సంప్రదాయ కళల్లో చేనేతది ప్రత్యేక స్థానం. మనం కట్టుకునే వస్ర్తాల వెనుక నేతన్నల శ్రమ ఎంతగానో ఉంటుంది. ఆరు గజాల చీరను అగ్గిపేటలో పట్టించే తీరును చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి వినూత్న ఆలోచనలకు బీజం వేస్తూ.. జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకుంటున్నారు తెలంగాణ నేతన్నలు. ఈసారి ఆ అవకాశం 15 నెలలపాటు శ్రమించి ఇక్కత్ డిజైన్‌తో ఆరు గజాల పట్టు చీరను రూపొందించిన గంజి వెంకటేశ్‌కు లభించింది. జాతీయ చేనేత పురస్కారం-2025కు ఎంపికై ఇటీవల 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారాయన. తన శ్రమకు తగిన గుర్తింపు వచ్చిందంటున్న వెంకటేశ్ బతుకమ్మతో పంచుకున్న విశేషాలు, ఆయన మాటల్లోనే..
మాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్. నిరుపేద కుటుంబం మాది. మేము మొత్తం నలుగురం అన్నదమ్ములం. నేను రెండోవాణ్ని. అమ్మానాన్నలిద్దరూ నేత పనిచేసేవారు. నా చిన్నతనంలో తిండికి ఇబ్బంది లేకపోయినా మేము పెరిగేకొద్ది ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఒకానొక దశలో తిండికి లేక పస్తులున్న రోజులూ ఉన్నాయి. అమ్మానాన్నల కష్టం చూసిన నేను పదో తరగతి పూర్తికాగానే చదువుకు స్వస్తి పలికి మగ్గం పనిలోకి దిగాను. నన్ను చూసి నా తమ్ముళ్లిద్దరూ పనిచేయడం మొదలుపెట్టారు.
ఇక అప్పటి నుంచి అమ్మానాన్నల బరువు తగ్గిస్తూ 2003 వరకు ఉమ్మడిగా కలిసిమెలసి పనిచేస్తూ వచ్చాం. ఆ తర్వాత అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. ఎవరి సంసారం వారికైంది. నాకంటే పెద్దవాడు చనిపోయాడు. తమ్ముళ్లిద్దరూ పట్టుదారాల కంపెనీ పెట్టుకొని జీవిస్తున్నారు. నేను మాత్రం అమ్మానాన్నలు ఆస్తిగా ఇచ్చిన నేత పనినే చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నలభై ఏండ్లుగా ఇదొక్క పనే తెలిసిన నాకు మరే పని రాదు.
నేను మొదటి నుంచి టై అండ్ డై పని చేస్తుండేవాణ్ని. దారం తీసుకురావడం, దానికి రంగులద్దడం, డిజైన్లు దిద్దడం, ఆ దారాన్ని తీసుకువెళ్లి మగ్గంపై నేయించగా వచ్చిన చీరలను బయట విక్రయించడం నా వృత్తి. ఒక్క చిటికీ వేయడానికి పదిహేను రోజులు పడుతుంది. ఒక్క చిటికీతో మూడు చీరలు నేస్తారు. కరోనా అందరి జీవితాల్లో చీకట్లు మిగిల్చినట్లే మా నేతన్నల జీవితాలను కూడా నాశనం చేసింది. కరోనాకు ముందు చీరకు కావాల్సిన ముడిసరుకు ధరలు తక్కువకే లభించడం వల్ల మాకు సంతృప్తికర ఆదాయం వచ్చేది. ఆ వచ్చిన డబ్బుతో చీటీలు కడుతూ నెట్టుకొచ్చేవాణ్ని. అలా పొదుపు చేసిన సొమ్ముతోనే ఓ ఇల్లు కూడా కట్టుకున్నా. కరోనా తర్వాత ముడిసరుకు ధరలు విపరీతంగా పెరిగాయి, చీర ధర మాత్రం పెరగలేదు. దాంతో నేనే చిటికీల పనికి కూలీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంపాదన ఇంటిపోషణకే చాలదు. ఇక, పొదుపు మాటే మర్చిపోయాను.

నాకు 2017 నుంచే జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవాలనే కోరికుండేది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు 2020లో అందుకున్నప్పుడు ఆ కోరిక మరింత బలపడింది. అందుకోసం ఓ వినూత్నమైన చీరను నేసి 2024లో జాతీయ స్థాయి అవార్డుకు దరఖాస్తు చేసుకున్నాను. అది ఎంపిక కాలేదు. ఎన్నటికైనా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నేను ఆవిష్కరించిన ఈ వస్త్రం కోసం ఏకంగా పదిహేను నెలలపాటు కష్టపడ్డాను. డిజైన్ గీసేందుకే ఆరు నెలలు శ్రమించాను.
ఎలాంటి రసాయనాలు వాడకుండా టీ పొడి, కొత్తిమీర, పుదీన, కాచు, మంజిష్ఠ లాంటి సహజమైన పదార్థారాలతో రంగులు తయారుచేసి ఇక్కత్ డిజైన్ తీర్చిదిద్దాను. టై అండ్ డై పద్ధతిలో మల్బరీ పట్టుదారానికి 300 కొయ్యల చిటికీకీ రంగులద్ది, నెల రోజులపాటు మగ్గంపై ఒక్కో పోగును నేసి ప్రకృతి దృశ్యాన్ని చీరపై అవిష్కరించాను. ఆ ఆరు గజాల పట్టుచీరపై చేపలు, పక్షులు, నీటి గుర్రం, ప్రకృతి దృశ్యాలు, ఇండ్లు, మనుషులతో కూడిన బొమ్మలను ఆవిష్కరించాను. ఈ ఇక్కత్ డిజైన్ చేసిన తర్వాత నాలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. కచ్చితంగా ఈసారి అవార్డు అందుకుంటాననే నమ్మకంతో దరఖాస్తు చేసుకున్నాను. అదే నిజమైంది.
ఉరితాడుకు వేలాడుతున్న నేతన్నకు భరోసానిచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. నేతన్నలకు ప్రోత్సహకాలు అందించి మగ్గాన్ని నిలబెట్టిన నాయకుడు ఆయన. నా కొడుకు కూతురు ఉన్నత చదువులు చదువుతూనే మరోవైపు నా పనిలో సాయంగా ఉంటున్నారు. నా భార్య పద్మరేఖ నాతోపాటే పనిచేస్తుంది. ఆమె 2021లో రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నది. ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను గుర్తుచేసింది. మగ్గం గొప్పతనాన్ని రేపటి తరాలకు అందించడంలో నా వంతు కృషిచేయడమే నా ముందున్న కర్తవ్యం. ప్రభుత్వం అండగా ఉంటే.. మన నేతన్నలు అద్భుతాలు చేస్తారు అనడంలో సందేహం లేదు. భవిష్యత్తులో మనవాళ్లు జాతీయస్థాయి అవార్డులు ఎన్నో సాధించి.. మన రాష్ర్టానికి గుర్తింపు తేస్తారని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
– రాజు పిల్లనగోయిన