రచన: చతుర్వేదుల మురళీమోహన శాస్త్రి
పేజీలు: 334; వెల: రూ: 180
ప్రతులకు: రామకృష్ణ మఠం,
దోమలగూడ, హైదరాబాద్.
మతం-ఆధ్యాత్మికత-విజ్ఞానశాస్త్రం .. ఒకటి నమ్మకాలతో ముడిపడింది, మరొకటి అంతరాత్మతో అనుసంధానమైంది, ఇంకొకటి రుజువులే కీలకమైంది. ‘జీవుడే శివుడు’ పుస్తకంలో రచయిత మురళీమోహన శాస్త్రి ఈ మూడింటికీ చక్కని సమన్వయం చేశారు. అంతిమంగా అద్వైత తత్వాన్ని నిరూపించారు. ఇది పాతకొత్తల మేలు కలయిక. పాతలోని కొత్తనూ, కొత్తలోని పాతనూ ఒడుపుగా పట్టుకునే ప్రయత్నం. ప్రతి మనిషిలో భగవచ్ఛక్తి నిగూఢంగా ఉంటుందనే తత్వశాస్త్ర ప్రతిపాదనకు ప్రామాణికతను ప్రసాదించిన రచన. సిద్ధత్రయం.. శిరిడి సాయి, రమణులు, రామకృష్ణ పరమహంస బోధనలలోని సమకాలీనతను చర్చించారు. తత్వశాస్త్రం, ఆధునిక విజ్ఞానశాస్త్రం, సంస్కృతం.. ఈ మూడు అంశాలపై రచయితకు ఉన్న పట్టు ప్రతి పుటలో ప్రస్ఫుటం అవుతున్నది. ‘దేవుడు మనకు ఉత్ప్రేరకంగా కొంతదూరం వరకూ పనిచేస్తాడు. ఆధ్యాత్మిక ప్రగతికి సన్నాహాలన్నీ చేసి చివరికి తాను తప్పుకొంటాడు. దేవుడిని నమ్మనివారు కూడా నేనెవరిని? అన్న విచారణతో సాధన ప్రారంభించవచ్చు. చివరికి తేలే విషయం.. ఏ మతమూ, ఏ శాస్త్రవేత్తా ఊహించలేనంత అద్భుతంగా ఉంటుంది’ అంటూ శ్వేతాశ్వతర ఉపనిషత్తును ఉటంకిస్తూ చెప్పినమాట అక్షర సత్యం. ఇప్పటికీ శాస్త్రవేత్తలు సృష్టి రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో వేదాంతశాస్ర్తాన్నే ఆశ్రయిస్తున్నారని చెబుతారు రచయిత. దేవతామూర్తులు, సాలగ్రామాలు మొదలైన వాటిని సైన్స్ సింబల్స్‌తో పోలుస్తారు. వాటిని చూడగానే.. విష్ణు
లీలలూ, శివతత్వాలూ గుర్తుకొస్తాయని విశ్లేషిస్తారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను తూకం వేసినట్టు వివరించారు. ఆత్మ, అహం, అహంకారం.. మనసుతో, బుద్ధితో, ఆత్మతో, పరమాత్మతో ముడిపడిన ఏ కోణాన్నీ వదలకుండా చర్చించారు. ఏకాగ్రం చేసిన మనసుతో ఒకే విషయాన్ని నిరంతరం చింతించడమే తపస్సు.. అంటూ సాధకులకు స్పష్టతను ఇచ్చారు. ‘నేను’ అన్న ప్రశ్నకు జవాబు వెతుకుతున్న ప్రతి జిజ్ఞాసీ చదవాల్సిన పుస్తకం ఇది.
సంపాదకుడు: నారంశెట్టి
ఉమామహేశ్వరరావు
పేజీలు 96; వెల: రూ 70/-
ప్రతులకు: 94907 99203,
73864 08306
పిల్లల కోసం నారంశెట్టి ఉమామహేశ్వర రావు వెలువరించిన ఈ పుస్తకంలో 26 కథలు ఉన్నాయి. బాలల కోసం కథలు రాసే రచయితలకు పోటీపెట్టి వాటిలో ఉత్తమమైన వాటిని సంకలనంగా తీసుకొచ్చారు నారంశెట్టి. పిల్లల కథలు రాయడంలో అనుభవజ్ఞులైన రచయితలు కావడం వల్ల దాదాపుగా ప్రతి కథా బాగుంది. బి.వి.పట్నాయక్ – రాజుగారి ఏడు గదులు, గరిమెళ్ల నాగేశ్వరరావు – ఏ రోజు పాఠం ఆ రోజే, పి.వి. శేషారత్నం – గోరుముద్దలు లాంటివన్నీ మంచి కథలే. పిల్లల్ని ఆలోచింప చేసేవే. మంచి మార్గం వైపు నడిపించేవే. ఉయ్యూరు అనసూయ ‘గజరాజుకే పట్టం’ మంచి ముగింపుతో అలరించింది. సుజనా దేవి ‘కొండచిలువ’ బాలల్లో సాహసాన్ని, సమయస్ఫూర్తిని వెల్లడించింది. పుట్టినరోజు నాడు తమ బడికోసం తల్లిదండ్రులతో ఒక మంచిపని చేయించిన రాము కథ ‘నిర్ణయం’ స్ఫూర్తిదాయకం. రచయిత నంద త్రినాథరావుకు అభినందనలు. అలాగే నాదెళ్ళ అనూరాధ రాసిన కథ ‘కిచ్చు’ చాలా బాగుంది. సాధారణంగా పిల్లలు ఇలాంటి ఫాంటసీ కథలకు ఆకర్షితులవుతారు. ఈ కథలు మాత్రమే ప్రస్తావించాను అంటే మిగిలినవి బాగాలేవని కాదు.. కేవలం స్థలాభావం తప్ప! అన్ని కథలూ బాగున్నాయి. రచయితలకు అభినందనలు. ముఖ్యంగా నారంశెట్టి కృషి ఎంతగానో ప్రశంసించదగినది.
-చంద్రప్రతాప్ కంతేటి, 80081 43507
రచన: ఆర్సి కృష్ణస్వామి రాజు
పేజీలు: 128; వెల : రూ. 140/-
ప్రతులకు: రచయిత, ఫోన్: 93936 62821; ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
ఏ ప్రాంత మాండలికమైనా సురుచిర సుందరమే! ఎందుకంటే ’జీవద్భాష’ కాబట్టి! చిత్తూరు మాండలికంలో ఒక సొగసు ఉంది. ఆ ప్రాంతాల నేపథ్యంలో ఆ మాండలికంలో అందమైన కథలు వండి వడ్డించడం ఆర్సి కృష్ణస్వామి రాజు ప్రత్యేకత. ఇప్పటికే ‘రాణి గారి కథలు’, ‘మిక్చర్ పొట్లం’, ‘పకోడీ పొట్లం’ అంటూ ఎన్నో కమ్మని కథలు రాసి పాఠకుల్ని అలరించారు కృష్ణస్వామి రాజు. ఆ కోవలో తాజాగా వెలువడినదే ‘కిష్టడి కతలు’. ఏ కథ చదివినా పెదాలపై చిరునవ్వు తొణికిసలాడటం ఖాయం. ప్రతి కథలోనూ కిష్టడి బాల్య సంఘటనలు, ఆనాటి జనజీవితం, సామాజిక పరిస్థితులు కండ్లకు కట్టేలా రాశారు రచయిత. ఈ సంకలనంలో కొన్ని కొసమెరుపు కథలైతే, మరికొన్ని ఆసాంతం మెరుపులతో కూడినవి. ‘లెక్కలేయలేను తల్లో!’, ‘చీమా చీమా ఎక్కడికెళ్తావు?’,
‘బావిలో దూకేది బ్రహ్మవిద్యా?’, ‘దొంగ కోళ్ళు’, ‘ఊరి కట్టుబాటు’, ‘అత్తారింటికి నీలవేణి’.. ఇలా ఈ కథల శీర్షికలు చూస్తుంటేనే ఇవెంత రసవత్తరంగా స’రసం’గా ఉంటాయో ఇట్టే అర్థమైపోతుంది. చదువుకున్న వారికి చదువుకున్నంత హాస్య చందనం దొరుకుతుంది. మొత్తం 30 కథలున్న ఈ సంపుటిలో రచయిత శైలి గతంకంటే మరింత పదునెక్కింది.
-సీపీ