది కాదు.
మాడ్రన్ డ్రెస్సులకంటే చీర కట్టుకోవడానికే ఇష్టపడతాను. మామిడి పండ్లంటే ఇష్టం. ఎక్కువ దూరం ప్రయాణం చేయడం నచ్చదు. ప్రయాణాల కోసం సమయం వృథా చేసుకోను. అందుకే విమానంలో ప్రయాణించడానికే ప్రాధాన్యమిస్తా.
నేను ముంబయిలో పుట్టి పెరిగా. అందువల్ల నాకు తెలుగు నేర్చుకోవడం బాగా కష్టమైంది. కానీ ఇప్పుడు తెలుగు నా రెండో భాషగా మారిపోయింది. తెలుగు సంస్కృతి అంటే చాలా ఇష్టం. అందుకే నా పెండ్లిలో కొన్ని క్రతువులు తెలుగు సంప్రదాయానికి సంబంధించినవి ఉండేలా చూసుకున్నా. నా పెండ్లి గురించి తెలుగు మీడియాలో చాలాసార్లు ఫేక్ వార్తలు షికారు చేశాయి. అందుకే నిజం పెండ్లి కూడా తెలుగు సంప్రదాయంలోనే చేసుకున్నా.