‘బుద్ధం శరణం గచ్ఛామి.. సంఘం శరణం గచ్ఛామి… ధర్మం శరణం గచ్ఛామి’ ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తున్నది. ‘ప్రపంచ శాంతిని, ప్రకృతి రక్షణనూ, విశ్వమానవ కల్యాణాన్ని కోరుకునే వారందరినీ గౌతమ బుద్ధుని జీవితం, బోధనలు సామాజిక బాధ్యతలవైపు ప్రభావితం చేస్తాయి’ అని పేర్కొంటూ చిలువేరు రఘురాం ‘సత్యాన్వేషి’ నాటకం రచించారు. విశ్వశాంతి అత్యావశ్యకమైన నేడు బుద్ధుడి బోధనలు ఎంతో అవసరం, అనివార్యం. ఆ బోధనలు ఆచరణ యోగ్యమే కాదు ఆచరణ సాధ్యమే.
సత్యాన్వేషి (సిద్ధార్థుని మహాభినిష్క్రమణ చారిత్రక నాటకం)కి ప్రధాన ఆధారం డి. నటరాజ్ శాఖ్య రచించిన ‘బుద్ధ పథగామి’ నవల. గంట నలభై అయిదు నిమిషాల నిడివి గల ఈ నాటకాన్ని పదహారు దృశ్యాలుగా విభజించారు. దాదాపు ఇరవై మంది పాత్రధారులు. సిద్ధార్థుని పన్నెండో ఏట జన్మ దినోత్సవ వేడుకల నుంచి వివాహం జరగడం, ఓ బిడ్డకు తండ్రి కావడం, ధర్మ చింతనతో పరివ్రాజకుడిగా మారిన క్రమం అంతా నాటకంలో దృశ్య బంధమైంది. ‘యశోధరా! అనంతమైన ఈ సృష్టిలో అశాశ్వత సుఖాలు త్యజించి, అలౌకిక శాశ్వత ఆనందాన్ని పంచుకుందాం. బంధాల కంటే బాధ్యతలు గొప్పవి. సుఖంలోనూ, త్యాగంలోనూ నన్ను అనుసరిస్తావు కదూ..’ అని తొలి రేయిలోనే ప్రాణ సుఖితో సంభాషిస్తాడు సిద్ధార్థుడు.
***
ఒకానొక రాత్రి సిద్ధార్థుడి అంతరంగం ఇలా ప్రశ్నిస్తుంది. ‘వినిపిస్తుందా? మనసనే మహా సముద్రంలో నరఘోష వినిపిస్తుందా? బాగా విను. ఈ నరఘోషలో దుఃఖాలు, బాధలు, స్వార్థం, హింస, దౌర్జన్యాలు, ప్రతీకార వాంఛలు, మృత్యు రోధనలు, ప్రళయకాల కారుమబ్బుల వలె ఎలా కబళిస్తున్నాయో?’ నాటకం చదువుతున్నంత సేపూ పాఠకుడు అంతర్ముఖుడు కాక తప్పదు. అయినా సరే.. ఏ నాటకానికైనా ప్రదర్శనే గీటురాయి. రమ్యమైన ప్రకృతిలో హింసకు స్థానం లేదంటూ అణువణువునా నాటకం నొక్కి వక్కానిస్తుంది.
***
వేటాడి బాణంతో కొట్టిన పక్షి తనకే చెందాలని దేవదత్తుడు, గాయపడిన పక్షికి కట్టుకట్టి సాంత్వన చేకూర్చిన పక్షి తనకే చెందాలన్న సిద్ధార్థుని వాదన చివరికి రాజ దర్బారుకు చేరుకుంటుంది. ధర్మమూర్తులు.. ‘దేవదత్తునికి పక్షి చెందాలంటే తాను వేటాడిన పక్షి చావాలి. ఆ పక్షి గాయపడింది. కానీ, చావలేదు. సిద్ధార్థుని సపర్యలతో కోలుకుంది. కనుక ఆ పక్షి సిద్ధార్థునికే చెందుట ముమ్మాటికీ న్యాయం’ అని సెలవిస్తారు. ‘రక్షించినంత మాత్రాన ఆ పక్షిపై నాకెలాంటి హక్కు లేదు’ అని సిద్ధార్థుడు అంటాడు. అయినా.. ‘రక్షించే వారికే మూగజీవాలపై హక్కు ఉంటుంది’ అని సభ నిర్ణయించింది. ఆ విధంగా రాజ్యంగ సవరణ చేస్తుంది. ‘ఏమిటి ఈ సృష్టి? మనుషుల్లో ఈ హింసా ప్రవృత్తి ఏమిటి? పక్షులు, జంతువుల పట్ల మనుషుల్లో కారుణ్యం ఎలా మొలకెత్తాలి?’ సిద్ధార్థునిలో శోధన మొదలవుతుంది.

***
రోహిణీ నది నీటి కోసం కొలీయులు, శాక్య ప్రజల మధ్య ఘర్షణ తలెత్తుతుంది. ‘ప్రకృతి ప్రసాదించిన నీటి కోసం దాడులు చేయాలా? యుద్ధాలు చేయాలా? రక్తపుటేర్లు పారించాలా? ఈ మాటలు అనడానికి వినడానికి మనకు అవమానంగా లేదూ?’ అన్న సిద్ధార్థుని వాక్కులు ఇప్పటికీ మానవ జాతికి ఓ హెచ్చరికే. శిరోధార్యమే. ‘దుఃఖానికి హేతువు మనలోని రాగద్వేషాలు, ఆవేశాలు. మనిషి బతకడం కోసమే యుద్ధాలు చేయాల్సి వస్తే.. ఈ భూమ్మీద ఎవరూ బతకలేరు’ అని సిద్ధార్థుడు నిర్దంద్వంగా ప్రకటిస్తాడు.
***
సిద్ధార్థుడు పరివ్రాజకునిగా మారిన తర్వాత.. ‘నీవారి కోసం నీవు వెనక్కి రాలేవా?’ అని మిత్రుడైన చెన్నడు ప్రశ్నిస్తే.. ‘నదీ ప్రవాహాన్ని ఒక్కసారి వెనక్కి రమ్మనగలవా? ఇదీ అంతే… అంటే మహాభినిష్క్రమణ సాగుతుంది. ఇప్పుడు స్వేచ్ఛా జీవిని. నాకు హద్దులు లేవు. నేను విశ్వమానవుడిని’ అంటూ ప్రపంచ శ్రేయస్సు కోసం ముందుకు అడుగేస్తాడు. దేవుడి స్థానంలో మనిషిని కేంద్రంగా నిలిపినవాడు గౌతమ బుద్ధుడు. మానవుడి సుఖదుఃఖాలకు బాధ్యుడు మనిషే తప్ప మరెవరూ కాదని విశదీకరించి బోధించినవాడూ అతనే. కార్యకారణ సంబంధాలు వివరించి ప్రజలను హేతుబద్ధమైన ఆలోచనల వైపు మరల్చిన తొలి సామాజిక విప్లవకారుడు ఆయన. బుద్ధుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినా సిద్ధార్థుడి జీవితంలోని కొన్ని అద్భుతమైన ఘట్టాలను అక్షరీకరించిన ‘సత్యాన్వేషి’ (నాటకం) పుస్తకం పాఠకులను అంతర్ముఖులను చేస్తుంది.