జీవితంలో ఓడిపోతే.. ఎవరేంటో తెలుస్తుంది. నువ్వేంటో అర్థమవుతుంది. ప్రపంచం ఏమిటో తెలిసొస్తుంది. విజయం అనే పదార్థానికి ఓటమి కొత్త రుచిని అందిస్తుంది. ప్రతీ ఎదురుదెబ్బ.. మళ్లీ పుంజుకోవడానికి అవసరమైన అవకాశాన్ని ఇస్తుంది. అంతకుముందుతో పోలిస్తే గొప్పగా నిలవడానికి దోహదం చేస్తుంది. ఓటమి ఎరుగని వ్యక్తితో పోలిస్తే.. వైఫల్యాలతో పడిలేచిన మనిషే దృఢంగా ఉంటాడు. అందుకే ఓటములకు బెంబేలెత్తిపోకండి. పరాజయాలను గుండెకు హత్తుకోండి. ఫెయిల్యూర్ నేర్పిన పాఠం ఒంటబట్టించుకుంటే.. జీవన సమరంలో అంతిమ విజేత మీరే!
‘విజయం వరించినప్పుడు సంబురాలు చేసుకోవడం మంచిదే! కానీ, ఓటమి పాఠాలు నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం’ అంటాడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, వితరణశీలి బిల్ గేట్స్. విజయవంతైన ఏ వ్యక్తి కథయినా సాదాసీదాగా సాగిపోదు. అందులో వాళ్లు ఎదుర్కొన్న అవమానాలు, గాయాలు, కష్టాలు, వేదన, మానసికంగా నలిగిపోవటాలు.. ఇలా ఎన్నెన్నో అనుభవాలు కనిపిస్తాయి. జీవితంలో ఎదురైన పరాజయాలే తమకు అద్భుతమైన తెలివితేటలు నేర్పాయనీ, తర్వాత ప్రయాణంలో తారసపడిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తియుక్తులు ఇచ్చాయనీ విజేతల మాట! ఉలి దెబ్బలు ఓర్చుకున్న శిల.. అందమైన శిల్పంగా మారినట్టు, ఓటమి నేర్పిన పాఠాలు.. మనిషిని ఉన్నతుడిగా, అజేయుడిగా నిలబెడతాయన్నమాట! ఏదో ఒక రూపంలో ప్రతిఘటన ఎదురుకాకపోతే.. జీవితంలో మజా రాదు. ఎన్నో కోతలకు గురైతే గానీ వజ్రం విలువ పెరగదు! తీవ్రమైన యాతనలు ఎదురైనా తట్టుకున్నప్పుడే మన విలువ అపరిమితంగా పెరుగుతున్నది సత్యం.
పరీక్షల్లో తక్కువ గ్రేడ్ రావడం, పరీక్ష తప్పటం, ఇంటర్వ్యూకి పిలుపు రాకపోవడం, వచ్చినా ఉద్యోగం పొందలేకపోవడం, వృత్తివ్యాపారాల్లో ఎదురీతలు, కష్టానికి తగిన ప్రతిఫలం పొందకపోవడం, జీవితంలో అగచాట్లు.. ఇవన్నీ వైఫల్యాలు అనుకోవచ్చు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో సీటు రావడం, క్యాంపస్ ప్లేస్మెంట్లో భారీ వేతనంతో ఉద్యోగం పొందడం, కెరీర్లో ఊహించనంతగా ఎదగడం, సవాళ్లు ఎదురైనా మీ నిజాయతీని కాపాడుకోవడం, కీర్తి ప్రతిష్ఠలు పొందడం, అందరి ఆదరాభిమానాలు సంపాదించడం, మరిన్ని అవకాశాలను అందుకోవడం ఇవన్నీ గెలుపుబాటలో మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు.
వైఫల్యం వచ్చినంత మాత్రాన జీవితం ముగిసినట్టుకాదు. ఒక్క విజయంతో అన్నీ సాధించానని అనుకోవడం ఎలా తప్పో.. ఒక్క అపజయంతో అన్నీ కోల్పోయానని కుంగిపోవడమూ సమంజసం కాదు. అయితే ఓటమి మొదట నిరాశకు గురిచేస్తుంది. అయినవారు కూడా చులకనగా చూస్తారన్న భావన కలిగిస్తుంది. ఆ ఆవేదనలోనే కూరుకుపోతే బతుకు పరుగు అక్కడితో ఆగిపోతుంది. లోతుగా ఆలోచిస్తే.. ప్రతి ఓటమీ ఓ అద్భుతమైన పాఠం చెబుతుంది. మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది.
పరిస్థితులను అవలోకనం చేసుకోమని బోధ చేస్తుంది. అందుకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలని హెచ్చరిస్తుంది. ఉదాహరణకు ఒకసారి బ్రేక్ దెబ్బతిని బైక్ పైనుంచి పడిపోయామని అనుకోండి. ఆ తర్వాత నుంచి బైక్ ఎక్కిన ప్రతిసారీ.. బ్రేకులు సరిగ్గా పడుతున్నాయో లేదో చెక్ చేసుకోవడం అలవాటుగా మారుతుంది. ఇంటి గుమ్మానికి తల కొట్టుకుంటే, ఇకపై జాగ్రత్తగా నడవాలని గ్రహిస్తాం. గుమ్మం దాటిన ప్రతిసారీ.. తెలియకుండానే తలొంచుకుంటాం. ఓటమి నేర్పిన పాఠమే కదా ఇది. అయితే వాటిని గుర్తించి, అందుకు తగ్గట్టుగా నడుచుకుంటేనే ఓటమి మనల్ని గెలుపు తీరాలకు చేరువ చేస్తుంది. లేకపోతే.. జీవితంలో ముందుకు వెళ్లడం అసాధ్యమవుతుంది.
ఓ వ్యక్తి పిండి వ్యాపారం చేసేవాడు. అందులో రాణించలేకపోయాడు. పశ్చిమ గాలులు విపరీతంగా వీయడం వల్ల పిండి గాలికి ఎగిరిపోయేది. మరోవైపు ఉప్పు వ్యాపారం చేసే వ్యక్తి లాభాలు గడించాడు. ఈ విషయం తెలిసిన మొదటి వ్యక్తి మనసు మార్చుకుని తనూ ఉప్పు వ్యాపారం చేద్దామనుకున్నాడు. ఉత్సాహంగా రంగంలోకి దిగాడు. అప్పటికి వర్షకాలం రావటంతో వానకు మొత్తం ఉప్పు కరిగిపోయి వ్యాపారంలో నష్టం వచ్చింది. పనిని ఎంచుకోవటంలో లోపమే ఇక్కడ వైఫల్యానికి కారణం.
ఆఫ్రికాలో తమకు మార్కెట్ ఉంటుందో, లేదో తెలుసుకోవాలని ఓ సంస్థ ఇద్దరు సేల్స్మెన్లను అక్కడికి పంపింది. ఒకరు తూర్పు తీరానికీ, మరొకరు పశ్చిమ తీరానికీ వెళ్లారు. ఇద్దరూ ప్రాథమికంగా సర్వే చేసి తమ నివేదికలను సంస్థ యజమానికి పంపారు. ‘ఇక్కడ ఒక్కరు కూడా షూ ధరించటం లేదు. ఇక్కడ అసలు మార్కెట్టే లేదు’ అని మొదటి వ్యక్తి తన సర్వే సారాంశాన్ని పేర్కొన్నాడు.
రెండో వ్యక్తి అందుకు భిన్నంగా ‘ఇక్కడ షూ ధరించే వ్యక్తులు ఎవరూ లేరు. మనకు మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. వెంటనే ఇన్వెంటరీ పంపండి’ అన్నాడు. మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి పరిస్థితులు ఉంటాయి! ఇద్దరిలో ఒకరు ఇక్కడ పరిస్థితులు మార్చలేమని భావిస్తే, మరొకరు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించాడు. గెలుపు, ఓటమి సహజం అనే వైఖరి ఉన్నవాళ్లు మొదటి రకం సాధారణ మనుషులు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకూలతను దర్శించగలిగిన వాడు రెండో వ్యక్తి తరహా మనిషన్నమాట!
‘వైఫల్యం అంటే నేర్చుకోవడంలో తొలి ప్రయత్నం’ అంటారు ఏపీజే అబ్దుల్ కలాం. ఓడిపోతామన్న భయం మనిషిని గెలుపునకు దూరం చేస్తుంది. అదే ఓటమిని స్వీకరించగల నైతిక ైస్థెర్యం ఉంటే.. గెలుపు బావుటా ఎగురవేయడం పెద్ద కష్టమేం కాదనిపిస్తుంది.
ఓటమి పాలైనప్పుడు ఎవరిని వాళ్లు నిందించుకుంటారు. ఇంట్లోవాళ్లు సరేసరి. కానీ, మీ అంతర్గత శత్రువులను జయించండి. సంకోచం, అనుమానం, ఆత్మన్యూనతా భావం, సెల్ఫ్ పిటీ అనేవి నాలుగు అంతర్ శత్రువులు. అవి లోపల నుంచి దాడి చేసి మిమ్మల్ని ఎదగనివ్వవు. ఆత్మవిశ్వాసంతో సంకోచాన్ని జయించండి. పరిపూర్ణ విశ్వాసంతో అనుమానాన్ని అధిగమించండి. సమతౌల్యంతో ఆత్మన్యూనతను ఎదుర్కోండి. స్వీయ క్రమశిక్షణతో సెల్ఫ్ పిటీని తరిమికొట్టండి. అన్నిటినీ మించి గతంలో ఉండిపోవద్దు. భవిష్యత్తులో విహరించొద్దు. వర్తమానంలో జీవించాలి. గతంలో ఎదురైన చేదు అనుభవాలు మన ఉత్సాహాన్ని చంపేస్తాయి.
అలాగే భవిష్యత్తు పట్ల భయం అవరోధాలను ఎదుర్కొనే అవకాశాన్ని అడ్డుకుంటుంది. ఎవరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్లు సత్ఫలితాలను సాధించగలుగుతారు. స్ఫూర్తినిచ్చే వ్యక్తుల కథలు చదవడం వల్ల ఉత్సాహం పొందొచ్చు. అలాగని విజయగాథలు చదువుతూ.. వాళ్లు సాధించిన దానికి మనం రొమ్ము విరుచుకోవాల్సిన పనిలేదు. ఓడిపోయిన వ్యక్తుల కథలు చదివితేనే.. ఓటమి తత్వం బోధపడుతుంది. విజేతల గాథలు సందేశాన్నిస్తాయి. ఓటమిపాలైన వ్యక్తుల కథలు గెలవడానికి కొత్త మార్గాలను నిర్దేశిస్తాయి. చివరిగా, పరాజయం అంటే ప్రయత్నించటంలో విఫలం కావటం. అంతే తప్ప అసలు ప్రయత్నించకపోవటం కాదు. ఈ సత్యాన్ని గ్రహించి మీ అదృష్టాన్ని మీరే పునర్ లిఖించుకోండి.
మీరెప్పుడైనా చీమల కదలికలను గమనించారా? వాటికి అంతరాయం కలిగించి చూడండి. అవి పక్కకు తొలిగి ముందుకు వెళ్లాటానికి ప్రయత్నిస్తాయే తప్ప ప్రయాణం ఆపవు. చీమలబారుకు అడ్డంగా ఓ చిన్నకర్రను అడ్డుపెడితే.. చీమలు తమ మార్గాన్ని మార్చుకొని కుడివైపు వెళ్తాయి. మరో కర్ర అడ్డం పెడితే.. అవి మళ్లీ కుడివైపు మళ్లుతాయి. ఇంకోసారి అడ్డుకోవటానికి ప్రయత్నించినప్పుడు వాటికి అర్థమైపోతుంది. ఈసారి అవి అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. అవి ఏ వైపూ తిరగకుండా.. కర్రపైకి ఎక్కి ప్రయాణించడం మొదలుపెడతాయి. వాన వచ్చినప్పుడు పక్షులు ఆశ్రయం కోసం చూస్తే, గద్దలు మేఘాలను దాటి పైకి ఎగురుతాయి. ఓటములు ఎదుర్కోవాలే కానీ, వాటి నుంచి పారిపోవద్దు. ఓటమిని ఢీ కొడితే.. విజయం తథ్యం.
ప్రసిద్ధ టెన్నిస్ ఆటగాడు ఆర్థర్ యాష్‌కు 1983లో గుండె సర్జరీ జరిగింది. ఆ సందర్భంగా అతనికి అందించిన రక్తం ఇన్ఫెక్షన్ కావడంతో ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి సోకింది. అతను మరణానికి చేరువయ్యాడు. అభిమానులకు గుండె పగిలినంత పనైంది. ‘ఇంత దరిద్రమైన వ్యాధి మీకే రావాలా? భగవంతుడు మిమ్మల్నే ఎందుకు ఎంచుకున్నాడు?’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఎందుకు ఎంచుకోకూడదు?’ అని వాళ్లను తిరిగి ప్రశ్నించాడు ఆర్థర్.
‘ప్రపంచ వ్యాప్తంగా 5,00,00,000 చిన్నారులు టెన్నిస్ ఆడాలని కోరుకుంటున్నారు. 50,00,000 మంది టెన్నిస్ నేర్చుకుంటున్నారు. 5,00,000 వృత్తిపరమైన శిక్షణ పొందుతున్నారు. 50,000 మంది సర్క్యూట్‌కి వస్తారు. 5,000 మంది తర్వాతి దశకు చేరుకుంటారు. అందులో వడపోత తర్వాత 500 మంది మిగులుతారు. 50 మంది గ్రాండ్శ్లామ్కి చేరతారు. నలుగురు సెమీఫైనల్ దాకా వెళతారు. ఫైనల్‌కి ఇద్దరు చేరతారు.
ఒకే ఒక్కరు గెలుస్తారు. నేను విజేతగా కప్పు అందుకున్నప్పుడు… ‘నేనే ఎందుకు?’ అని దేవుణ్ని ప్రశ్నించలేదు. అప్పుడు ‘నేనే ఎందుకు?’ అని అడగనప్పుడు.. ఇప్పుడు ‘నాకే ఎందుకు ?’ అని అడగటం న్యాయమా? అన్నాడు ఆర్థర్. ఇది నిజంగా ఆలోచించవలసిన అంశం. చిన్న చిన్న ఓటములకే కుంగిపోయి ఆత్మహత్యలకు సిద్ధపడుతున్న వారు ఈ టెన్నిస్ స్టార్ నుంచి ఎంతో నేర్చుకోవాలి. జీవితంలో పరిస్థితులు సానుకూలంగా లేవని ఆవేదనకు గురయ్యే ప్రతి ఒక్కరికీ ఆర్థర్ ఆదర్శం.
నేడు మనం విజేతలని ఆరాధిస్తున్న ఎందరో తొలిరోజుల్లో పరాజయం చవిచూసిన వాళ్లే. వారిలో క్రీడాకారులు, రాజకీయ ఉద్ధండులు, వ్యాపారవేత్తలు, కవులు, కళాకారులు ఎందరో కనిపిస్తారు. వాళ్లు కోరుకున్న ఫలితాలు రాకపోయినా, ‘నీ వల్ల కాద’ని ఇతరులు వెనక్కి లాగినా.. రాజీపడలేదు. చిన్నచిన్న ఓటములకు కుంగిపోలేదు. మళ్లీ మళ్లీ శక్తి కూడదీసుకొని లంఘించారు. ఓటమిని జయించి.. గెలుపు శిఖరాలను అధిరోహించారు. చరిత్ర పుటలను తిరగేస్తే.. అలాంటి వారెందరో కనిపిస్తారు. వారిలో కొందరిని ఇక్కడ ప్రస్తావించుకుందాం..
ఆపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్‌ను 1985లో ఆ సంస్థ నుంచి బయటికి పంపారు. 1990లో ఆ సంస్థ దాదాపు దివాళా తీసే స్థితికి చేరుకుంది. మళ్లీ 1997లో స్టీవ్ ఆపిల్ సీఈవోగా మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. తరవాతి సంగతి మనకు తెలిసిందే!
వాల్ట్ డిస్నీలో సృజనాత్మకత, ఊహాబలం తక్కువని పేర్కొంటూ ‘సిటీ స్టార్’ అనే ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి అతణ్ని తొలగించారు. దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్‌కూ చేదు అనుభవాలు లేకపోలేదు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు అనుబంధంగా ఉన్న స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ స్పీల్‌బర్గ్‌ని మూడుసార్లు తిరస్కరించింది. నాలుగో ప్రయత్నంలో అతనికి ప్రవేశం లభించింది. వాల్ట్ డిస్నీ, స్పీల్ బర్గ్ ఎంతటి సృజనాత్మకత కలిగిన వ్యక్తులో ప్రపంచమంతా తెలిసింది కదా!
హైస్కూల్లో ఉండగా మైఖెల్ జోర్డాన్‌ను బాస్కెట్ బాల్ ఆటకు పనికిరాడని టీమ్ నుంచి బయటికి పంపారు. కానీ, అతను ఆ క్రీడలో ప్రపంచ ప్రఖ్యాత చాంపియన్‌గా నిలిచాడు.
ఎగిరే యంత్రాన్ని కనుగొనడం అసాధ్యమని రైట్ సోదరులను ఎందరో చులకనగా చూశారు. ఆ మాటలకు వాళ్లు కుంగిపోయి ఉంటే.. విమానం ఆవిష్కరణ ఎప్పటికి జరిగి ఉండేదో!
ప్రఖ్యాత నవలా రచయిత స్టీఫెన్కింగ్ మొదటి నవల ‘కేరీ’ని దాదాపు 30 మంది ప్రచురణకర్తలు బాగాలేదంటూ వెనక్కి పంపారట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాపీలు అమ్ముడైన నవలల్లో ఒకటిగా కీర్తి మూటగట్టుకున్న ‘హారీపాటర్’ నావెల్‌ను మొదట 12 మంది పబ్లిషర్స్ ‘ఛీ’ కొట్టారట.
అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు కాకముందు ఎన్నో వైఫల్యాలను చవిచూశాడు.
ఐన్‌స్టీన్‌కు చదువు రాదని బడి నుంచి బయటికి పంపారు. తర్వాత రోజుల్లో కూడా అనేక యూనివర్సిటీలు ఆయనకు ప్రవేశం ఇవ్వలేదు.
థామస్ ఎడిసన్ బల్బును కనుగొనడానికి ముందు వెయ్యి వైఫల్యాలను చవిచూశాడు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీకి పోలాండ్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకలేదు. దీంతో ఆమె ఫ్రాన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది.
ఇలా తరచి చూస్తే.. ఎందరో వ్యక్తులు శక్తులుగా ఎదగడానికి ముందు పతనం లోతులు చూసిన వాళ్లే అని తెలుస్తుంది. పాతాళానికి పడిపోయామని వాళ్లు కుంగిపోయి ఉంటే.. చరిత్రలో వాళ్ల ప్రస్తావన ఉండేది కదా కదా!
ఓడిపోయారంటే మీరు సాధించలేరని కాదు.గెలుపు కోసం మరింత ప్రయత్నించాలని అర్థం.
అపజయం పొందారంటే మీకు అవకాశం తప్పిపోయినట్టు కాదు. మీకు రెక్కలు ఎగరటానికి సిద్ధమవుతున్నాయని భావించాలి.
ఫెయిల్యూర్ అంటే మీకేదీ మిగలలేదని కాదు.కొత్తదారులలోకి మీరు అడుగుపెట్టవలసిన సమయం వచ్చిందని తెలుసుకోండి. పట్టుదల, ఏకాగ్రతతో ముందుకు వెళ్లండి.
– డా॥ పార్థసారథి చిరువోలు