Tea | ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న సూత్రం గుర్తుందిగా! ఔషధ పానీయంగా పేరున్న తేనీటికి కూడా ఇది వర్తిస్తుంది. తేనీటి వల్ల కలిగే లాభనష్టాల సంగతి కాసేపు అటుంచుదాం! ప్రపంచం మెచ్చిన చిక్కటి టీపై పరిశోధకుల ప్రేమ అతిగానే అనిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు.. స్థానిక విశ్వవిద్యాలయం నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వరకు తేనీటిని మించిన పరిశోధన వస్తువు మరొకటి దొరకదు. అందుకే, రోజుకో పరిశోధన కొత్త అధ్యాయానికి తెరతీస్తుంటుంది. గ్రీన్ టీ తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఒక పరిశోధన తేటతెల్లం చేస్తుంది. ఆ సంగతి మరవకముందే రాత్రి పూట గ్రీన్ టీ తాగొద్దని మరో అధ్యయనం వెలుగు చూస్తుంది. బ్లాక్ టీ బాగు అని ఒకరు తేలిస్తే, చాక్లెట్ టీ వల్ల నష్టం తప్పదని మరొకరు హెచ్చరిస్తారు. నిద్రను అధిగమించడానికి ఏకాక్షరిని సేవిస్తే వయసు త్వరగా మీదపడుతుందని ఓ పరిశోధన సారాంశం. అతిగా టీ సేవిస్తే.. ఆకలి మందగిస్తుందన్నది కాదనలేని సత్యం.
పనిభారం ఎక్కువైందనీ, తలనొప్పి బాధపెడుతుందని గడికో టీ గుటకేస్తే జీర్ణశక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది. ఎంత మెడిసిన్ అయినా నాలుగైదు టాబ్లెట్లు ఒకేసారి వేసుకుంటే ప్రమాదమే కదా! టీ కూడా అంతే!! తేనీటి ప్రేమికులు ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించకపోయినా కాదనలేని సత్యం. పలు అంతర్జాతీయ రీసెర్చ్‌లు, సర్వేల సారాంశాన్ని బట్టి రోజుకు గరిష్ఠంగా నాలుగు కప్పులకు మించి టీ తాగడం అనర్థమని తేలింది. ఉదయం ఒక‘టీ’, ఉపాహారం తర్వాత మరొక‘టీ’, సాయంత్రం ఇంకో‘టీ’.. అంతగా కావాలనుకుంటే మధ్యాహ్నం మూడో ‘టీ’ని సేవించవచ్చని పరిశోధకుల ఉవాచ. వాళ్లు చెప్పేదీ మన మంచికేగా, చక్కటి చిక్కటి ‘టీ’ దొరకాలే కానీ, అదిచ్చే కిక్కుతో రోజంతా హుషారుగా ఉండొచ్చు.
నీళ్లు: రెండు కప్పులు, పాలు: ఒక కప్పు, నీలగిరి టీ పొడి: రెండు టీస్పూన్లు, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు
తయారీ: ముందుగా కాస్త మందం అడుగు ఉన్న గిన్నెను పొయ్యి మీద పెట్టి స్టౌ వెలిగించాలి. అందులో నీళ్లు పోసి కాస్త సెగ పుడుతున్నప్పుడు చక్కెర వేయాలి. చక్కెర కరిగిన తర్వాత టీ పొడి వేయాలి. ఐదారు నిమిషాలపాటు సన్నని మంటపై బాగా మరిగించాలి. డికాక్షన్ పొంగకుండా చూసుకోవాలి. బాగా మసిలిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి పోకుండా గిన్నెపై ఒక నిమిషం పాటు మూతపెట్టాలి. మరో గిన్నెలో పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు డికాక్షన్ను సగం గ్లాస్ వరకు వడగట్టుకొని, అందులో మిగతా సగం పాలుపోసుకోవాలి. రుచికరమైన నీలగిరి టీ సిద్ధం!
మధ్యాహ్నం వేళ తేనీటిని ఆస్వాదించే సమయాన్ని.. జీవితంలో అరుదైన వేడుకగా అభివర్ణించవచ్చు.
-హెన్రీ జేమ్స్,ఆంగ్ల రచయిత