సంగీతాన్ని మరో లెవెల్లో ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం.. సామ్సంగ్ ఓ గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. ప్రీమియం డిజైన్, ఆధునిక సాంకేతికతతో Samsung Music Studio 7ను ఇటీవలే ఆవిష్కరించింది. ప్రసిద్ధ ఫ్రెంచ్ డిజైనర్ ఎర్వాన్ బౌరౌల్లెక్ భాగస్వామ్యంతో దీనిని రూపొందించింది. ఇది కేవలం ఒక స్పీకర్లా కాకుండా.. ఇంటిని అలకరించే ఒక కళాఖండంలానూ ఇంటీరియర్‌లో కలిసిపోతుంది. ఇందులో 3.1.1-చానెల్ ఇమ్మర్సివ్ ఆడియో టెక్నాలజీని వాడారు. ఫ్రంట్ లెఫ్ట్-రైట్-సెంటర్‌తోపాటు వూఫర్, పైకి కూడా సౌండ్ ప్రసారమయ్యే ట్యాప్-ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. ఇది 150W శక్తిమంతమైన అవుట్‌పుట్‌ను అందిస్తుంది. 3డీ-స్పేషియల్ ఆడియో ద్వారా Dolby Atmosతోపాటు
సామ్సంగ్ నూతన Eclipsa Audioను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఏఐ డైనమిక్ బేస్ కంట్రోల్ ద్వారా.. వూఫర్ వైబ్రేషన్ వల్ల వచ్చే డిస్టార్షన్‌ను నివారించి, స్పష్టమైన బేస్‌ను అందిస్తుంది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ సౌండ్ సిస్టమ్.. మీ గది పరిమాణాన్ని, ఆకృతిని విశ్లేషించి, దానికి తగినట్లుగా ఆడియోను ఆటోమేటిక్‌గా ట్యూన్ చేస్తుంది. మీరు చూసే కంటెంట్ (సినిమాలు, పాటలు, వార్తలు, స్పోర్ట్స్) ఆధారంగా సౌండ్ మోడ్‌ను మారుస్తుంది. అంతేకాదు.. గదిలో వచ్చే ఇతర శబ్దాలను గుర్తించి, డైలాగ్‌లు స్పష్టంగా వినిపించేలా వాయిస్‌ను పెంచుతుంది. ఇది స్టాండ్ అలోన్‌గా పనిచేయడమే కాదు.. ఇతర సామ్సంగ్ ఆడియో పరికరాలు/టీవీలతో కలిసి హోమ్ థియేటర్ లాంటి సెటప్గానూ మారిపోతుంది.
ధర: రూ. 49,900
దొరుకుచోటు: అమెజాన్

ఇప్పుడు చాలామంది స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీ చేస్తున్నారు. ప్రొఫెషన్ కెమెరాలకు తీసిపోకుండా.. ఫోన్‌తోనూ అద్భుతమైన ఫొటోలు తీస్తున్నారు. అలాంటి వారు తప్పకుండా వాడాల్సిన గ్యాడ్జెట్.. UltraProlink Snap-Z Grip. ఇది స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీని మరింత సులభతరం చేస్తుంది. ఫోన్‌కు ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ కెమెరాలాంటి సౌకర్యవంతమైన గ్రిప్, కంట్రోల్స్‌ను అందిస్తుంది. ముఖ్యంగా వ్లాగర్స్, కంటెంట్ క్రియేటర్లు, ట్రావెలర్స్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ సమయంపాటు ఫోన్ పట్టుకున్నా అలసట లేకుండా ఉండేలా థంబ్ రెస్ట్, ఫింగర్ హుక్స్ ఉంటాయి. దీనిలో జూమ్ ఇన్/ జూమ్ అవుట్ చేయడానికి, మోడ్ స్విచింగ్, షటర్ బటన్స్ ఉన్నాయి. వీటిని ఒకే
చేతితో కంట్రోల్ చేయవచ్చు. ఇందులో 10 మీటర్ల రేంజ్ వరకు పనిచేసే బ్లూటూత్ షటర్ ఉంది. ఇది గ్రిప్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు కెమెరా బటన్‌లా, తీసేస్తే సెల్ఫీలు/ట్రైపాడ్ షూట్ కోసం వైర్లెస్ రిమోట్‌లా పనిచేస్తుంది. 109 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ గ్రిప్‌ను.. బ్యాగ్‌లో, పాకెట్లో సులభంగా తీసుకెళ్లవచ్చు.
ధర: రూ. 1,999 ,
దొరుకుచోటు: అమెజాన్

ఒకేసారి నాలుగైదు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను చార్జ్ చేయాలంటే చాలా కష్టం. ఇక ప్రయాణాల్లో అయితే.. నాలుగైదు చార్జర్లను వెంట తీసుకెళ్లడం కూడా ఇబ్బందికరం. ఈ సమస్యకు URBN 200W 6 port GaN Power Hub చక్కని పరిష్కారం చూపుతుంది. నెక్ట్స్ జనరేషన్ GaN సాంకేతికతతో రూపొందించిన ఈ పవర్ హబ్.. ఆరు హై-స్పీడ్ చార్జింగ్ పోర్ట్‌లను కలిగి ఉంటుంది. మొత్తం 200W పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. దీని ద్వారా ఒకేసారి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఇతర యాక్సెసరీలను వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. 12-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఇంటెలిజెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ లాంటి అనేక ప్రత్యేకతలున్న ఈ పవర్ హబ్.. డెస్క్‌పై కేబుల్ వైర్ల
గందరగోళాన్నీ తగ్గిస్తుంది.
ధర: రూ.6,999
దొరుకుచోటు: అమెజాన్

వినూత్నమైన డిజైన్, డిస్ప్లే కేస్, మంచి బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్ కావాలా? అదికూడా తక్కువ ధరలో కోరుకుంటున్నారా? అయితే.. Lava Probuds Xplore 25 డిగ్రీస్పై ఓ లుక్కేయండి. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్.. యూత్‌ను, టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇది సాధారణ చార్జింగ్ బాక్స్లా కాకుండా.. ప్రత్యేకమైన మెకానికల్ పాప్-అప్ మెకానిజంతో ఉంటుంది. ఈ చార్జింగ్ కేస్‌పై 1.69 అంగుళాల కలర్ డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా ఫోన్ తీసే అవసరం లేకుండానే.. బ్యాటరీ లెవెల్స్, కనెక్షన్ స్టేటస్ లాంటివి సులభంగా చూసుకోవచ్చు. మంచి బేస్, క్లియర్ వాయిస్ కోసం.. ఇందులో 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. అలాగే కాల్స్
మాట్లాడేటప్పుడు వెనుక వచ్చే శబ్దాలను (నాయిస్) తగ్గించడానికి ఈఎన్సీతో కూడిన క్వాడమైక్ సెటప్ కూడా ఉంది. గేమింగ్ ఆడేటప్పుడు ఆడియో ఆలస్యం కాకుండా లో-లేటెన్సీ మోడ్‌ను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. కేస్-ఇయర్‌బడ్స్ కలిపి మొత్తంగా 50 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తాయి. కేవలం 10 నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల పాటు వాడుకోవచ్చు. డ్యూయల్ డివైజ్ పేరింగ్ ద్వారా.. ఒకేసారి రెండు డివైజెస్ (ఫోన్, ల్యాప్‌టాప్)కు కనెక్ట్ కావచ్చు.
ఐపీఎక్స్ 4 రేటింగ్ ఉండటం వల్ల.. చెమట, నీటి చినుకుల నుంచి రక్షణ అందిస్తాయి.
ధర: రూ. 1,999
దొరుకుచోటు: అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్స్