ఇది నా చిన్ననాటి సాహసం గురించిన ముచ్చట. అప్పుడు మా ఇంటికి కొంతదూరంలో ఉన్న చిన్ననదిని చూడాలని నాకు గొప్ప కుతూహలంగా ఉండేది. ఓరోజు ఆ నదిని ఎలాగైనా చూడాలని నిశ్చయించుకున్నాను. అయితే, మా ఇంటికి… నదికి మధ్య ఓ పెద్దకొండ అడ్డుగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండిన ఆ కొండ వెనక నది ఒదిగిపోయింది. కంటికి కనిపించనప్పటికి కొండ అవతల నది ఉందని… అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. మరి తెలుసంటే నా కండ్లతో నదిని ప్రత్యక్షంగా అయితే ఎప్పుడూ చూడలేదు. మా ఊరివాళ్ల నుంచి నది గురించి, నదీ నీళ్లలో ఉన్న చేపల గురించి, అందులోని బండల గురించి వినడం మాత్రం జరిగింది! కానీ, ఆ నది నీళ్లను నా చేతితో తాకడం, దాని గురించి ప్రత్యక్షంగా అనుభూతి చెందడం మాత్రం తీరని కోరికగా మిగిలిపోయింది.
ఓరోజు నేను కొండకు ఎదురుగా ఉన్న ఓ గుట్టమీదున్న మా ఇంటి ముందు నిలబడి ఉన్నాను. నదిని గురించి కలగంటూ… లోయ మొత్తం ఓసారి కలియజూశాను. నా కాళ్లకు అప్పుడు బూట్లు లేవు. లేవంటే… నాకు బూట్లు కొనుక్కునే స్తోమత లేదని కాదు. ఆ సమయంలో మాత్రమే లేవని! పైగా, నాక్కూడా బూట్లు లేకుండానే తిరగడం ఇష్టం. ఎందుకంటే… వెచ్చని రాళ్లు, చల్లటి గడ్డిని అనుభూతి చెందడం నాకు మహాయిష్టం కాబట్టి. ఇక బూట్లు లేకపోవడం అనేది, వాటిని నా వెంట తీసుకువెళ్లడం అనే సమస్య నుంచి గట్టెక్కించింది.
అప్పుడు పదకొండు గంటల సమయం. మా అమ్మానాన్నలు బయటికి వెళ్లారు. సాయంత్రం వరకు వాళ్లు ఇంటికి రారనే సంగతి నాకు ముందే తెలుసు. దాంతో నేను నదిని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడటానికి సిద్ధమయ్యాను. తినడానికి వెంట తీసుకెళ్లడానికి ఇంట్లో వెతకగా ఓ రొట్టె కనిపించింది. ఇక దారిలో ఏవైనా పండ్లు తప్పకుండా దొరుకుతాయి. మొత్తానికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమయం ఆరోజు చిక్కిందన్నమాట. ఎందుకంటే మా అమ్మానాన్నలు ఇద్దరూ కలిసి వాళ్ల దోస్తుల ఇంటికి ఒకేసారి వెళ్లడం ఎప్పుడోగాని జరగని పని. నదిని చూసి చీకటి పడకముందే ఇంటికి రాగలిగితే, నేను ఎక్కడికి వెళ్లిందీ వారికి తెలిసే అవకాశమే లేదు. అనుకున్నదే తడవుగా, నేను రొట్టెను పేపర్లో చుట్టుకున్నాను. తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి బయటపడ్డాను.
నదికి వెళ్లే దారి వాలుగా లోయలోకి వెళ్తుంది. తర్వాత మళ్లీ ఎగువకు వెళ్లి ఎదురుగా ఉన్న కొండ చుట్టూ తిరుగుతుంది. దానిని ఊరివాళ్లు, కట్టెలు కొట్టేవాళ్లు, పాలవాళ్లు, గొర్రెలకాపర్లు, కంచర గాడిదల యజమానులు తరచుగా ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే కొండకు ఆవల, నదికి దగ్గరగా ఊళ్లు మాత్రం లేవు. ఈ సంగతి కూడా నాకు గుర్తు. నడుస్తూ ఉండగా నాకు ఓ కట్టెలు కొట్టే అతను ఎదురుపడ్డాడు. ఆయనను నది ఎంత దూరం ఉందని అడిగాను. అతను పొట్టిగా, బలంగా, డబ్బా ముఖంతో గుత్తులుగా పొడుచుకు వచ్చిన కరకైన కండరాలతో ఉన్నాడు. ‘ఏడు మైళ్లు’ అన్నాడు. మళ్లీ తనే ‘ఎందుకు?’ అని అడిగాడు. నేనే మాత్రం తడుముకోకుండా ‘నదిని చూడాలని బయల్దేరాను’ అని చెప్పాను. ‘ఒక్కడివేనా?’… ‘ఆ… ఒక్కణ్నే’… ‘నదిని చేరాలంటే మూడు గంటలకుపైగా పడుతుంది మరి. మళ్లీ వెనక్కి రావాలి. చీకటి పడొచ్చు. పైగా అదంత సులువైన బాట కూడా కాదు’ అని హెచ్చరికగా వివరించాడు.
‘కానీ.. నేను వేగంగా నడవగలను’ అనైతే అన్నాను కానీ, అప్పటివరకు నేనెప్పుడూ కూడా మా ఇల్లు, బడి మధ్య ఉన్న రెండు మైళ్ల దూరానికి మించి నడవలేదు. కట్టెలు కొట్టే అతణ్ని దాటుకుని, గుట్ట దిగువకు నడవడం కొనసాగించాను. అది చుట్టూ తిరుగుతూ, మలుపులతో ఉన్న బాట. పైగా వేగంగా నడుస్తున్న క్రమంలో నేను ఒకట్రెండు సార్లు జారిపడ్డాను. పక్కనే ఉన్న పొదల్లోకి తూలిపడ్డాను. ఇంకా నున్నగా ఉన్న పైన్ చెట్ల ముళ్ల వాలులోకి పడిపోయాను కూడా. మా ఇల్లు ఉన్న గుట్ట అంతా కూడా దట్టమైన పచ్చటి ఫెర్న్ చెట్లతో నిండి ఉంది. ఆ చెట్లన్నీ రకరకాల తీగలలో చిక్కుకుపోయి ఉన్నాయి. అప్పుడప్పుడూ ఆకులు, ఫెర్న్ల చాటునుంచి బంగారు రంగులో ఉన్న అడవి డాలియా పూలు తలలెత్తి తొంగి చూస్తున్నాయి.
ఆ వెంటనే నేను లోయలో ఉన్నాను. దారి కూడా తిన్నగా ఎదురుగా ఉన్న పెద్దకొండ ఎగువకు వెళ్లడం మొదలుపెట్టింది. ఇంతలో ఓ అమ్మాయి ఎదురుగా వస్తుండటం నేను గమనించాను. ఆమె చేతిలో గడ్డి కోయడానికి ఓ కొడవలి ఉంది. ఆమె ముక్కుకు, చెవులకు రింగులు ఉన్నాయి. చేతులను బరువైన గాజులు కప్పి ఉన్నాయి. ఆమె మణికట్టును సుతారంగా కదుపుతూ ఉంటే గాజులు సంగీతం పలికిస్తున్నాయి. ఆ దృశ్యం ఆమె చేతులే మనతో మాట్లాడుతున్నాయా అనిపించేలా ఉంది. ‘నదిని చేరుకోవడానికి ఎంత దూరం నడవాలి?’ నేను ఆ అమ్మాయిని అడిగాను. అయితే, ఆమె బహుశా నదిని ఎప్పుడూ చూడలేదేమో! లేదంటే వేరే నది గురించి ఆలోచించిందో ఏమో, ఏమాత్రం తడుముకోకుండా, ‘ఇరవై మైళ్లు’ అని చెప్పింది. నేను నవ్వుకున్నాను. ఆ మాటలు పట్టించుకోకుండా బాట వెంబడి ఉరకడం మొదలుపెట్టాను. ఇంతలో ఒక చిలుక ఎక్కణ్నుంచో అకస్మాత్తుగా కిచకిచ అరిచింది. నీలం ఆకుపచ్చ మెరుపుతో నా తలమీదుగా తక్కువ ఎత్తులో ఎగిరింది. అది కూడా బాటవెంట నాతోపాటే కొంతదూరం వచ్చింది. నేను కూడా గాలిలో గంతులతో కూడిన దాని ఎగరడాన్ని అనుకరించాను. అలా బాట ఎత్తుకు వెళ్లేవరకు దానిని అనుసరిస్తూ ఉరికాను. ఆ చిలుక చెట్ల మధ్య మాయమైపోయింది.
ఇంతలో కొండవాలుగా నీళ్లు జాలు చప్పుడు వినిపించింది. దాహంగా ఉండటంతో నీళ్లు తాగడానికి అక్కడ ఆగాను. చల్లగా, శరీరాన్ని కోసేంత పదునుగా ఉన్నప్పటికీ ఆ నీళ్లు నాలో తాజాదనాన్ని నింపాయి. మళ్లీ నడక సాగించాను. ఎండగా ఉండటంతో కాసేపట్లోనే నాకు మళ్లీ దాహం వేసింది. మిట్టమధ్యాహ్నం దాటింది. సూర్యుడు కొండ ఆవలి వైపు దిగడానికి సిద్ధమవుతున్నాడు. ఇంకా దుమ్ముతో ఉన్న బాట కూడా వేడెక్కుతున్నది. బాటమీద ఉన్న చిన్నచిన్న రాళ్లు నా కాళ్లకు చురుకు పుట్టిస్తున్నాయి. మొత్తానికి నేను కనీసం సగం దూరమైనా నడిచి ఉంటానని నమ్మకంగా ఉంది. అప్పటికి నేను నడవబట్టి గంటకు పైగానే అయ్యింది.
ఎవరైనా కనిపిస్తారేమోనని కొండ మీదికీ కిందికీ చూశాను. కనుచూపుమేరలో ఇంకెవ్వరూ నాకు కనిపించలేదు. ఇక నేను బయల్దేరిన మా ఇల్లు కూడా కొండకు ఆవలివైపు వెళ్లిపోయింది. చూడాల్సిన నది
జాడ కూడా కనిపించడం లేదు. నాలో నిరుత్సాహం మొదలైంది. నాకు తోడుగా ఎవరైనా ఉండి ఉంటే, నా పరిస్థితి అలా ఉండకపోయేది. కానీ నేను ఒక్కణ్ని. నాకు నీరసం ఆవహించింది.
ఇంతలో కొండపైకి చూశాను. నాకు మీదుగా ఒక అబ్బాయి మేకలను తోలుకుని కిందికి వస్తున్నాడు. ‘నది ఎంత దూరం?’ అని అతణ్ని అడిగాను. ఆ అబ్బాయి నవ్వుతూ… ‘ఓ ఎంతో దూరం లేదు. కనిపించే కొండ చుట్టేసి, కిందికి దిగితే సరి’ అన్నాడు. ఆకలిగా ఉండటంతో, రొట్టెను కప్పిన పేపర్ విప్పేశాను. దానిని రెండుగా చేశాను. సగం ఆ అబ్బాయికి ఇచ్చాను. కొండవారగా కూర్చుని ఇద్దరం మౌనంగా రొట్టెను తిన్నాం. ఆ తర్వాత మేం కలిసి నడుస్తూ మాట్లాడటం మొదలుపెట్టాం. మాట్లాడుతూనే ఉన్నాం. మాటల్లోపడి సూర్యుడి వేడిని గానీ, ఎండకు నా పాదాలు కందిపోవడం గానీ, అప్పటివరకు నడిచిన దూరం గానీ, ఇంకా నడవాల్సిన దూరం గురించి గానీ స్పృహే లేకపోయింది. ఇంతలో మేకలు కాసే నా సహచరుడు మరో దారిన వెళ్లిపోయాడు. నేను మరోమారు ఒంటరినయ్యాను.
ఎవరైనా కనిపిస్తారేమోనని కొండ మీదికీ కిందికీ చూశాను. కనుచూపుమేరలో ఇంకెవ్వరూ నాకు కనిపించలేదు. ఇక నేను బయల్దేరిన మా ఇల్లు కూడా కొండకు ఆవలివైపు వెళ్లిపోయింది. చూడాల్సిన నది జాడ కూడా కనిపించడం లేదు. నాలో నిరుత్సాహం మొదలైంది. నాకు తోడుగా ఎవరైనా ఉండి ఉంటే, నా పరిస్థితి అలా ఉండకపోయేది. కానీ నేను ఒక్కణ్ని. నాకు నీరసం ఆవహించింది. ఏకాకినయ్యాననే స్పృహ కూడా మనసును తొలిచివేస్తున్నది.
అయితే, నేను సగానికంటే ఎక్కువ దూరమే వచ్చాననడంలో సందేహం లేదు. అందుకని నేను ఇక వెనక్కి వెళ్లాలని మాత్రం అనుకోలేదు. నదిని కచ్చితంగా చూసి తీరాల్సిందే అని నిశ్చయించుకున్నాను. ఆ ప్రయత్నంలో విఫలమైతే అది తర్వాత కాలంలో నేను సిగ్గుపడాల్సిన అనుభవంగా మిగిలిపోతుంది. కాబట్టి అడుగులు వడివడిగా ముందుకే వేశాను. వేడిగా, దుమ్ముతో, రాళ్లూరప్పలతో ఉన్న బాట గుండా గుడిసెలు, కొండవాలుల్లో అంతస్తులుగా ఉన్న పొలాలను వెనక్కి నెట్టుకుంటూ… ఇక పొలాలు, గుడిసెలు ఏ మాత్రమూ లేని, కేవలం అడవి, సూర్యుడు, ఒంటరితనం మాత్రమే ఉన్నచోటుకు నడుస్తూ ఉన్నాను. అక్కడ మనిషనే వాడే కనిపించలేదు. అసలు మనిషి ఉనికి పడిన జాడలే లేవు. కేవలం చెట్లూ చేమలూ, రాళ్లు, గడ్డి, చిన్నచిన్న పువ్వులు ఇంకా నిశ్శబ్దం…
ఆ నిశ్శబ్దం కూడా మనసుకు హత్తుకునేలా ఉంది. భయం గొల్పేదిగా కూడా! అక్కడ నా పాదాల కింద వంగిపోతున్న గడ్డి పరకలు, వినీలాకాశానికేసి చక్కర్లు కొడుతున్న ఓ గద్ద మినహా ఎలాంటి కదలికలూ లేవు. ఇంతలో, నేను ఓ భీకరమైన మలుపు తిరిగాను. గలగలలతో నీటి సవ్వడి వినిపించింది. ఆశ్చర్యచకితుణ్ని అయిపోయాను. ఆనందంలో మునిగిపోయాను. ఆ సంబరంలో కొండ దిగువకు జారాను, గంతులు గెంతాను. అలా, మంచు అంత చల్లగా ఉన్న ఆ నదిలో దూకేవరకు ఉరుకుతూనే ఉన్నాను.
నీళ్లు నీలంగా, తెల్లగా, అద్భుతంగా…
– రస్కిన్ బాండ్ ‘హౌ ఫార్ ఈజ్ ద రివర్’కు తెలుగు అనువాదం రెయిన్ ఇన్ ద మౌంటెయిన్స్ నుంచి