కొంతమంది మాట్లాడితే వినసొంపుగా ఉంటుంది. వాళ్లెంత సేపు మాట్లాడినా విసుగు రాదు. మరికొంతమంది మాట్లాడుతుంటే ‘ఎప్పుడు నోరు మూస్తార్రా బాబూ!’ అన్నట్టుంటుంది. ఇంకొంతమంది డబ్బాలో రాళ్లు పోసినట్టు మాట్లాడుతూనే ఉంటారు.
స్కూలురోజుల్లో ఎవరు ఎలా మాట్లాడినా పిల్లలు వింటారు. పారిపోవడానికి వీల్లేకుండా వాళ్లను ట్యూన్ చేస్తారు కనుక! తరువాతి రోజుల్లోనే కష్టం. ముఖ్యంగా కరోనా తరువాత విద్యార్థులు నలభై నిమిషాల క్లాసులో కూర్చోవడమే గగనంగా ఉంటున్నదని టీచర్ల ఉవాచ. మా బడిలో ఆ రోజుల్లో కూడా పేరెంట్స్ కమిటీ ఉండేది. జాతీయ పండుగలప్పుడో, బాలల దినోత్సవానికో పేరెంట్స్ కమిటీ నుంచి ఒకర్నో ఇద్దర్నో పిలిచేవారు. వాళ్లు నిజానికి మంచి వక్తలు కారు గానీ, అప్పటికి తోచిందేదో వాళ్లకు వచ్చిన రీతిలో మాట్లాడేవారు. అందులో మా ఫ్యామిలీ డాక్టరు ఒకాయన ఉండేవాడు.
ఆయన చాలా మంచివాడు. ఆజానుబాహువు, ఎప్పుడూ తెల్లటి దుస్తుల్లో డాక్టరు అంటే ఇలా ఉండాలి అనేలా ఉండేవాడు. మెత్తగా, మృదువుగా మాట్లాడేవాడు. మాకు జ్వరం వస్తే ఆయనే మా ఇంటికి వచ్చేవాడు. ‘ఏమైంది బిడ్డా, అయ్యో జ్వరమొచ్చిందా?! ఏం గాదు.. ఒక్కరోజుల తక్వ అయితది. నేను మందిస్తా గదా!’ అని తియ్యటి పొడి నోట్లో వేసేవాడు. హోమియో మాత్రలు… అవి కూడా తియ్యటివే… ఇచ్చేవాడు. ఒక్కరోజులో జ్వరం తగ్గిపోయేది. అయినా ఆ మాత్రల కోసం మేము జ్వరం తగ్గలేదని చెబుతూ ఉండేవాళ్లం.
డాక్టరు గారి పిల్లల్లో ఇద్దరు మా సీనియర్స్, ఒకరు మా క్లాస్మేట్, మరొకరు మా జూనియర్ ఉండేవారు. ఆయన మా స్కూలు పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడుగా ఉండేవాడు గనుక ఎక్కువగా బడికి ఆహ్వానించేవారు. అయితే, డాక్టరుగా, వ్యక్తిగా మంచివాడే గానీ… వక్తగా కాదు. అతిథులు వచ్చేముందే మా వరదా రెడ్డి సారు గానీ, పీఈటీ సారు గానీ వచ్చి ‘అరేయ్ ఎవరన్న లొల్లిబెట్టుడు గానీ, పిల్లికూతలు కూసుడు గానీ, పక్కోణ్ని గెలుకుడు గానీ చేసిన్రనుకోండి…. ఒక్కొక్కని బొక్కలిరగ్గొడుత. ఇగో.. ఆడిపిల్లగాండ్లకు గూడ జెప్తున్న, మీరు గుసగుస ముచ్చట్లు పెట్టుడు గానీ, కిస్సకిస్స నవ్వుడు గానీ, గల్లర గల్లర గాజుల చప్పుడు చేసుడు గానీ చేసిన్రో… ఎండల నిలబెడ్త, లేకుంటె బడి చుట్టు వంద రౌండ్లు కొట్టిస్త. నేను అందర్ని చూస్తనే ఉంట… దేవేంద్రుని లెక్క నాకు వెయ్యి కండ్లు… ఎరికేనా?! అందరు మంచిగ చేతులు కట్టుకోని, చకిలం ముకిలం పెట్టుకోని కూచోండి’ అని వంద సూచనలు ఇచ్చి వెళ్లేవారు.
తీరా అతిథులు వచ్చాక మా హెచ్చెమ్ గారు మాట్లాడి ‘ఇప్పుడు డాక్టరు గారు తమ సందేశం ఇస్తారు’ అనగానే పిల్లలంతా ఒక్కసారే అలర్ట్ అయ్యేవారు. ఆయన స్పీచ్ మొదలుపెట్టి సరిగ్గా గంటన్నర మాట్లాడేవాడు. అంటే చాలా మాట్లాడాడని కాదు. ‘ఈ రోజూ … ఊ …ఊ …ఊ .. చాలా … ఆ..ఆ … ఆ … సుదినం. మన… ఆ… ఆ… ఆ… చాచా నెహ్రూ.. ఊ… ఊ… ఊ.. పుట్టిన .. ఆ.. ఆ.. ఆ… దినం. ఆయనకూ.. ఊ …ఊ …ఊ.. పిల్లలంటే.. ఏ.. ఏ… ఏ.. చాలా.. ఆ.. ఆ… ఆ ఇష్టం’ ఇలా ఒక్కో మాటకూ దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతూ ఉంటే ముందు వరుసల్లో కూర్చున్న ఆడపిల్లలం నిద్ర, నవ్వు .. రెండూ ఆపుకోలేక చచ్చిపోయేవాళ్లం.
అప్పుడప్పుడూ పోలీస్ ఇనస్పెక్టర్నీ, రైల్వేస్టేషన్ మాస్టర్నీ, బ్యాంకు మేనేజర్నీ పిలిచేవాళ్లు. అలాగే కృష్ణయ్య అనే ఆరెంపీ డాక్టరును కూడా పిలిచేవాళ్లు. ఆయన ఏ సందర్భానికైనా ఒకటే స్పీచ్ ఇచ్చేవాడు. అసలు జీవితానికంతా అదొక్కటే ప్రిపేర్ అయ్యాడనుకుంటా. ‘మీరు పిల్లలు. పిల్లలంటె ఎట్లుండాలె ?! పెద్దోళ్లు జెప్పినట్టు ఇనాలె. ఇంటరా?! అబద్ధాలు ఆడొద్దు.
ఆడకుండ ఉంటరా?! నిజం మాట్లాడాలె, మాట్లాడుతరా?! బాగ చదువుకోవాలె, చదువుకుంటరా?!’ ఇలా ఎన్నో ప్రశ్నలు, సలహాలతో సూక్తి ముక్తావళి సాగాక కాస్త కనికరించి.. ‘అసలు నేనెంత కష్టపడ్డనో మీకేమెరుక?! ఇప్పుడు నాకున్న డిగ్రీలతో ఒక పేదవాని గుడిసె కప్పొచ్చు. తెల్సిందా?!’ అనేవాడు. ఓసారి అబ్బాయిల్లో ఒకడు ‘మా గుడిసె కమ్మలు ఎగిరిపోయినయి, కప్పుతరా సార్?!’ అని అడిగినందుకు ఆ మీటింగ్ అయ్యాక మా పీఈటీ సారు అతనికి బడితె పూజ చేశాడు.
ఆ కృష్ణయ్య గారు కొన్నాళ్లు క్లినిక్ ఓపెన్ చేసి నడిపించాక… కొద్ది కాలానికి ఒకరిద్దరు డాక్టర్లను పెట్టుకుని నర్సింగ్ హోం నిర్వహించాడు. అప్పుడు మందులషాపు కూడా నడిపేవాడు. ఆ టైమ్లో వాళ్ల హాస్పిటల్లో ఎవరో పేషెంటుకు ఇంజక్షన్ వికటించి చనిపోతే వాళ్ల వాళ్లు వచ్చి హాస్పిటల్ మీద దాడి చేసి ధ్వంసం చేశారు.
కొన్నాళ్లకు ఆయన మరో డిగ్రీ బయటకు తీసి అడ్వకేట్ వీకేజే అనే పేరుతో బోర్డు కట్టాడు. అదీ నడవలేదో ఏమో… ఇంకొన్నాళ్లకి ఆ బిల్డింగుని మినీ ఫంక్షన్ హాలుగా మార్చాడు’ అదేమిటీ .. తన డిగ్రీలతో కప్పకుండా సిమెంట్ స్లాబ్ వేయించాడేమిటీ ?!’ అని ఊర్లో కొందరు సరదాగా అనుకునేవారు. ఆ తరువాత ఎన్నో మంచి ఉపన్యాసాలనూ, అంతకుమించిన చచ్చు స్పీచ్లనూ విన్నా… మొదట
గుర్తొచ్చేది వీళ్లిద్దరే!!
‘మీరు పిల్లలు. పిల్లలంటె ఎట్లుండాలె ?! పెద్దోళ్లు జెప్పినట్టు ఇనాలె. ఇంటరా?! అబద్ధాలు ఆడొద్దు. ఆడకుండ ఉంటరా?! నిజం మాట్లాడాలె, మాట్లాడుతరా?! బాగ చదువుకోవాలె, చదువుకుంటరా?!’ ఇలా ఎన్నో ప్రశ్నలు, సలహాలతో సూక్తి ముక్తావళి సాగాక కాస్త కనికరించి.. ‘అసలు నేనెంత కష్టపడ్డనో మీకేమెరుక?! ఇప్పుడు నాకున్న డిగ్రీలతో ఒక పేదవాని గుడిసె కప్పొచ్చు. తెల్సిందా?!’ అనేవాడు.
-నెల్లుట్ల రమాదేవి రచయిత్రి