బొజ్జగణపయ్య బుజ్జి రూపం చిన్నా పెద్దా, ఆడామగా అందరికీ ఇష్టమే. తొలి పూజలు అందుకునే ఇలవేలుపే అయినా, ఆయనెప్పుడూ గంభీరంగా కనిపించడు. చిన్ని కృష్ణుడి చిన్నెలన్నీ ఆ ముద్దు మొహంలో మురిపిస్తాయి. ఇంకేం, అందరూ దోస్తులే. చుట్టూ చుట్టాలే. నా దగ్గరికి రా అంటే, నా దగ్గరికి రా అంటూ ప్రేమగా పిలిచేవారే. గణపతి బప్పా మోరియా అంటూ జై కొట్టేవారే! ఆ ప్రేమతోనే… ఇష్టమైన వారి పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నట్టు… చొక్కాల మీదా, డ్రెస్సుల మీదా వినాయకుడి బొమ్మను ముచ్చటగా ముద్దరేసుకుంటున్నారు. నగల్లోనూ ఆయన్నే ఆవాహన చేసుకుంటున్నారు.
వినాయక చవితి సంప్రదాయ పండుగ అనేకన్నా… సరదాల పండుగ అంటే ఇంకా నప్పుతుంది. ఊరూవాడా పందిళ్లు, డప్పుల చప్పుళ్లు, ఊరేగింపుల సందళ్లు, వసంతాల వాకిళ్లు… అన్నీ ఈ పండుగ సొత్తే. బొమ్మ తీసుకురావడం, పత్రి కోయడం, మంటపం అలంకరించడం, పుస్తకాలు పూజలో పెట్టడం… ఇలా ఇందులోని పనులన్నీ పెద్దవాళ్లతో పాటు చిన్నవాళ్లనూ భాగస్వాముల్ని చేస్తాయి. అందుకే వినాయక చవితి… అందరి పండుగ. గణేశా ఫ్యాషన్ కూడా అందరిదీ. అంతటి ఫ్యాన్‌బేస్ ఉన్న ఆయన పుట్టిన రోజున ఇంక ట్రెండింగ్లోనూ ఆ ఫ్యాషనే ఉండటం ఆశ్చర్యమేముంది.
శుభకార్యం ఏదైనా గణపతే ముందు ఉన్నట్టు… ఏ ఫ్యాషన్లోనైనా ఆయనదే ముందంజ. ముఖ్యంగా నగల్లో అయితే లక్ష్మీదేవి రూపం తర్వాత అంతగా కనిపించేది గణపతిదే. ఇటీవల ఏకంగా కాసుల్లోనూ హేరంబుడు దర్శనమిస్తున్నాడు. కాసుల పేరు తరహా నగలను వినాయకుడి ముద్రలతో రూపొందిస్తున్నారు. నవరత్నాలు పొదిగిన నగల్లోనూ సలక్షణంగా ఇమిడిపోతున్నాడాయన. జుంకాలు, పాపిటబిళ్ల, హారం, నెక్లెస్, గాజులు…ఇలా నగలన్నిటి రాయల్టీ రైట్సూ తీసుకున్నాడు. మగవాళ్ల చొక్కాలు, ఆడవాళ్ల డ్రెస్సులు, పిల్లల దుస్తుల మీదా కూడా గౌరీ నందనుడి లీలా విలాసమే కనువిందు చేస్తున్నది. అందుకే ఫ్యాషన్ ప్రపంచం ఈ వినాయక చవితికి గణపతి బప్పా… ట్రెండయా అంటున్నది!