ఆకాశపు కాన్వాస్ మీద మోడ్రన్ ఆర్ట్ అద్దినట్టు కనువిందు చేస్తున్నాయి కదూ ఈ మబ్బులు. నింగిలోని రంగులన్నీ పులుముకొని వయ్యారాలు ఒలకబోసే ఇంద్రచాపానికి అక్కాచెల్లెళ్లివి. వీటిని రెయిన్బో క్లౌడ్స్ (హరివిల్లు మబ్బులు) అని పిలుస్తారు. చిరుజల్లులు కురిసే వేళ ఈ హరివిల్లు మబ్బుల సంగతేంటో
మనమూ చూద్దామా!
కొన్ని వర్షాకాలం వచ్చిందంటే ఆకాశంలో విరిసే సింగిడి ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. మనసు ఎలా ఉన్నా ఓ చూపు ఆ చాపం మీద పడిందంటే కళ్లింతలవ్వాల్సిందే. ఎన్నోసార్లు చూసిందే అయినా సరే, పక్కన వారికీ చూపించి ఆ అనుభూతిని అటు కూడా ప్రసరింపజేసి సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటాం. అచ్చం హరివిల్లులాగే రెయిన్ బో క్లౌడ్స్ కూడా ఓ ప్రకృతి వింత. సరైన పరిస్థితులు ఏర్పడితే ప్రపంచంలో ఎక్కడైనా ఏర్పడే ఇవి, అధికంగా ధ్రువప్రాంతాల దగ్గర కనిపిస్తాయి. ఉత్తర ధ్రువ ప్రాంతంలో ముఖ్యంగా కెనడా, స్కాట్లాండ్లతో పాటు నార్వే, స్వీడన్, డెన్మార్క్లాంటి స్కాండినేవియన్ దేశాల్లోని ప్రజలు వసంతకాలంతో పాటు వర్షాకాలంలోనూ అరుదుగా శిశిరంలోనూ వీటిని చూస్తుంటారు. సాధారణంగా హిమపాతం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ప్రత్యేక వాతావరణం ఏర్పడినప్పుడు ఇవి కనిపిస్తాయి. ఆల్చిప్పల్లాగే సప్తవర్ణాలనూ ప్రతిబింబిస్తాయని మదర్ ఆఫ్ పెరల్ క్లౌడ్స్ అనీ, నాక్రియస్ క్లౌడ్స్ అనీ అంటారు.
మబ్బులలో ఉండే నీటి బిందువుల మీద సూర్యకాంతి పడి వక్రీభవనం చెందడం ద్వారా ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. సాధారణమైన వాటికన్నా మరింత ఎత్తయిన ప్రాంతాల్లో ఉండే మబ్బుల్లోని మంచు స్ఫటికాల (ఐస్ క్రిస్టల్స్) గుండా సూర్యకాంతి ప్రసరించి వక్రీభవనం చెందడం వల్ల మేఘాలు రంగు రంగుల్లో కనిపించడమే కాకుండా, ఆకర్షణీయంగా వెలుగుతూ కనువిందు చేస్తాయి. అయితే ఇలా హరివిల్లు మబ్బులు ఏర్పడేందుకు భానుడి కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో పడటం అన్నది కూడా ప్రధానమే.
ముఖ్యంగా మన కంటికి అంత బాగా సూర్యుడు కనిపించని సమయంలో అంటే సూర్యోదయం అయిన వెంటనే లేదా సూర్యాస్తమయం అవుతున్న వేళలో ఈ సప్తవర్ణాల మేఘాలు ఆవిష్కృతం అయ్యే అవకాశం ఎక్కువ. ఇక నేలకు 15 నుంచి 25 కిలోమీటర్ల ఎత్తులో ఉండే మబ్బుల్లో ఇవి ఏర్పడతాయి. సాధారణంగా ఇంత ఎత్తులో ఉండే మేఘాల్లో పొడి వాతావరణం ఉంటుంది. కానీ ధ్రువ ప్రాంతం కావడంతో ఇక్కడ మైనస్ 85కు పైగా డిగ్రీల సెల్షియస్ ఉండే అవకాశాలుంటాయి. ఇన్ని లెక్కలు ఉంటాయి కాబట్టే, ఈ రెయిన్ బో క్లౌడ్స్ మనకు అరుదుగా ఏర్పడతాయి. నిజమే… అద్భుతాలు అన్ని సార్లూ జరగవు మరి!