కారో, బైకో ఉంటే కంపెనీకి ఓనరైనట్టే!
దేశంలో డిగ్రీ పాస్డ్ అవుట్లు పెరిగిపోతున్నట్టే నిరుద్యోగులూ పెరుగుతున్నారు. కంపెనీల్లో కొలువులు దొరకట్లేదు. ఉన్న ఉద్యోగాలే ‘లే ఆఫ్' దెబ్బకు ఊడిపోతున్నాయి. ఏఐ దెబ్బ తక్కువేం లేదు! దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా చేతినిండా పని కల్పించే దారి పడింది. ఈ కొలువులో ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఎవరి కిందో పనిచేయాల్సిన అవసరం లేదు. కారో, బైకో ఉంటే చాలు.. కంపెనీకి ఓనరైనట్టే! రైడ్ హయరింగ్ రంగంలో కొత్తగా ‘భారత్ ట్యాక్సీ’ వచ్చింది. ఇందులో రైడర్లే ఓనర్లు!
భారత్ ట్యాక్సీ..
అర్జెంట్‌గా హాస్పిటల్‌కి పోవాలి. ఎవరూ తోడు లేనప్పుడు.. యాప్‌లో ఆటో బుక్ చేసుకుంటే క్షణాల్లో వస్తాడు. నిమిషాల్లో తీసుకుపోతాడు. మళ్లీ అదే పద్ధతిలో ఇంటికి చేరుకోవచ్చు. అంతా పూటలో జరిగిపోతుంది. షాపింగ్, ఫంక్షన్, కాలేజ్, ఆఫీస్.. ఇలా ఎక్కడికి ఏ పని మీద పోవాలన్నా చేతిలో బండి ఉండాలని లేదు. బండి ఉన్నా డ్రైవర్ లేడనే బాధ లేదు. టెక్నాలజీ ప్రయాణాన్ని చాలా స్మార్ట్‌గా మార్చేసింది. అయితే ఒక్కటే సమస్య. వెయిటింగ్ చార్జీలు, డిమాండ్ ఉంటే ఎక్స్ట్రా చార్జ్, ట్రిప్ ఎక్కువ ఆఫర్ చేస్తే క్విక్ బుకింగ్‌తో ప్రయాణికుడి జేబుకు కొన్ని సంస్థలు చిల్లుపెడుతున్నాయి. డబ్బులు ఊరికే రావు. కానీ, అత్యవసర పరిస్థితుల్లో పొదుపుకన్నా ప్రయాణమే ముఖ్యం. కాబట్టి పోతే పోనీలే అనుకుంటూ ఓ పది రూపాయలు ఎక్కువైనా ఫర్వాలేదులే అనుకుంటూ చెల్లిస్తారు. ఆ పది పేదవాడికి దక్కుతాయనే సంతృప్తితో సర్దుకుపోతుంటారు. కానీ, అందులో రైడర్‌కు పెద్దగా దక్కేదేమీ ఉండదు. కంపెనీ కమిషన్, పెట్రోల్ చార్జీలు పోగా మిగిలేది చిల్లరే! ట్రాఫిక్ పద్మవ్యూహంలో పడి ఎండలో మాడిపోతూ, దుమ్మూధూళి పీల్చుతూ కష్టపడే రైడర్‌కు మిగిలేది అనారోగ్యమే.

Taxi
స్పీడందుకున్న కొత్త ప్రయాణం
ఇన్ని కష్టాల్లో ఉన్న బైక్, క్యాబ్ రైడర్లకు కొత్త ఆలోచన వచ్చింది. పేరుకే పార్ట్నర్ కాకుండా లాభాల్లో భాగస్వామ్యం ఉండే కో-ఆపరేటివ్ బైక్ ట్యాక్సీలు తేవాలని యాప్ డ్రైవర్లు కలలుకన్నారు. అది కేరళంలో మొదటిసారిగా నిజమైంది. ‘కేరళ సవారీ’ యాప్‌కి కొద్ది కాలానికే బ్రేకులు పడ్డాయి. అయినా ప్రైవేట్ యాప్ బేస్డ్ డ్రైవర్లు పట్టు వీడలేదు. కో-ఆపరేటివ్ సంస్థను నిర్మించాలనే లక్షల మంది రైడర్ల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ‘రైట్ రైట్’ అంటూ ‘భారత్ ట్యాక్సీ’ గ్రేటర్ ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్‌గా జర్నీ మొదలైంది. ప్రైవేట్ యాప్‌లలో ఉన్న రైడర్లు భారత్ ట్యాక్సీ యాప్‌లోకి ఆన్ బోర్డ్ అయిపోయారు. గుజరాత్‌లోనూ ఇదే జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్‌లోకి విస్తరించింది. తెలంగాణలో అడుగుపెట్టింది.
డ్రైవర్లే కంపెనీ ఓనర్లు!
ఎక్కువ గంటల ప్రయాణం, తక్కువ ఆదాయంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ప్రైవేట్ యాప్ బేస్డ్ డ్రైవర్లు ఎక్కువ సంపాదించుకునేందుకు భారత్ ట్యాక్సీ బంగారు బాట చూపుతున్నది. భారత్ ట్యాక్సీకి ఓనర్ కావాలంటే వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం అయిదు షేర్ల వాటా కొనాలి. ఒక్కో షేరు వంద రూపాయలే. ఓనరు అయిపోతే రైడ్లకు పోవచ్చు. వినియోగదారుడు చెల్లించే డబ్బులో ఎనభై శాతం రైడర్ ఖాతాలో జమవుతాయి. మిగతా ఇరవై శాతం కూడా రైడర్‌కే చెందుతాయి. కానీ, అవి కంపెనీలో వాటాగా జమవుతాయి. అలా ప్రతి రైడ్‌కు తన వాటా పెరుగుతూ పోతుంది. రెక్కల కష్టం ఎవరికో ఇవ్వకుండా తన వారసులకు ఆస్తిగా కార్లే కాదు కంపెనీలో వాటా కూడా రాసివ్వొచ్చు. వాహనాలు పాతపడి ధరను కోల్పోయినా కంపెనీలో వాటా విలువ పెరిగి భవిష్యత్‌కి భరోసానిస్తుంది. తెలంగాణలోకి విస్తరిస్తున్న ఈ సేవల్లో సరసమైన చార్జీలు, పారదర్శకమైన సంపాదన, ప్రతి డ్రైవర్‌కు గౌరవం ఉంటుందని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సలావుద్దీన్ అంటున్నారు. దేశంలోని మొదటి కో-ఆపరేషన్ ట్యాక్సీ భారత్ ట్యాక్సీలో రైడర్ ఆన్ బోర్డింగ్ డ్రైవ్ హైదరాబాద్‌లో మొదలైంది. కొద్ది రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. భారత్ ట్యాక్సీతో రైడర్లకు ఆదాయమే కాదు గౌరవమూ పెరగాలని ఆశిద్దాం.

Taxi 1
గాంధీ మార్గం
తక్కువ పెట్టుబడి, ఎక్కువ శ్రమతో సహకార రంగం మొగ్గ తొడిగింది. జాతీయోద్యమ కాలంలో స్వయం సమృద్ధి సాధించేందుకు సహకార రంగాన్ని స్వీకరించాలని గాంధీజీ పిలుపునిచ్చారు. సర్వోదయం (అందరి సంక్షేమం) కోసం గాంధీ మార్గంలో అనేక సహకార సంస్థల స్థాపన జరిగింది. పాడి పరిశ్రమ, వ్యవసాయంలో వాటి విజయాలు చూస్తూనే ఉన్నాం. ‘తోడి కోడళ్లు’లో ‘నలుగురు కలిసీ పొరుపులు మరచి… చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం .. మనకిస్తుందెంతో ఫలసాయం’ అని కొసరాజు చెప్పినట్టే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పాడి రైతులు స్థాపించిన సహకార సంస్థ కరీంనగర్ డెయిరీ లాభాలు దక్కించుకుంది. దేశంలో సహకార రంగం ఎంతగా విస్తరించిందంటే?… సహకార సంస్థల కోసమే కేంద్ర ప్రభుత్వంలో సహకార మంత్రిత్వ శాఖే ఉంది. అనేక రంగాల్లో విస్తరించిన సహకార సంస్థల స్ఫూర్తితో పాసింజర్ ట్రాన్స్పోర్ట్ రంగంలో బైక్, కార్ రైడర్లే ఓనర్లుగా భారత్ ట్యాక్సీ ప్రారంభమైంది. కో-ఆపరేటివ్ పద్ధతిలో మొదలైన ఈ కొత్త ప్రయాణం అనేక రాష్ర్టాల్లో విజయవంతమై తెలంగాణలో అడుగుపెట్టింది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Bharat Taxi
- bike
- own a car
- Owner
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

